దేశ సైనిక వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాలన్న ప్రయత్నం చాన్నాళ్లుగా జరుగుతోంది. అందు కోసం వస్తున్న వివిధ రకాల ప్రతిపాదనల్లో కేంద్ర ప్రభుత్వం చివరకు దేనిని ఆమోదిస్తుందన్న సంగతలావుంచితే, తాజాగా వచ్చిన ప్రతిపాదనొకటి ఆసక్తికరమైనది. సైన్యంలో చేరాలని ఉత్సాహం చూపే యువతకు పరిమిత కాలంపాటు... అంటే మూడేళ్లపాటు అవకాశమివ్వడం ఈ ప్రతిపాదన సారాంశం. చెప్పాలంటే ఇదొకరకమైన ఇంటర్న్‌షిప్. దీన్ని ‘టూర్ ఆఫ్ డ్యూటీ’ (టీఓడీ) గా ప్రతి పాదనలో ప్రస్తావించారు.
చొరవ, ఉత్సాహం, ఉద్వేగం, దేశం కోసం ఏమైనా చేయాలన్న తపన అధికంగా వుండే యువశక్తిని సక్రమంగా వినియోగించుకోగలిగితే అద్భుతాలు సృష్టించవచ్చని మన నాయకులు తరచూ అంటారు. ఇనుప కండరాలు, ఉక్కు నరాల యువతతోనే జాతి ఖ్యాతి పెన వేసుకుని వుంటుందని వివేకానందుడు ఎప్పుడో చెప్పారు. ఏ రకమైన సవాలునైనా స్వీకరించాలని, సాహసకృత్యాలు చేయాలని ఉత్సాహపడేవారు అందుకోసం సైన్యంలోకి వెళ్లాలని ఉవ్విళ్లూరు తుంటారు. అలాగని పూర్తికాలం కొనసాగాలంటే అందరూ సిద్ధపడరు. కుటుంబంపై బెంగ, బంధు వులు, స్నేహితులు వగైరాలకు సంబంధించిన వేడుకల్లో పాల్గొనే అవకాశం కోల్పోవడం వారికి ఇష్టం వుండదు.
కనుక పరిమితకాల వ్యవధిలో పనిచేయడానికి అవకాశమిచ్చే టీఓడీ అందరికీ నచ్చు తుందని, ఎంపిక చేసిన కొన్ని పోస్టులకు దీన్ని వర్తింపజేయొచ్చని ప్రతిపాదన చెబుతోంది. సాధారణంగా జవాన్ల సర్వీసుకాలం 17 ఏళ్లు. అంటే ఎక్కువమంది 37, 38 ఏళ్ల వయసు లోపే రిటైర్ కావాల్సివుంటుంది. అప్పటికల్లా వారికి కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. కళ్లముందు అన్నీ సమస్యలే కనబడతాయి. వచ్చే అరకొర పింఛన్ సరిపోదు. దాంతో వేరే ఉద్యోగం వెదుక్కొ నాల్సివస్తుంది.
కానీ ఆ వయసువారికి అదంత సులభం కాదు. సైన్యంలోకి వెళ్లకుండా వేరే పనిలో ప్రవేశిస్తే ఈపాటికల్లా స్థిరపడేవాళ్లమన్న అభిప్రాయం వారిలో ఏర్పడుతుంది. జీవితం నిరాశగా అనిపిస్తుంది. కనుకనే ఎలక్ట్రానిక్స్, మెకానికల్ వంటి రంగాల్లో పనిచేసే జవాన్ల రిటైర్మెంట్ వయసు రెండేళ్లు పెంచవచ్చన్న ప్రతిపాదన నిరుడు వచ్చింది. అధికారుల స్థాయిలో ఈ సర్వీసు 10 నుంచి 14 ఏళ్లు వుంటుంది. ఆ తర్వాత శాశ్వతంగా కొనసాగదల్చుకుంటే వారు శారీరకంగా, మానసికంగా దృఢంగా వున్నారో లేదో చూసి, సంతృప్తి చెందితే పొడిగిస్తారు.
అటు జవాన్లకైనా, ఇటు సైనికా ధికారులకైనా ఇచ్చే శిక్షణ, అలవెన్సులు, గ్రాట్యుటీ వగైరాలు లెక్కేస్తే వారిపై పెట్టే ఖర్చు చాలా ఎక్కువ. కోట్ల రూపాయల్లో వుండే ఈ మొత్తంతో పోలిస్తే టీఓడీ పథకం కింద మూడేళ్లపాటు సర్వీ సులో కొనసాగేందుకు అనుమతిస్తే ఒక్కొక్కరిపై పెట్టే వ్యయం రూ. 80 నుంచి 85 లక్షల మధ్య అవుతుందని ఈ ప్రతిపాదన చెబుతోంది. సారాంశంలో సైన్యానికి బాగా ఆదా అవుతుంది.
టీఓడీ ప్రతిపాదన ఈమధ్య దేశంలో జాతీయవాదం, దేశభక్తి పునరుజ్జీవం పొందాయని చెబు తోంది. ఈ భావోద్వేగాలున్నవారిని ఈ పథకం కింద సైన్యం వైపు మళ్లిస్తే ఎంతో ప్రయోజనం కలుగుతుందని వివరిస్తోంది. అయితే కేవలం అలాంటి భావోద్వేగాలనే ప్రాతిపదికగా తీసుకోవడం కాక, సైన్యానికి ప్రాథమికంగా కావలసిన ఇతరేతర అర్హతలున్నాయో లేదో కూడా చూసుకోవాలి. ఎందుకంటే ఆ పేరిట సమస్యలు సృష్టించినవారు లేకపోలేదు.
ఆస్ట్రియా, ఇజ్రాయెల్ వంటి కొన్ని దేశాల్లో యువత సైన్యంలో పనిచేయడం తప్పనిసరి. జర్మనీలో నిర్బంధ సైనిక శిక్షణ దాదాపు 55 ఏళ్లపాటు అమల్లోవుంది. ఆ నిబంధన ప్రకారం కనీసం ఆర్నెల్లు ప్రతి ఒక్కరూ సైన్యంలో పని చేయాల్సివచ్చేది. అయితే 2011లో ఇది రద్దయింది. ఆస్ట్రియాలో 35 ఏళ్లలోపు పురుషులంతా తప్పనిసరిగా ఆర్నెల్లు సైన్యంలో పనిచేయాలి. ఇజ్రాయెల్‌లో అయితే 18 ఏళ్లున్న యువతీయువకులు సైన్యంలో పనిచేయాలి. యువకులు రెండుసంవత్సరాల ఎనిమిది నెలలు, యువతులు రెండేళ్లు పనిచేసి తీరాలి. అవసరాన్నిబట్టి యువతీయువకులిద్దరికీ ఎనిమిది నెలలచొప్పున పొడిగిస్తారు.
మన దేశంలో అలాంటి నిబంధనలేవీ లేవు. కానీ టీఓడీ ప్రతిపాదన అమలైతే సైన్యంలోకి వచ్చేవారి సంఖ్య గణనీయంగానే వుంటుందని చెప్పాలి. ఇందువల్ల యువతకు కలిగే లాభాలు చాలానే వుంటాయి. సాహసకృత్యాలపైనా, సవాళ్లను ఎదుర్కొనడంపైనా తమలో వున్నది కేవలం మోజు, ఆకర్షణ మాత్రమేనా లేక పట్టుదల కూడా వుందా అనేది శిక్షణలో తేలిపోతుంది. సైన్యంలో వరుసగా మూడేళ్లపాటు కొనసాగడం వల్ల అలవడే క్రమశిక్షణ వారు మెరుగైన పౌరులుగా రూపొందడానికి ఉపయోగపడుతుంది.
నచ్చిన వృత్తి ఎన్నుకోవడానికి, ఇష్టమైన ఉద్యోగాన్ని సాధించడానికి లేదా మరేదైనా కోర్సు చేయడానికి వారికి కావలసినంత సమయం వుంటుంది. 25–30 ఏళ్ల వయసు వచ్చేలోపే తిరిగి పౌర ప్రపంచంలోకి అడుగుపెట్టొచ్చు గనుక సైన్యంలో నేర్చుకున్న క్రమశిక్షణ, నైశిత్యం, అలవాట్లు వారి తదుపరి జీవితాన్ని నిర్దేశిస్తాయి. నిండైన ఆత్మవిశ్వాసం, అంకితభావంతో పనిచేసే స్వభావం ఏర్పడతాయి. వీరి విషయంలో కార్పొరేట్ సంస్థలు ఆసక్తిని పెంచుకునే అవకాశం ఉందని ప్రతిపాదన పత్రం చెబుతోంది.
మన రక్షణ రంగ వ్యయం అత్యధికం సైనిక దళాలకు కల్పించే సౌకర్యాలు, జీతభత్యాలు వగైరాలకు ఖర్చవుతుంది. అత్యాధునిక ఉపకరణాలు, ఆయుధాలు వగైరా కొనాలంటే 20–25 శాతం మించి వ్యయం చేయడం కుదరడం లేదు. దానికితోడు రాను రాను యుద్ధాల స్వభావం మారుతోంది. వర్తమానంలో భారీ సంఖ్యలో వుండే సిబ్బందికి బదులు, అన్నిటా వినియోగపడే స్మార్ట్ సైనికుల అవసరమే ఎక్కువగా వుంటుంది. సిబ్బంది సంఖ్యను తగ్గించుకుంటూనే కంప్యూటర్లు, ఇతర డిజిటల్ ఉపకరణాలు వినియోగించగలిగే సామర్థ్యం వున్నవారిని రూపొం దించుకొనక తప్పదు. కానీ ఇప్పుడు ప్రతిపాదిస్తున్న ఈ తాజా పథకం అందుకు తోడ్పడగలదా అన్నది సందేహమే.
Comments
Please login to add a commentAdd a comment