మరోసారి నేతల మకిలి!
పైత్యమనాలో, ఉన్మాదమనాలోగానీ... మన నేతలకు అది తరచు ప్రకోపిస్తుంటుంది. అందుకు కారణాలు వెతకడం వృథా. ఎందుకంటే చాలాసార్లు అకారణంగా దాన్ని ప్రదర్శించడం వారికి అలవాటైంది. పార్టీ నేతలుగా చలామణి అవుతున్నామని, మంత్రి పదవిని వెలగబెడుతున్నామని... దేనిపైన అయినా, ఎలాంటి అభిప్రాయాన్నయినా వ్యక్తం చేసే హక్కు తమకుందని వారు భావించుకుంటున్నారు. కాస్తయినా ఎదగాలని, అందరికీ ఆదర్శప్రాయంగా మెలగాలని ఆ బాపతు నాయకులు గుర్తించడం లేదు. తాజాగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీపై కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ చేసిన వ్యాఖ్యానాలు చూసినా... గోవాలో తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేస్తున్న నర్సులనుద్దేశించి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్ మాట్లాడిన మాటల్ని గమనించినా దిగ్భ్రాంతి కలుగుతుంది. సోనియాగాంధీ శ్వేత వర్ణ మహిళ అయినందువల్లే ఆమె కాంగ్రెస్ అధ్యక్షురాలయ్యారని గిరిరాజ్ అన్నారు. రాజీవ్‌గాంధీ ఏ నైజీరియా మహిళనో పెళ్లాడి ఉంటే ఆ మహిళకు కాంగ్రెస్ నాయకత్వాన్ని కట్టబెట్టేవారా అని కూడా ఆయనగారు ప్రశ్నించారు.
ఇందులో మహిళలను కించపరిచే ధోరణి మాత్రమే కాదు...జాత్యహంకార వైఖరి కూడా ఉంది. ఆయన నోటి వెంట ఈ మాటలు వెలువడినప్పుడు ఆ పక్కనున్న నాయకులు నవ్వులు చిందించి తామూ ఆ నేరంలో భాగస్వాములయ్యారు. సోనియాగాంధీని రాజకీయంగా విమర్శించడం, ఆమె విధానాలను వ్యతిరేకించడం వేరు. ఆమె వ్యతిరేకులూ, ఆమె సమర్థకులమధ్య అలాంటి అంశాల విషయంలో చర్చ జరిగినప్పుడు అందువల్ల సమాజానికి ఎంతో కొంత ఉపయోగం ఉంటుంది. నిజమైన రాజకీయ నాయకులు చేయవలసిన పని అది. కానీ గిరిరాజ్‌కూ, ఇలాంటి ఆరోగ్యవంతమైన చర్చలకూ ఎప్పుడూ చుక్కెదురే. మోదీ వ్యతిరేకులంతా పాకిస్థాన్ వెళ్లిపోవాలని లోక్‌సభ ఎన్నికల సమయంలో పిలుపునిచ్చింది ఈ పెద్ద మనిషే. ఆ తర్వాత కేంద్రమంత్రి పదవి రావడానికి ఇలా మాట్లాడటమే కారణమనుకోవడం వల్ల కావొచ్చు... ఆయన ఇదే ధోరణిని తరచు ప్రదర్శిస్తున్నారు. సోనియాపై తన వ్యాఖ్యలు మీడియాలో వెలువడ్డాక ఆయన కాస్త కూడా సిగ్గుపడలేదు. అవి ‘ఆఫ్ ది రికార్డు’గా అన్న మాటలని సమర్ధించుకుంటున్నారు. అంటే తన వాచాలత్వాన్ని ఎవరూ రికార్డు చేయడం లేదనుకుంటే ఆయన ఏమైనా మాట్లాడతారన్న మాట! పైగా ఆ వ్యాఖ్యలు సోనియాకూ, రాహుల్‌కూ ‘బాధ కలిగించి ఉంటే’ విచారిస్తున్నానని గిరిరాజ్ ముక్తాయించారు. నైజీరియా దౌత్య కార్యాలయం ఈ జాత్యహంకార వ్యాఖ్యలను తప్పుబట్టింది. క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది.
గిరిరాజ్ ఇలా నోరుపారేసుకున్న రోజే గోవా ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ సైతం ఈ తరహాలోనే మాట్లాడారు. తమ సమస్యల పరిష్కారం కోసం ధర్నా చేస్తున్న నర్సులనుద్దేశించి ‘ఇలా ఎండలోనే ఉంటే నల్లబడిపోతారు. పెళ్లిళ్లు కావడం కష్టం’ అంటూ వ్యాఖ్యానించారు. రోగుల స్థితిగతులెలా ఉన్నా కర్తవ్య నిష్టతో, సేవాభావంతో పనిచేసే పవిత్ర వృత్తి నర్సులది. ఏం చేసినా వారి రుణం తీర్చుకోలేనిది. ఆ కోర్సులు చేసినవారికి సరైన ఉపాధి కల్పించలేకా... ఉద్యోగాలిచ్చినా ఆ సేవలకు తగిన జీతభత్యాలు చెల్లించకా ప్రభుత్వాలు బాధ్యతా రహితంగా ప్రవర్తిస్తున్నాయి.
ఇరాక్ ఆస్పత్రుల్లో పనిచేయడానికెళ్లి నిరుడు జూలైలో అక్కడి అంతర్యుద్ధంలో చిక్కుబడి స్వదేశానికొచ్చిన నర్సులను గమనించినా... ఇప్పుడు యెమెన్‌లో సాగుతున్న యుద్ధం కారణంగా ప్రాణాలు అరచేతబట్టుకుని వచ్చిన నర్సులను చూసినా మన పాలకుల బాధ్యతారాహిత్యమే వెల్లడవుతుంది. తమ వృత్తికి తగిన ఉద్యోగమూ, జీతభత్యాలూ లభించకే వేలాదిమంది యువతులు సమస్యాత్మకమైన అలాంటి దేశాలకు వెళ్తున్నారు. తమ కుటుంబాలకు ఆసరాగా నిలవడం కోసం చావుకు తెగిస్తున్నారు. చేతనైతే ఈ స్థితిని మార్చాలి. నిజానికి గోవా నర్సులు చేస్తున్న పోరాటం వారి జీతభత్యాలకు సంబంధించినది మాత్రమే కాదు... ఖజానా నిలువుదోపిడీని అరికట్టడానికి ఉద్దేశించింది. అక్కడ నిర్వహిస్తున్న 108 అంబులెన్స్ సర్వీసుల నిర్వహణ సక్రమంగా లేదని గత కొన్నిరోజులుగా వారు ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నారు. ప్రభుత్వం 33 అంబులెన్స్ సర్వీసులకు డబ్బులు చెల్లిస్తున్నా నిర్వాహకులు 13 అంబులెన్స్‌లను మాత్రమే నడుపుతున్నారని చెబుతున్నారు.
పాలకులకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇలాంటి కుంభకోణాలను అరికట్టడం చిటికెలో పని. గోవా సీఎం ఆ సమస్యపై దృష్టి పెట్టలేదు సరిగదా... కేవలం వారు మహిళలన్న కారణంతో చవకబారుగా మాట్లాడారు. ఇలా దిగజారి మాట్లాడటంలో నాయకులు ఒకరితో ఒకరు పోటీపడుతున్నారు. ఈమధ్యే జనతాదళ్ (యూ) నేత శరద్ యాదవ్ దక్షిణాది మహిళల గురించి పార్లమెంటు సాక్షిగా అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో నిర్భయ ఉదంతం జరిగి, కఠినమైన చట్టాన్ని తీసుకొచ్చినా మహిళలపై లైంగిక నేరాలు తగ్గలేదని గణాంకాలు చెబుతున్నాయి. మహిళల విషయంలో వ్యవస్థీకృతంగా ఉన్న వివక్షే దీనికి మూలకారణమని న్యాయ కోవిదురాలు ఇందిరాజైసింగ్ విశ్లేషించారు. ఇలాంటి వివక్షను అంతమొందించడానికి ఏమాత్రం కృషిచేయకపోగా దానికి మరింత ఊతమిచ్చేలా నేతలు మాట్లాడుతున్నారు. ఈ నేతలే నిర్భయ ఉదంతంపై లెస్లీ ఉద్విన్ రూపొందించిన ‘ఇండియాస్ డాటర్’ను నిషేధించే వరకూ నిద్రపోలేదు. కనీసం దాన్ని ప్రసారం చేయనిచ్చివుంటే ఉరిశిక్ష పడిన ఖైదీ వ్యక్తం చేసిన అభిప్రాయాలకు వీరు ఎంత దగ్గరగా ఉన్నారో ప్రజలందరికీ అర్ధమయ్యేది. ప్రభుత్వోద్యోగులకు మన దేశంలో సర్వీసు నిబంధనలున్నాయి. రాజకీయ పక్షాల నేతలకూ, ప్రభుత్వ పదవుల్లో ఉన్నవారికీ అలాంటి నిబంధనలు రూపొందిస్తే తప్ప పరిస్థితి మారేలా లేదు. కేంద్ర ప్రభుత్వం ఆ పని చేసి పుణ్యం కట్టుకోవాలి.