నాగోలు: ఆ మహిళకు పెళ్లైంది, కానీ మళ్లీ వేరే వ్యక్తులతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఆ సంబంధమే ఆ మహిళ మరణానికి కారణమైంది. అసలు విషయానికొస్తే.. వివాహేతర సంబంధం కలిగి ఉన్న మహిళ వద్ద బంగారాన్ని కాజేయడమేగాక ఆమెను దారుణంగా హత్య చేసిన సంఘటనలో ఇద్దరు నిందితులను వనస్థలిపురం పోలీసులు అరెస్ట్ చేసి వారి నుంచి రూ.1.30 లక్షలు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. మంగళవారం సైబరాబాద్ ఈస్ట్ కమిషనర్ మహేష్ భగవత్ కేసు వివరాలు వెల్లడించారు. చాంద్రాయణగుట్టకు చెందిన అర్చన(24), రామస్వామి ప్రేమవివాహం చేసుకుని ద్వారకామయినగర్‌లో నివాసం ఉంటున్నారు.
తమిళనాడు మధురై జిల్లాకు చెందిన స్వామినాయుడు రాజ్‌కుమార్ (30) నగరానికి వలస వచ్చి బండ్లగూడ పటేల్‌నగర్‌లో నివాసముంటూ టిఫిన్ సెంటర్ నిర్వహిస్తుండగా, అదే ప్రాంతానికి చెందిన ముత్తు రాము చాంద్రాయణగుట్టలో నివాసముంటూ పాపడాల వ్యాపారం చేసే వాడు. అర్చనతో స్వామినాయుడికి వివాహేతర సంబంధం ఉండటమేగాక ఆర్థిక లావాదేవీలు నడుస్తుండేవి. ఈ నేపథ్యంలో ఆమె వద్ద ఉన్న డబ్బు, బంగారాన్ని కాజేయాలనుకున్న స్వామినాయుడు ముత్తురాముతో కలిసి ఆమెను హతమార్చాలని పథకం పన్నాడు. గత నెల 28న అర్చన ఇంటికి వెళ్లి ఆమెతో కలిసి మద్యం సేవించారు.
మత్తులో ఉన్న అర్చన గొంతు నులిమి హత్య చేసి బంగారు గొలుసు, చెవి కమ్మలు, నగదు, ఇతర వస్తువులను తీసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లుగా నమ్మించేందుకు మృతదేహాన్ని ఫ్యాన్‌కు వేలాడదీసి బయటి నుంచి గడియపెట్టి పారిపోయారు. ఇదిలా ఉండగా అర్చన దత్తతకు తీసుకున్న చిన్నారి ఏడుపువిని వచ్చిన స్థానికులు వనస్థలిపురం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడ లభించిన మద్యం బాటిళ్లు, సిగరెట్లు, సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా నిందితులను అదుపులోకి తీసుకున్నారు. రూ.1.30 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, నగదును స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో ఎల్‌బీనగర్ డీసీపీ తఫ్సీర్ ఇక్బాల్, వనస్థలిపురం ఏసీపీ భాస్కర్‌గౌడ్, సీఐ మురళీకృష్ణ, ఎస్‌ఐలు మహేష్, నాగరాజు, విజయ్ పాల్గొన్నారు.