అమెరికా, రష్యా చేతులు కలిపాయి!
ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థను సిరియాలో నియంత్రించడానికి రెండు అగ్రరాజ్యాలు చేతులు కలిపాయి. సిరియాలో శాంతి నెలకొల్పి అక్కడి ప్రజలకు మంచి చేయడంలో భాగంగా తమ దేశం రష్యాతో కలిసి ఇక నుంచి మిలిటెంట్లపై దాడులు చేయడానికి సిద్ధంగా ఉందని అమెరికా విదేశాంగమంత్రి జాన్ కెర్రీ తెలిపారు. ఇప్పటివరకూ స్వతంత్రంగా వైమానిక, ఇతర దాడులు నిర్వహించిన అమెరికాతో పాటు రష్యా కూడా ఉగ్రవాదాన్ని సీరియస్ అంశంగా తీసుకుంది.
రష్యా విదేశాంగమంత్రి సెర్గీ లావ్రోవ్ తో జెనీవాలో చర్చలు జరిపిన అనంతరం ఆయన ఈ విషయాలను వెల్లడించారు. సిరియాలో రాజకీయ స్థిరత్వం రావాలన్నా, మళ్లీ ప్రశాతం వాతావారణ ఏర్పడాలంటే తమ దేశాల ఆర్మీ బలగాలు ఉగ్రవాదులపై దాడులు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించామని చెప్పారు. నస్రా ఫ్రంట్, ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదాన్ని సిరియాలో రూపుమాపడమే తమ లక్ష్యమని కెర్రీ పేర్కొన్నారు. సోమవారం నుంచి వీరి వ్యూహాలు అమలు చేసే అవకాశాలున్నాయని, సిరియా అంతర్యుద్ధం గురించి ఆ దేశ అధ్యక్షుడు బషర్ హఫీజ్ అల్ అస్సద్ తో చర్చలు జరుపుతామని జాన్ కెర్రీ వివరించారు. సిరియాలో ఐఎస్ఐఎస్ దాడుల వల్ల ఇప్పటికే వేల మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు.