ఐదుగురిపై కత్తితో దాడి | Young person attack on the five members | Sakshi
Sakshi News home page

ఐదుగురిపై కత్తితో దాడి

Published Fri, Aug 12 2016 7:19 PM | Last Updated on Thu, Apr 4 2019 5:25 PM

నిందితుడు వినోద్‌కుమార్‌ - Sakshi

నిందితుడు వినోద్‌కుమార్‌

పాతకక్షలే కారణం
నలుగురు మహిళలు, బాలుడికి గాయాలు 
ఇద్దరి పరిస్థితి విషమం
నాదెండ్ల బీసీ కాలనీలో ఘటన 
 
నాదెండ్ల: పాతకక్షల నేపథ్యంలో ఉన్మాదిగా మారిన యువకుడు నలుగురు మహిళలను, ఒక బాలుడిని కత్తితో విచక్షణా రహితంగా దాడిచేసి గాయపరిచిన సంఘటన మండల కేంద్రమైన నాదెండ్లలో శుక్రవారం సంచలనం రేపింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు గ్రామంలోని బీసీకాలనీ ఉరవకట్ట సెంటర్‌లో నివాసం ఉండే అలుగునీడి వినోద్‌ కుమార్‌ ఇంటిఎదురుగా నివాసం ఉంటున్న నలుగురు మహిళలను, ఒక బాలుడిని కత్తితో దాడిచేసి గాయపరిచాడు. 
 
పాతకక్షలే కారణం..
బీసీ కాలనీలో నివాసం ఉండే అలుగునీడి శివయ్య కుమారుడు వినోద్‌కుమార్‌ తిమ్మాపురంలోని ఓ స్పిన్నింగ్‌మిల్లులో ఎలక్ట్రికల్‌ పనులు చేస్తున్నాడు. ఎదురింట్లో  ఉన్న షేక్‌ నాగార్జున కుటుంబంతో వీరికి పాత కక్షలు ఉన్నాయి. గత ఏడాది వినోద్‌ కుమార్‌ తల్లి పూర్ణమ అనారోగ్యంతో  మతి చెందారు. గురువారం ఆమె మొదటి వర్ధంతి జరుపుకున్నారు. తన తల్లి మరణానికి ఎదురింటివారి వేధింపులే కారణమని భావించిన వినోద్‌ కుమార్‌ వారిపై కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలో ఇరు కుటుంబాల మధ్య గురువారం రాత్రి వివాదం కొనసాగింది.

శుక్రవారం ఉదయం కూడా ఇరుకుటుంబాల మధ్య కలహాలు జరిగాయి. దీంతో వినోద్‌కుమార్‌  చిలకలూరిపేటకు వచ్చి కొబ్బరిబోండాలు నరికే కత్తి కొలుగోలు చేసి ఇంటికి చేరుకున్నాడు. ఉదయం 10గంటల సమయంలో ఎదురింట్లో పురుషులు ఎవరూ లేని సమయం చూసి వారి ఇంట్లోకి చొరబడ్డాడు. నాగార్జున తల్లి షేక్‌నాగూర్‌బీ, భార్య షేక్‌ బాజీ, ఆరేళ్ల కుమారుడు షేక్‌ సాయిపై కత్తితో వినోద్‌కుమార్‌ దాడి చేశాడు. పెద్దగా కేకలు వినబడటంతో పక్కనే నివాసం ఉంటున్న బాజీ తల్లి మస్తాన్‌బీ, మరో మహిళ షేక్‌ బీబీజాన్‌ అడ్డుకోవటానికి ప్రయత్నించగా వారిపై కూడా దాడికి పాల్పడ్డాడు. ఇరుగుపొరుగువారు గుమిగూడి వినోద్‌ చేతిలోని కత్తిని లాక్కోవడంతో జేబులో దాచుకున్న మరో చిన్న కత్తిని బయటికి తీశాడు. ఆ కత్తిని కూడా స్థానికులు లాక్కొని నిందితుడిని పోలీసులకు అప్పగించారు. గాయపడిన షేక్‌ నాగుర్‌బీ, మస్తాన్‌బీలను చిలకలూరిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు.  షేక్‌ బాజీ, షేక్‌ సాయి, షేక్‌ బీబీజాన్‌లను 108 వాహనంలో కోండ్రుపాడులోని కేఎంసీ ఆస్పత్రికి తరలించారు.వీరిలో షేక్‌ బాజీ, షేక్‌ మస్తాన్‌బీల పరిస్థితి విషమంగా ఉండటంతో గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. తన తల్లి మనస్థాపానికి గురై మరణించిందని, అందుకే వారిపై కక్ష తీర్చుకోవటానికిదాడిచేసినట్టు పోలీసుల అదుపులో ఉన్న వినోద్‌కుమార్‌ చెప్పాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement