కాలువ గండిపై విచారణ జరిపించాలి
కాలువ గండిపై విచారణ జరిపించాలి
Published Sat, Aug 6 2016 7:45 PM | Last Updated on Tue, May 29 2018 4:26 PM
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కొలుసు పార్థసారథి
సీతారామపురం(నూజివీడు) :
పోలవరం కుడి కాలువకు పడిన గండి విషయంలో కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలతో విచారణ చేయించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొలుసు పార్థసారథి ధ్వజమెత్తారు. పోలవరం కుడి కాలువ అండర్‌టన్నెల్‌కు గండి పడిన ప్రాంతాన్ని శనివారం పరిశీలించారు. కాలువ ఎస్‌ఈ వై.శ్రీనివాసయాదవ్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పార్థసారథి మాట్లాడుతూ జల వనరులశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, వాస్తవాన్ని వదిలేసి విద్రోహులు చేశారంటూ అసలు విషయాన్ని పక్కదారి పట్టించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గండి పడి ఆరురోజులవుతున్నా ఇప్పటి వరకు శాఖాపరమైన విచారణ చేయించకపోవడంపై విస్మయం వ్యక్తం చేశారు. విద్రోహుల పనే అయితే ఈ గండి ద్వారా నీళ్లు ఎక్కడికి వెళ్లాయి, ఎవరికి లబ్ధిచేకూరిందనే దానినైనా గుర్తించారా అని ప్రశ్నించారు. నీళ్లతో రెండు వేల ఎకరాల్లోని చేపల చెరువులను నింపుకున్నారని, దీనిని ఎందుకు గుర్తించడం లేదని నిలదీశారు. కోట్లాది రూపాయల ప్రజాధనంతో నిర్మించిన కాలువకు గండి పడినప్పుడు ప్రాథమిక నివేదికను అధికారులు ఇవ్వాలని, ఇది ఎవరి వైఫల్యమో తేల్చి చర్యలు తీసుకోవాల్సి ఉన్నప్పటికీ ఇంత వరకు ప్రభుత్వం ఈ గండి పై నోరుమెదపక పోవడాన్ని బట్టే దీని వెనుక ఎవరున్నారో అర్థమవుతోందన్నారు. ప్రజలసొమ్ము అంటే ప్రభుత్వానికి బాధ్యత లేకుండా పోయిందని, ఇష్టారాజ్యంగా దోపిడీ జరుగుతోందని ధ్వజమెత్తారు. పార్థసారథి వెంట గన్నవరం నియోజకవర్గ సమన్వయకర్త దుట్టా రామచంద్రరావు, బాపులపాడు జెడ్పీటీసీ సభ్యురాలు కైలే జ్ఞానమణి, వైఎస్సార్‌సీపీ జిల్లా సంయుక్త కార్యదర్శి కోడెబోయిన బాబి, జిల్లా కార్యదర్శి నక్కా గాంధీ, ఎంపీటీసీలు బేతాల ప్రమీలారాణి, కొనకళ్ల వెంకటేశ్వరరావు ఉన్నారు.
యుద్ధప్రాతిపదికన పనులు
పోలవరం కుడికాలువపై రామిలేరుపై ఉన్న యూటీకి పడిన గండిని పూడ్చేందుకు గాను యుద్ధప్రాతిపదికన పనులు జరిగేలా చర్యలు తీసుకున్నట్లు జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. గండి పూడ్చివేత పనులను శనివారం పరిశీలించారు. అండర్‌టన్నెల్ స్లాబ్‌ను ఆనుకుని చేస్తున్న ఆఫ్రాన్ త్వరితగతిన పూర్తిచేయాలని ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరరావు, పోలవరం సీఈ రమేష్‌బాబులను ఆదేశించారు. పనులన్నీ పూర్తయిన తరువాత మరల పట్టిసీమ నుంచి నీటిని విడుదల చేసి కృష్ణాడెల్టాకు గోదావరి జలాలను అందించనున్నట్లు చెప్పారు. ఉమాతో పాటు పోలవరం కాలువ ఎస్‌ఈ వై.శ్రీనివాస్ యాదవ్, జల వనరులశాఖ ఎపెక్స్ కమిటీ సభ్యుడు ఆళ్ల గోపాలకృష్ణ, కృష్ణా తూర్పుడెల్టా ప్రాజెక్టు కమిటీ చైర్మన్ గుత్తా శివరామకృష్ణ ఉన్నారు.
Advertisement