సునీల్ కేసును పట్టించుకోకపోవడం దారుణం
కేసు నమోదు చేయకుంటే జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు నారాయణస్వామి వెల్లడి
తిరుపతి మంగళం/ శ్రీరంగరాజపురం /తిరుపతి రూరల్/ మదనపల్లె సిటీ/: పూతలపట్టు ఎమ్మెల్యే సునీల్‌కుమార్ ఎస్సీ వర్గానికి చెందిన వారని అధికారులు, టీడీపీ నాయకులు చిన్నచూపు చూస్తారా? అని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, గంగాధరనెల్లూరు ఎమ్మెల్యే కళత్తూరు నారాయణస్వామి ప్రశ్నించారు. శనివారం ఆయన ఫోన్లో విలేకరితో మాట్లాడారు.
ఐరాల మండల సమావేశానికి సునీల్ హాజరైనా, సమావేశం నిర్వహించకుండా టీడీపీకి చెందిన సింగిల్ విండో చైర్మన్ గిరినాయుడు రాలేదని సుమారు మూడు గంటలసేపు ఎమ్మెల్యేను నిరీక్షింపజేశారని, ఆ తర్వాత వచ్చిన గిరినాయుడు ఎమ్మెల్యేపై దురుసుగా ప్రవర్తించి కులం పేరుతో దూషించారని ఆందోళన వ్యక్తం చేశారు.
గిరినాయుడుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డీఎస్పీకి ఫిర్యాదు చేసినా ఇంతవరకు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. వెంటనే గిరినాయుడుపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
శ్రీరంగరాజపురంలో అక్రమంగా కేసులు
శ్రీరంగరాజపురం మండల పరిషత్ కార్యాలయంలో జెడ్పీటీసీ సభ్యుడు విజయ్‌కుమార్‌కు చాంబరే లేదు, ఆయన కుర్చీ విరిచారని వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు 17 మందిపై కేసులుపెట్టడం ఎంతవరకు న్యాయమని ఎమ్మెల్యే నారాయణస్వామి ఎస్‌ఐ అరుణ్‌కుమార్‌రెడ్డిని ప్రశ్నించారు. శనివారం ఆయన శ్రీరంగరాజపురంలో పోలీసుస్టేషన్‌కు వెళ్లారు. విజయ్‌కుమార్ ఆస్తులు ధ్వంసం చేశారా? ఆయనపై దౌర్జన్యం చేశారా? ఎవరి ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేశారు? కేసులు నమోదు చేయాలని ఒత్తిడి తెచ్చిన వ్యక్తి ఎవ్వరు తేల్చాలని స్టేషన్లో బైఠాయించారు.
నిందితులను వెంటనే అరెస్టుచేయాలి
- ఎమ్మెల్యే చెవిరెడ్డి
ఎమ్మెల్యే సునీల్‌కుమార్‌ను అవమానించిన నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని వైఎస్సార్ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం తిరుపతిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ మండల సమావేశంలో తనపై గిరినాయుడు, బాలసుబ్రమణ్యం నాయుడు దాడికి యత్నించి. కులం పేరుతో దూషించారని సునీల్ ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. నిబంధనలకు విరుద్ధంగా అనధికార వ్యక్తులను వేదికపై కూర్చోపెట్టి ఎమ్మెల్యేని దూషించడానికి కారణమైన ఎంపీడీవోను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే హక్కులకు భంగం కలిగించిన వారిపై అసెంబ్లీ నైతిక విలువల కమిటీకి ఫిర్యాదు చేస్తామన్నారు.
అసెంబ్లీలో ప్రస్తావిస్తాం : ఎమ్మెల్యే తిప్పారెడ్డి
ఎమ్మెల్యే సునీల్‌కుమార్‌ను దుర్భాషలాడిన టీడీపీ నేతలపై కేసులు నమోదు చేయాలని మదనపల్లె ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి డిమాండ్ చేశారు. శనివారం మదనపల్లెలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఐరాల మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సంఘటనపై అసెంబ్లీలో ప్రస్తావిస్తామన్నారు. ప్రజాప్రతినిధికి ఇచ్చే గౌరవం అదేనా ? అని ప్రశ్నించారు.
పోలీసులకు మంచి బుద్ధి ప్రసాదించండి సారూ !
తిరుపతిలో అంబేడ్కర్ విగ్రహానికి వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ వినతిపత్రం
ఎమ్మెల్యే సునీల్‌ను కులం పేరుతో దూషించిన నిందితులను శిక్షించాలని వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు దామినేటి కేశవులు డిమాండ్ చేశారు. దళితులకు న్యాయం చేసేలా పోలీసులకు మంచి బుద్ధి ప్రసాదించు అంటూ శనివారం వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో తిరుపతిలో ఎస్వీ యూనివర్సిటీ ఎదుట ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. పోలీసులు ఇప్పటికైనా నిందితులపై అట్రాసిటీ కేసు నమోదు చే సి, వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు స్పందించకుంటే దళిత సంఘా ల ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించా రు. వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లారపు వాసు, అధికార ప్రతినిధి చాట్ల భానుప్రకాష్, హరిబాబు, సిద్దారెడ్డి, సునీల్, రామస్వామి, లోకనాథం పాల్గొన్నారు.