ఈ చావులకు బాధ్యులెవరు ? | Who is responsible to these deaths ? | Sakshi
Sakshi News home page

ఈ చావులకు బాధ్యులెవరు ?

Published Sun, Sep 18 2016 5:18 PM | Last Updated on Mon, Sep 4 2017 2:01 PM

ఈ చావులకు బాధ్యులెవరు ?

ఈ చావులకు బాధ్యులెవరు ?

* జిల్లాలో పెరుగుతున్న డెంగీ మరణాలు
బెంబేలెత్తుతున్న జనం 
మరణాలు లేవంటున్న వైద్య అధికారులు
శాఖల మధ్య కొరవడిన సమన్వయం
 
గుంటూరు మెడికల్‌ : జిల్లావాసులను డెంగీ జ్వరం వణికిస్తోంది. పల్లె, పట్నం అనే తేడా లేకుండా ఎక్కడ చూసినా డెంగీ పేరే వినిపిస్తోంది. జ్వరబాధితులతో ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. ప్రతిరోజూ జిల్లాలో ఏదో ఒక చోట డెంగీతో మృతిచెందిన కేసులు నమోదవుతుండటం పరిస్థితికి తీవ్రతకు నిదర్శనం. జ్వరాలు వ్యాపించకుండా, మరణాలు సంభవించకుండా ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వ శాఖలు మీనమేషాలు లెక్కిస్తున్నాయి. 
 
మంచానికే పరిమితం...
గ్రామాల్లో అనేక మంది వ్యాధి బారిన పడి మంచానికే పరిమితమవుతున్నారు. పట్టణాల్లోని పలు ప్రైవేటు ఆస్పత్రులు డెంగీ బాధితులతో కిటకిటలాడుతున్నాయి. పలు ప్రాంతాల్లో విద్యార్థులు, వృద్ధులు, యువత అనే తేడా లేకుండా పలువురు మృత్యువాత పడుతున్నారు. వైద్య అధికారులు మాత్రం డెంగీ మరణాలు జిల్లాలో ఇప్పటి వరకు లేవని, కేవలం తాడేపల్లిలో సంభవించిన బాలుడి మరణమే డెంగీ అనుమానాస్పదమని చెబుతున్నారు. 
 
పరీక్షల్లో పాజిటివ్‌.. నిర్ధారణకు నో!
రాష్ట్ర ప్రభుత్వం మెడాల్‌ కంపెనీ ద్వారా ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా డెంగీ నిర్ధారణ పరీక్షలు చేయిస్తోంది. వీరి పరీక్షల్లో అధిక సంఖ్యలో డెంగీ నిర్ధారణ నివేదికలు ప్రభుత్వానికి అందుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు వాటిని డెంగీ పాజిటివ్‌గా నిర్ధారణ చేయవద్దంటూ జిల్లా ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. కేవలం గుంటూరు వైద్య కళాశాలలో ఎలీసా పద్ధతిలో నిర్ధారణ జరిగే డెంగీ జ్వరాలనే అధికారికంగా వైద్య అధికారులు పరిగణనలోకి తీసుకుంటున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల మధ్య డెంగీ నిర్ధారణపై భేదాభిప్రాయాలు రావడంతో జ్వర బాధితులు తమకు డెంగీ ఉన్నట్టా, లేనట్టా అన్న విషయం తేల్చుకోలేక తర్జనభర్జన పడుతున్నారు. కొంతమంది వ్యాధి నిర్ధారణ తేలేలోపు ప్రాణాలు సైతం కోల్పోతున్నారు. 
 
డెంగీ జ్వరం లక్షణాలివీ...
పగటి వేళల్లో కుట్టే ఎడిస్‌ ఈజిప్ట్‌ అనే దోమ కాటు ద్వారా డెంగీ జ్వరం వస్తుంది. జ్వరంతో పాటు విపరీతంగా తలనొప్పి, ఒళ్లునొప్పులు, కీళ్లనొప్పులు, కంటిలోపల కదలికలు తగ్గడం, వాంతి అయినట్లు భ్రాంతి కలగటం, నోరు ఎండిపోతూ ఎక్కువగా దాహం వేయడం లాంటి లక్షణాలు వ్యాధి సోకిన వారిలో కనిపిస్తాయి.
 
ప్లేట్‌లెట్లపై అపోహలు వీడండి...
ఎలాంటి జ్వరం వచ్చినా ప్లేట్‌లెట్లు తగ్గటం సహజం. అంతమాత్రానికే కంగారు పడకూడదు. సాధారణంగా 1.5 లక్షల నుంచి 4.5 లక్షల వరకు ప్లేట్‌లెట్లు ఉంటాయి. వీటి సంఖ్య 20 వేల కన్నా తక్కువగా ఉన్నప్పటికీ ఎలాంటి ప్రమాదం సంభవించదు. శరీరంపై ఎర్రటి దద్దుర్లు ఏర్పడి అవి పగిలి వాటి ద్వారా రక్తం వస్తే, మూత్రంలో, దగ్గుతున్నప్పుడు కళ్లె ద్వారా రక్తం పడిపోతూ ఉంటే అప్పుడు ప్లేట్‌లెట్స్‌ ఎక్కించాల్సి ఉంటుంది.
డాక్టర్‌ కేళంగి రాజేంద్రకుమార్, ప్రభుత్వ జ్వరాల ఆస్పత్రి ప్రొఫెసర్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement