ప్రజాధనం దుర్వినియోగం చేస్తే ఊరుకోను
-
ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి
-
స్వర్ణాల చెరువు వద్ద ఘాట్ల పరిశీలన
నెల్లూరు (బృందావనం): ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తే ఉపేక్షించనని, వారిపై చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు తన వంతు పోరాటం సాగిస్తానని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పేర్కొన్నారు. దర్గామిట్టలోని బారాషహీద్ దర్గాను బుధవారం ఆయన సందర్శించారు. కార్పొరేషన్, టూరిజం శాఖల అధికారులతో కలిసి ఘాట్లు, రహదారులు, మరుగుదొడ్లు, తదితర పనులను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు. బారాషహీద్‌దర్గా పరిసరాల్లో ఘాట్లు, మరుగుదొడ్లు, బాత్‌రూమ్‌లు, రహదారులు, తదితర పనుల్లో నాణ్యత లోపించి, అవినీతి, అక్రమాలు జరిగాయని పత్రికల్లో కథనాలు వచ్చిన నేపథ్యంలో పరిశీలన నిమిత్తం తాను వచ్చానని చెప్పారు. రొట్టెల పండగ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో బారాషహీద్ దర్గాను దర్శించుకునే భక్తుల కోసం సుమారు రూ.ఏడు కోట్లను ఖర్చుచేశారని, అయితే వీటి నాణ్యతప్రమాణాలు ప్రశ్నార్థకంగా ఉన్నాయని టూరిజం, నగరపాలక సంస్థ అధికారులను ప్రశ్నించారు. ప్రజాప్రతినిధులు, కాంట్రాక్టర్ల కోసం అధికారులు తప్పిదాలుచేస్తే తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు. అధికారులను ఇబ్బందిపెట్టడం తన ఉద్దేశం కాదని చెప్పారు. ఘాట్లు, మరుగుదొడ్లలో టైల్స్ లేచిపోవడం, పరిస్థితి అధ్వానంగా ఉండటం దారుణమన్నారు. పనుల వివరాలను తనకు తెలియజేయాలని, ఘాట్ల అక్రమ నిర్మాణంపై తక్షణమే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. టూరిజం శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ శ్యామ్‌సుందరరాజు, ఈఈ లక్ష్మీరంగయ్య, వర్క్ ఇన్‌స్పెక్టర్లు శ్రీనివాసులు, కార్పొరేషన్ డీఈ ఖాదర్‌షరీఫ్ పనుల వివరాలను ఎమ్మెల్యేకు తెలియజేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరాధ్యక్షుడు తాటి వెంకటేశ్వరరావు, నాయకులు హంజాహుస్సేన్, సలీం, అబూబకర్, డాక్టర్ సత్తార్, హజరత్‌నాయుడు, చిన్నమస్తాన్, రియాజ్, నరసింహయ్య ముదిరాజ్, పురుషోత్తమ్‌యాదవ్, చెక్కా సాయిసునీల్, పంట్రంగి అజయ్, పర్వతాల శ్రీనివాస్‌గౌడ్, తాళ్లూరు సురేష్‌బాబు, వేల్పుల అజయ్, తదితరులు పాల్గొన్నారు.