దేశం కోసం పనిచేయాలి
నెల్లూరు(బారకాసు): ప్రతి ఒక్కరూ దేశం కోసం పనిచేస్తేనే జన్మకు సార్ధకత లభిస్తుందని భారతీయ జనతా యువమోర్చా జిల్లా అధ్యక్షుడు మొగరాల సురేష్ అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపు మేరకు తిరంగాయాత్రలో భాగంగా ఆదివారం రాత్రి నెల్లూరులోని వీఆర్‌సీ నుంచి గాంధీబొమ్మ సెంటర్ వరకు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. సురేష్ మాట్లాడుతూ స్వాతంత్య్రం కోసంప్రాణాలను త్యాగం చేసిన వారిని మననం చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి భారత పౌరుడిపై ఉందన్నారు. వారి పోరాట స్ఫూర్తితో నేటి తరం యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఒక్కప్పుడు స్వేచ్ఛ కోసం ఉద్యమాల జెండాను చేత పట్టిన జాతి నేడు నాది అన్న స్వార్ధంతో బందీ అయిందన్నారు. నేటి యువత యాంత్రిక జీవితాన్ని గడుపుతోందని, అలా కాకుండా చదువుతో పాటు స్వాతంత్ర పోరాట చరిత్రను ఒకసారి నెమరువేసుకుంటే తాము చేస్తున్న తప్పులు ఏమిటనేవి తెలుస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ సొంత జీవితానికే కాకుండా కొంత సమయాన్ని దేశం కోసం కేటాయించాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ నగర అధ్యక్షుడు మండ్ల ఈశ్వరయ్య, బీజేవైఎం నాయకులు ఫణిరాజు, ప్రసాద్, మల్లికార్జున పెంచలయ్య, మధుసూధన్‌రావు, ఆవుల నాగేంద్ర, రాధాకృష్ణ, అశోక్, క్రిష్ణ, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.