మరో రెండునెలల్లోపు ఎబోలా వైరస్‌ను నిర్మూ లించలేకపోతే మన తరంలోనే అతి పెద్ద మానవ విపత్తును ఎదుర్కోవలసి ఉంటుందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. పశ్చిమాఫ్రికాలో మొదలై ప్రపంచంలోని అనేక దేశాల్లో విస్తరించిన ఎబోలా ఇప్పటికే 4,500 మందిని బలి తీసుకుంది. మానవ శరీరంలోని ద్రవపదార్థాల (రక్తం, వాంతి, విరోచనం,) ద్వారా శరవేగంగా ఇది వ్యాపిస్తోంది. ఈ వ్యాధికి గురైన వారిలో 70 శాతం మంది నిస్సహాయంగా మరణిస్తున్నారు. దీని బారినపడిన గినియా, లైబీరియా, సియర్రా లియోన్ దేశాల్లో వ్యాధి నివారణ కోసం అవసరమైన సైనిక సామగ్రి, ఆర్థిక సహాయం అందకపోతే అంతర్జాతీయ సమాజం తర్వాత వగచీ ప్రయోజనం లేదని అమెరికా, బ్రిటన్‌లు తాజాగా హెచ్చరించడం ఎబోలా తీవ్రతను సూచిస్తోంది. 60 రోజులలోపు ఎబోలా వైరస్‌ను అదుపు చేయలేకపోతే ఒక ప్పుడు పోలియో, తర్వాత హెచ్‌ఐవీ మహమ్మారిలా పరిస్థితి పూర్తిగా అదుపు తప్పుతుందని అమెరికా స్టేట్ సెక్రటరీ జాన్ కెర్రీ శనివారం హెచ్చరించారు.
పశ్చిమాఫ్రికాలో ఎబోలా వైరస్ బయటపడిన తొలి దశ లో దాంతో సరిగా వ్యవహరిం చలేకపోయామని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంగీకరించిన నేపథ్యంలో ఆ ప్రాంతంపై దశాబ్దాలుగా ప్రభావం చలాయిస్తున్న పాశ్చాత్య దేశాల్లో కలవరం మొదలైంది. ఎబోలా వైరస్ అదుపు వాటి సామూహిక బాధ్యతగా మారుతోంది. పశ్చిమాఫ్రికాకు పరిమితం కాకుండా విస్తరిస్తున్న ఎబోలా బారిన తాను కూడా చిక్కుకోకతప్పదని పాశ్చాత్య ప్రపంచం వేగంగానే గుర్తించింది. సరిగ్గా తుపాను కేంద్రం (కన్ను)లో పోయి పడ్డామనీ, ఎబోలా వ్యాప్తిని ఊరకే చూస్తూ చేష్టలుడిగే దశకు మనం చేరుకోకూడదనీ, పరిస్థితి విషమం కాకముందే ఉమ్మడి లక్ష్యంతో దాన్ని అరికట్టేందుకు ప్రయత్నాలు చేయాలని పశ్చిమా ఫ్రికాలో ఎబోలా రోగులకు వైద్య సేవలందిస్తున్న ఆక్స్ ఫామ్ చారిటీ సంస్థ పేర్కొంది. వైరస్ విస్తరించిన మూడు దేశాలకు సైనిక దళాలను, వైద్యులను పంపించి, తగినన్ని నిధులు కేటాయించడంలో వెనుకబడితే యావత్ యూరప్, అమెరికా ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడతాయని సంస్థ సీఈఓ మార్క్ గోల్డ్ రింగ్ తీవ్రంగా హెచ్చరించారు.
ఎబోలా వ్యాధి అదుపుకోసం సమాజం కనీవినీ ఎరుగని రీతిలో సత్వరమే స్పందించాలన్న ఆక్స్ ఫామ్ హెచ్చరిక తనదైన ప్రభావం చూపుతోంది. అమెరికా ఇప్పటికే భారీమొత్తాన్ని ఎబోలా అదుపునకు కేటాయించగా ఇంగ్లండ్ ఇటీవలే 125 మిలియన్ పౌండ్ల సహాయం ప్రకటించింది. మరో బిలియన్ డాలర్లను సహాయం అందించడానికి ఈయూ త్వరలో సమావేశం కానుంది. పశ్చిమాఫిక్రాలోని ఎబోలా చికిత్సా కేంద్రాలలో పనిచేసేందుకు పెద్ద సంఖ్యలో డాక్టర్లు, నర్సులు అవసరం. పైగా వైద్యుల మోహరింపునకు, వైద్య సామగ్రి తరలింపునకు పెద్ద ఎత్తున సైనిక దళాల అవసరం ఏర్పడింది. ఆ ప్రాంతంలో వ్యాధి నివారణలో మునిగి ఉన్న ఆక్స్‌ఫామ్ వంటి సంస్థలు ప్రధానంగా స్వచ్ఛ జలం, పారిశుధ్యం, ప్రజలను జాగరూకులను చేయడంపై దృష్టి పెడుతు న్నాయి. చికిత్స ఎంత అవసరమో ఇన్‌ఫెక్షన్ వ్యాప్తిని అరికట్టడం అంత అవస రం. దీనికి నిధులు పెద్ద ఎత్తున అవసరం. ఈ తరంలోనే అతి పెద్ద విపత్తు చెలరేగుతున్నా దాంతో వ్యవహరించేందుకు ప్రపంచం ఇప్పటికీ పెద్దగా సిద్ధపడలేదని విమర్శ. ఈ నేపథ్యంలో ఇప్పటికే అమెరికా 4,000 మం దిని, బ్రిటన్ 750 మంది బలగాలను పంపించాయి. ఈయూ నుంచి మరో 2 వేల మంది వైద్య సిబ్బందిని పంపించాలని బ్రిటన్ ప్రధాని ఈయూను కోరను న్నారు. సిబ్బందిని, సహాయ సామగ్రిని శరవేగంగా పంపించడం ద్వారానే పశ్చిమాఫిక్రాలో ఎబోలాను అరికట్టవచ్చు. ప్రతి 20 రోజులకు ఎబోలా కేసులు రెట్టింపు స్థాయిలో నమోదవుతున్నాయి. డిసెంబర్ నాటికి కొత్తగా 10 వేల కేసులు నమోదు కానున్నాయి.
గణాంకాలకు సంబంధించిన ఈ భయ విహ్వల నేపథ్యం పాశ్చాత్యదేశాలను తీవ్రంగా వణికిస్తోంది. ఎబోలాపై సామూహిక బాధ్యతను ఈ క్షణం చేపట్టకపోతే పశ్చిమాఫ్రికా ప్రాంత రాజకీయ, ఆర్థిక, సామాజిక చట్రం కుప్పకూలుతుంది. అక్కడి నుంచి వ్యాపించే వ్యాధి ప్రభావం తమ పౌరులను కూడా వదిలిపెట్టదని పాశ్చాత్య సమాజం భీతిల్లుతోంది.
ఎబోలాపై తాజా యుద్ధం
Published Sun, Oct 19 2014 12:28 AM | Last Updated on Thu, Apr 4 2019 5:04 PM
Advertisement
Advertisement