మన దేశానికి చైనా కమ్యూనిస్టు పార్టీ ముఖ్యుడిగా పదిహేడేళ్లక్రితం వచ్చిన జీ జిన్‌పింగ్ ఇప్పుడు ఆ దేశ అధ్యక్షుడిగా మూడు రోజుల పర్యటన కోసం బుధవారం అహ్మదాబాద్ చేరుకున్నారు. ముందుగా ఇతర నగరాలకు చేరుకునే విదేశీ అతిథులకు న్యూఢిల్లీ వచ్చాకే స్వాగతం పలకడం సంప్రదాయం. దాన్ని పక్కనబెట్టి ప్రధాని నరేంద్రమోదీ అహ్మదాబాద్ వెళ్లి సంప్రదాయ గుజరాతీ గాన, నృత్యరీతుల కోలాహలం మధ్య ఆయనకు ఘనస్వాగతం పలకడం చైనాతో స్నేహ సంబంధాలకు మన దేశం ఇస్తున్న ప్రాధాన్యతను సూచిస్తుంది. జిన్‌పింగ్ కూడా తన తొలి మజిలీకి మోదీ స్వస్థలాన్ని ఎంచుకుని ఆయన మనసు దోచుకోవడానికి ప్రయత్నించారు. ఆయన విచ్చేసిన గంట వ్యవధిలోనే ఇరువురి సమక్షంలో మూడు అవగాహనా ఒప్పందాలపై సంతకాలు కూడా పూర్తయ్యాయి.
దేశాధినేతల పర్యటనల్లో అతిశయోక్తులు, అలంకారాలు, పరస్పర పొగడ్తలు సర్వసాధారణం. ఇదంతా దౌత్యకళలో భాగం. అయితే, దీనికి ఆవల వాస్తవాధీనరేఖ వద్ద గత కొన్నిరోజులుగా సాగుతున్న హడావుడిని మరిచిపోకూడదు. లడఖ్ ప్రాంతంలోని డోమ్‌చోక్ వద్ద సాగుతున్న కాల్వ పనులకు ఆటంకం కల్పిస్తూ దాదాపు 30మంది చైనా పౌరులు పెద్ద బ్యానర్ పట్టుకుని మన భూభాగంలోనికి చొచ్చుకురావడం... చుమార్ సమీపంలో మన సైన్యం నిర్మిస్తున్న ఒక పోస్టుకు చైనా సైని కులు అభ్యంతరం చెప్పడం తదితర ఘటనలు చోటు చేసుకున్నాయి. జిన్‌పింగ్ రావడానికి 24 గంటలముందు కూడా ఇలాంటి ఉద్రిక్త వాతావరణమే కొనసాగింది. ‘ఆర్ట్ ఆఫ్ వార్’ (యుద్ధకళ) పుట్టిన గడ్డవైపు నుంచి గత మూడు నెలలుగా చెదురుమదురుగా సాగుతున్నట్టు కనబడుతున్న ఈ ఉదంతాల మధ్య పరస్పర సంబంధం ఉన్నదని... దానికొక ప్రయోజనం ఉన్నదని గుర్తించకపోతే మనం అర్ధ శతాబ్దం కింద చేసిన తప్పునే పునరావృతం చేసే ప్రమాదమున్నదని గ్రహించాలి. మనతో గల 4,057 కిలోమీటర్ల సరిహద్దు పొడవునా చైనా తరచుగా ఇలాంటి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్నది.
ఇన్ని ఉన్నా ఇరుదేశాలమధ్యా వాణిజ్య, వ్యాపార సంబంధాలు సజావుగానే ఉన్నాయి. ఇరుదేశాల వాణిజ్యం 6,500 కోట్ల డాలర్లకు చేరుకుంది. వచ్చే ఏడాదికల్లా దీన్ని పదివేల కోట్ల డాలర్లకు పెంచాలన్నది భారత, చైనాల ఉమ్మడి లక్ష్యం. అలాగే బర్మా, బంగ్లాదేశ్‌లను భాగస్వాములుగా కలుపుకొని ఇరుదేశాలూ ఆర్థిక కారిడార్ నెలకొల్పాలని చైనా ఆశిస్తున్నది. అలాగే, భారత్‌కు కావలసిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో, తయారీరంగ పరిశ్రమల్లో తమ పెట్టుబడులు మరింత పెరగాలని కోరుకుంటున్నది. ఎన్డీయే ప్రభుత్వం స్మార్ట్ సిటీల గురించి, బుల్లెట్ రైళ్లగురించి మాట్లాడుతున్నది గనుక రైల్వేలు, హైవేలలో తనకు ప్రధాన భాగస్వామ్యం దక్కవచ్చన్న ఆశ ఆ దేశానికుంది. వివాదాస్పద అంశాలపై ద్వైపాక్షిక చర్చలు కొనసాగిస్తూనే వాణిజ్యబంధాన్ని పెంచుకోవాలని భారత్-చైనాలు ఎన్నడో నిర్ణయించుకున్నాయి. అందులో భాగంగానే ఈ బంధం నానాటికీ విస్తరిస్తున్నది. అయితే, మన వీసా జారీ విధానం సంక్లిష్టమైనదని, ఏ ప్రాజెక్టునైనా అంగీకరించి పనులు ప్రారంభిద్దామనేసరికి వీసా జారీలో అంతులేని జాప్యం చోటుచేసుకోవడంవల్ల దాని వ్యయం అపరిమితంగా పెరుగుతున్నదని చైనా సంస్థల ఫిర్యాదు. అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్, జమ్మూ-కాశ్మీర్‌ల నుంచి వెళ్లేవారికి విడి వీసాలు జారీచేసి అనవసర వివాదాలకు తావివ్వడం చైనాకు అలవాటు. అంతేకాదు- చైనాలో వ్యాపార వాతావరణం మనకు అననుకూలంగా ఉంటున్నదని, అంతులేని అవరోధాలవల్ల అక్కడి మార్కెట్‌కు చేరువకావడం అసాధ్యమవుతున్నదని మన వాణిజ్యవేత్తలు చెబుతున్న మాట. ఇరు దేశాధినేతలూ ఇలాంటి అంశాలపై మాట్లాడుకుంటే సమస్యలన్నీ చిటికెలో మాయమవుతాయి. ఇంతకుమునుపు ఈ పని సరిగా జరగలేదు. ఇప్పుడు మోదీ వచ్చాక ఇరుగుపొరుగుతో సంబంధాలకిస్తున్న ప్రాముఖ్యతవల్ల, సమస్యల పరిష్కారానికి చూపిస్తున్న చొరవవల్లా సాధ్యమవుతుందని భావించాలి. చైనాను మన పొరుగునున్న దేశంగానే కాక ప్రపంచంలోనే అమెరికా తర్వాత తిరుగులేని ఆర్థిక శక్తిగా రూపుదిద్దుకున్న దేశంగా గుర్తిస్తే దానితో వాణిజ్యబంధం విస్తరించుకోవడం ఎంత అవసరమో అవగతమవుతుంది.
అయితే, మనం అమెరికా సాయంతో ప్రాంతీయ శక్తిగా ఎదగడానికి ప్రయత్నిస్తున్నామని చైనా అనుమానం. మనకు సమస్యగా మారిన పాకిస్థాన్‌తో అది సాన్నిహిత్యాన్ని నెరపుతున్నది. అలాగే ఆసియా- పసిఫిక్ ప్రాంతంలో... ముఖ్యంగా దక్షిణచైనా, తూర్పుచైనా సముద్ర జలాల్లో పొరుగు దేశాలతో ఉన్న ప్రాదేశిక వివాదాల్లో భారత్ వైఖరి తనకు ప్రతికూలంగా ఉండగలదన్న అంచనాలు చైనాకున్నాయి. ఇది నిజమేనన్నట్టు ఈమధ్య మోదీ జపాన్ పర్యటనలో ‘విస్తరణవాదం’ గురించి ప్రస్తావించి చైనాను కంగారుపెట్టారు.
ఇది చాలదన్నట్టు జిన్‌పింగ్ మన దేశం రావడానికి ఒక్కరోజు ముందు వియత్నాంలో ఉన్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తూర్పు, దక్షిణ చైనా సముద్ర జలాల్లో బెదిరింపులకు పాల్పడరాదని, సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని పరోక్షంగా చైనాకు హితవు పలికారు. ఇటీవలి కాలంలో తమకు దగ్గరవుతున్న భూటాన్, నేపాల్, శ్రీలంక వంటి దేశాలతో చెలిమికి మోదీ ఇస్తున్న ప్రాధాన్యం గురించి కూడా చైనా గమనించకపోలేదు. సమస్యలెన్ని ఉన్నా ముఖాముఖి చర్చలే అన్నిటినీ పరిష్కరిస్తాయి. కావలసిందల్లా చిత్తశుద్ధి. చైనా తన వ్యవహారశైలిని సవరించుకుంటే ఇరుదేశాల మధ్యా సుహృద్భావ సంబంధాలు ఏర్పడటం అసాధ్యమేమీ కాదు.
చైనాతో కరచాలనం!
Published Wed, Sep 17 2014 11:30 PM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM
Advertisement
Advertisement