ఏ ఎన్నికలైనా అంతులేని ఉత్కంఠను కలిగిస్తాయి. గెలిచేదెవరో, ఓడేదెవరో అందరికీ తెలిసినా చివరి నిమిషంలో ఏమైనా కావొచ్చన్న అంచనాలుంటాయి. కానీ, ఇప్పుడు జరగబోయే లోక్‌సభ ఎన్నికల తీరే వేరు.
సంపాదకీయం: ఏ ఎన్నికలైనా అంతులేని ఉత్కంఠను కలిగిస్తాయి. గెలిచేదెవరో, ఓడేదెవరో అందరికీ తెలిసినా చివరి నిమిషంలో ఏమైనా కావొచ్చన్న అంచనాలుంటాయి. కానీ, ఇప్పుడు జరగబోయే లోక్‌సభ ఎన్నికల తీరే వేరు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేనే విజేతని, నరేంద్ర మోడీయే కాబోయే ప్రధాని అని సర్వేలన్నీ పదే పదే ముక్తకంఠంతో చెబుతున్నాయి. ఇందుకు మోడీకున్న జనాకర్షణ కారణమా...కుంభకోణాల్లో నిలువునా కూరుకుపోయిన యూపీఏ ప్రభుత్వ నిర్వాకం కారణమా అనే విచికిత్స పెద్దగా ప్రాముఖ్యమున్న అంశం కాదు. మోడీపై ఉన్న మోజును యూపీఏ అవినీతి పాలన మరిన్ని రెట్లు పెంచిందంటేనే సబబు. ఇంతగా విజయోత్సాహంలో ఉన్న పార్టీకి అభ్యర్థుల ఎంపిక పెద్దగా కష్టం కాకూడదు.
అందునా నరేంద్ర మోడీ స్థానాన్ని ఎంపిక చేయడంలో ఇబ్బందులు అసలే ఎదురుకాకూడదు. అయినప్పటికీ ఆ విషయంలో బీజేపీ కాస్త తడబాటుకు లోనయింది. వారణాసిని వదిలిపెట్టడానికి అక్కడి సిటింగ్ ఎంపీ, పార్టీ సీనియర్ నేత మురళీమనోహర్ జోషి ససేమిరా అనడంతో ఆ విషయమై నెలరోజులనుంచి సందిగ్ధత నెలకొంది. ఆరెస్సెస్ జోక్యంతో ఈ వివాదం సుఖాంతమైంది. ప్రధాని అభ్యర్థిగా ఎంపికవడానికి ముందు కూడా నరేంద్ర మోడీ ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఢిల్లీ పీఠంపై మక్కువ ఉన్నదని ఆయన తనంత తానుగా ఒకటికి పదిసార్లు చెప్పాక కూడా పార్టీ సీనియర్లలో చలనం రాలేదు. వారంతా ఎల్.కె. అద్వానీవైపే మొగ్గుచూపారు. ఆ సంగతిని ఒకరిద్దరు బాహాటంగానే చెప్పారు.
అటుతర్వాత ఆరెస్సెస్ జోక్యం చేసుకుని అందరినీ ఒప్పించే పనిలోబడింది. చివరకు అద్వానీ మినహా అందరూ దారికొచ్చారు. ఆయన మాత్రం ఒంటరిగా మిగిలి, అలకబూని పదవులన్నిటికీ రాజీనామా ఇచ్చి ఇంటిదగ్గరే ఉండిపోయారు. అయితే, నరేంద్ర మోడీ వల్లనే బీజేపీకి ప్రజానీకంలో ఇంత మద్దతు లభిస్తున్నదని అద్వానీ సైతం చివరకు అంగీకరించాల్సివచ్చింది. ఇలా ఒక్కో అవరోధాన్నే అధిగమిస్తూ వస్తున్న మోడీ....చివరకు ఎంచుకున్న నియోజకవర్గాన్ని పొందడంలోనూ తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోవాల్సివచ్చిందంటే వింతగానే ఉంటుంది. కానీ, వారణాసి స్థానం అలాంటిది. అక్కడ జోషి ఏనాటినుంచో పాతుకుపోయి ఉన్నారు. అడుగుతున్నది పార్టీ ప్రధాని అభ్యర్థి గనుక ఇదేమంత పెద్ద కారణం కాదు. మరొకరైతే వెనువెంటనే ఖాళీ చేయాల్సివచ్చేది. జోషి గనుకనే ఇంత ఆలస్యమైంది.
గుజరాత్‌లో 2002లో జరిగిన మారణకాండ, అనంతరం అక్కడ ఎడతెగకుండా సాగుతున్న విచారణలు, దర్యాప్తులు, కేసులువంటి పరిణామాలవల్ల మాత్రమే కాదు...అభివృద్ధి నమూనాగా కూడా ఆ రాష్ట్రంపేరు, నరేంద్ర మోడీ పేరు ఎప్పుడూ మార్మోగుతూనే ఉన్నాయి. అందువల్లే కావొచ్చు...చిన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా మోడీ ప్రధాని అభ్యర్థి కాగలిగారు. ఈ ఎన్నికల్లో గుజరాత్‌లోని ఏ స్థానంనుంచి పోటీచేసినా ఆయన సులభంగానే గెలుస్తారు. అయినా సరే ఆయనను ఉత్తరప్రదేశ్‌నుంచీ...అందునా వారణాసినుంచి పోటీచేయించడం వెనక బీజేపీకి ప్రత్యేక వ్యూహం ఉన్నది.
దేశ రాజకీయాలను మలుపుతిప్పి, బీజేపీని అధికార పీఠంపై కూర్చోబెట్టిన రామజన్మభూమి ఉద్యమానికైనా, సామాజిక సమీకరణాలను దేశ అజెండాలోకి తెచ్చిన రాజకీయాలకైనా ఉత్తరప్రదేశ్ పురుటిగడ్డ. 80 లోక్‌సభ స్థానాలతో అతిపెద్ద రాష్ట్రంగా ఉన్న ఉత్తరప్రదేశ్‌ను విస్మరించడం ఏ పార్టీకైనా అసాధ్యం. అధికారానికి రాదల్చుకున్న ఏ పార్టీ అయినా ప్రధాని అభ్యర్థిని అక్కడినుంచి నిలిపితే దాని ప్రభావం బీహార్‌తోసహా హిందీ రాష్ట్రాలన్నిటా ఉంటుంది. దేశ ప్రధానులుగా పనిచేసినవారిలో అత్యధికులు అక్కడివారే కావడం యాదృచ్ఛికంకాదు. అంతేకాదు...వారణాసిలో మోడీని నిలపడంవల్ల మొత్తం పూర్వాంచల్ ప్రాంతంలో పార్టీ విజయావకాశాలను దృఢపరుచుకునే అవకాశం ఉంటుంది.
హిందీ రాష్ట్రాల ప్రజల్లో మోడీ వెలుపలివారన్న అభిప్రాయం బీజేపీ తాజా నిర్ణయంతో మటుమాయమవుతుంది. రెండేళ్లక్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన సమాజ్‌వాదీ పార్టీ ఇప్పుడు కష్టాల్లో ఉన్న సంగతి నిజమే అయినా...రాష్ట్రంలో కాషాయ ప్రభంజనం వీస్తున్నదని రాజకీయ నిపుణులు జోస్యం చెబుతున్నా పార్టీ శ్రేణుల్లో నిర్లిప్తత పనికిరాదని బీజేపీ భావించింది. సర్వేలంటున్నట్టు ఎన్‌డీఏకు 220కి మించిన స్థానాలు రావాలంటే ఈ వ్యూహ మే సరైందని అంచనావేసింది. వారణాసినుంచి తన అభ్యర్థిత్వాన్ని పార్టీ ఖరారుచేసిన వెంటనే మోడీ ఇచ్చిన ట్వీట్ ఆయన ఎదుర్కొన్న ఉత్కంఠను పట్టిచూపింది. ‘గంగామాత, కాశీ విశ్వనాథుల ఆశీర్వాదాలతో పటిష్టమైన విజయాన్ని సొంతంచేసుకుందా’మని ఆ ట్వీట్‌ద్వారా పార్టీ శ్రేణులకు మోడీ పిలుపునిచ్చారు.
చివరికంతా సవ్యంగానే ముగిసినా...వారణాసినుంచి మోడీ అభ్యర్థిత్వాన్ని ఖరారుచేయడంలో జరిగిన ఆలస్యం, ఉత్కంఠ ఆయనకు భవిష్యత్తులో పార్టీలోని సీనియర్‌లనుంచి ఎదురుకాగల అవరోధాలను తెలుపుతున్నాయి. వాజపేయివలే, అద్వానీవలే ఆయన పార్టీలో ఇంతవరకూ తిరుగులేని నాయకుడు కాదు. జనాన్ని సమ్మోహనపరచగల వక్తగా, దృఢమైన అభిప్రాయాలున్న వ్యక్తిగా మోడీకి పేరుంది. దాంతోపాటు గుజరాత్ సీఎంగా ఆయన ఏకపక్షంగా వ్యవహరించారని, సహచర మంత్రుల అభిప్రాయాలకు విలువనివ్వలేదని విమర్శలున్నాయి. ప్రధాని పదవిలో ఉండేవారికి అలాంటి ధోరణులు సరిపడవు. అందరినీ కలుపుకొని వెళ్లగలిగే స్వభావం దానికి అత్యవసరం. పైగా, పార్టీలో సీనియర్లనుంచి ఎదురవుతున్న సవాళ్లను గమనిస్తే ఆయన భవిష్యత్తులో సైతం జాగ్రత్తగా అడుగులేయాల్సి ఉంటుందని స్పష్టమవుతుంది.