ఐఎన్‌ఎస్ అస్త్రధరణి జలప్రవేశం | Here's all you need to know about the Amravati Foundation | Sakshi
Sakshi News home page

ఐఎన్‌ఎస్ అస్త్రధరణి జలప్రవేశం

Published Thu, Oct 15 2015 4:20 AM | Last Updated on Tue, May 29 2018 11:47 AM

ఐఎన్‌ఎస్ అస్త్రధరణి జలప్రవేశం - Sakshi

ఐఎన్‌ఎస్ అస్త్రధరణి జలప్రవేశం

 రాష్ట్రీయం
  22న అమరావతి శంకుస్థాపన  అక్టోబరు 22న జరగనున్న రాజధాని అమరావతి శంకుస్థాపన ఆహ్వాన పత్రాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నెల10న జరిగిన రాష్ట్ర మంత్రి వర్గ సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు నాలుగు పేజీల ఆహ్వాన పత్రాన్ని ఆవిష్కరించారు. అక్టోబరు 22, మధ్యాహ్నం 12.45 గంటలకు అమరావతి శంకుస్థాపన జరగనున్నట్లు ఆహ్వాన పత్రంలో పేర్కొన్నారు.
 
 8 పర్యాటక ప్రాజెక్టులకు ఒప్పందాలు
 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ 10న పర్యాటక ప్రాజెక్టులకు సంబంధించి ఎనిమిది ఒప్పందాలు కుదుర్చుకుంది. రూ.1,240 కోట్ల విలువైన ఈ ఒప్పందాలకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి నీరబ్‌కుమార్‌ప్రసాద్, ఆయా సంస్థల ప్రతినిధులు పత్రాలు మార్చుకున్నారు.
 
 ఆర్థికం
  భారత వృద్ధిరేటును తగ్గించిన ఐఎంఎఫ్ అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) అక్టోబరు 5న విడుదల చేసిన నివేదికలో భారత వృద్ధిరేటును 7.5 శాతం నుంచి 7.3 శాతానికి తగ్గించింది. ప్రపంచ ఆర్థిక వృద్ధిరేటు 3.1 శాతంగా ఉంటుందని తెలిపింది. 2016 సంవత్సరంలో భారత్ వృద్ధిరేటు 7.5 శాతం, చైనా వృద్ధిరేటు 6.3 శాతంగా ఉండనుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటు తగ్గుతున్నప్పటికీ భారత్ పరిస్థితి మెరుగ్గా ఉందని తెలిపింది. అభివృద్ధి చెందిన దేశాల్లో ఆర్థిక వ్యవస్థల పురోగమనం నెమ్మదిగా ఉండటం, వర్థమాన దేశాల్లో మందగమన పరిస్థితులు, చమురు ధరలు తగ్గడం వల్ల చమురు ఎగుమతి దేశాల ఇబ్బందులు వంటి కారణాలతో ప్రపంచ ఆర్థిక వృద్ధిరేటు తిరోగమనంలో ఉందని తెలిపింది.
 
 వృద్ధిరేటును 7.5 శాతంగా పేర్కొన్న అంక్టాడ్
 2015 సంవత్సరంలో భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)రేటు 7.5 శాతంగా ఉంటుందని ఐక్యరాజ్యసమితి వాణిజ్య, అభివృద్ధి సంస్థ (అంక్టాడ్) అంచనా వేసింది. ఈ మేరకు అక్టోబరు 6న విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. భారత్, పాకిస్థాన్ దేశాలు కరెంట్ అకౌంట్ లోటును తగ్గించుకొనేందుకు చమురు ధరల తగ్గుదల ఉపయోగపడిందని అభిప్రాయపడింది.
 
 సంపన్న కుటుంబాల జాబితాలో 14 భారత్ నుంచే!
 ఫోర్బ్స్ ఆసియా ప్రాంత 50 సంపన్న కుటుంబాల జాబితాలో 14 భారత్ నుంచే ఉన్నాయి. ఈ జాబితాలో 21.5 బిలియన్ డాలర్ల సంపదతో అంబానీ కుటుంబం మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది. ఫోర్బ్స్ జాబితాలో 26.6 బిలియన్ డాలర్ల సంపదతో దక్షిణ కొరియాకు చెందిన శామ్‌సంగ్ లీ కుటుంబం టాప్‌లో ఉంది.
 
 సైన్స్ అండ్ టెక్నాలజీ
  అంగారకుడిపై ఇసుక తిన్నెలు అంగారకుడిపై ఇసుకు తిన్నెలకు గురించిన చిత్రాలను అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) విడుదల చేసింది. ఈ చిత్రాలను ఎమ్‌ఆర్‌వో వ్యోమనౌక హైరైజ్ (హై రెజల్యూషన్ ఇమేజింగ్ సైన్స్ ఎక్స్‌పరిమెంట్) కెమెరా ద్వారా తీసింది. క్రమక్షయం, ఉపరితల వస్తువుల గమనం, గాలి, వాతావరణ పరిస్థితులు, మట్టి రేణువులు, వాటి పరిమాణం తదితర అంశాల గురించిన సమాచారాన్ని ఈ ఫొటోలు ద్వారా తెలుసుకోవచ్చని నాసా తెలిపింది.
 
 జీవిత కాలాన్ని పెంచే జన్యువులు
 మనిషి జీవిత కాలం పెంచే దిశగా శాస్త్రవేత్తలు మరో ముందడుగు వేశారు. ఇటీవల మనిషి వయసును పెంచే 238 జన్యువులను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈస్ట్ కణాలపై జరిపిన పరిశోధనల్లో భాగంగా ఈ జన్యువులను తొలగించినప్పడు కణాల జీవిత కాలం పెరిగినట్లు గమనించారు. వాషింగ్టన్ విశ్వవిద్యాలయంలలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ ఆన్ ఏజింగ్ శాస్త్రవేత్తలు ఈ పరిశోధనలు చేశారు.
 
 కనిపించని వ్యాధుల జాబితాలో ‘యాస్’!
 భయంకరమైన చర్మవ్యాధి ‘యాస్’ను దీర్ఘకాలికంగా కనిపించని వ్యాధుల జాబితాలో చేర్చనున్నారు. ఈ అంటువ్యాధి 2003 నుంచి మన దేశంలో ఎక్కడా నమోదైనట్లు వివరాలు లేవు. దీంతో యాస్ ప్రభావిత ప్రాంతాల్లో మరోసారి పర్యటించి వ్యాధి లేదని నిర్ధారణకు వచ్చిన తర్వాత ఈ వ్యాధిని కనుమరుగైన వ్యాధుల జాబితాలో చేర్చునున్నారు. దీని కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధుల బృందం మన దేశంలో పర్యటిస్తోంది.
 
 నేపాల్ ప్రధానిగా కేపీ శర్మ
 నేపాల్ 38వ ప్రధానిగా కేపీ శర్మ ఓలీ అక్టోబరు 12న ప్రమాణస్వీకారం చేశారు. అక్టోబర్ 11న జరిగిన ఎన్నికల్లో సుశీల్ కొయిరాలాపై ఆయన విజయం సాధించారు. మొత్తం 587 మంది ఓటింగ్‌లో పాల్గొనగా సీపీఎన్-యూఎంఎల్ చైర్మన్ ఓలీ 338 ఓట్లు సాధించగా నేపాలీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కొయిరాలాకు 249 ఓట్లు వచ్చాయి.
 
 ప్రాంతీయ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం
 అమెరికా, 11 పసిఫిక్ దేశాల మధ్య అక్టోబరు 5న అతి పెద్ద ప్రాంతీయ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ట్రాన్స్-పసిఫిక్ పాట్నర్‌షిప్-టీపీపీ) కుదిరింది. అమెరికాతో ఒప్పందం కుదుర్చుకున్న దేశాల్లో కెనడా, మెక్సికో, పెరు, చిలీ, జపాన్, వియత్నాం, బ్రునై, మలేసియా, న్యూజిలాండ్, సింగపూర్, ఆస్ట్రేలియాలు ఉన్నాయి. ఈ పసిఫిక్ ఒప్పందం ఫలితంగా అంతర్జాతీయ వాణిజ్యానికి సంబంధించి వేల సంఖ్యలో సుంకాలు రద్దుకానున్నాయి. దీంతో పాటు చైనా ఆర్థిక ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ఈ ఒప్పందం దోహదపడనుంది. ప్రపంచ జీడీపీలో ఈ ఒప్పందం కుదుర్చుకున్న దేశాల జీడీపీ (2012) 40 శాతంగా ఉంది.
 
 అంతర్జాతీయం
 రాష్ట్రపతి ప్రణబ్ జోర్డాన్ పర్యటనభారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జోర్డాన్ పర్యటనలో ఇరు దేశాల మధ్య 6 ఒప్పందాలు కుదిరాయి. జోర్డాన్‌లోని అమ్మన్‌లో గాంధీ పేరిట ఏర్పాటుచేసిన ఓ వీధిని ప్రణబ్ ప్రారంభించారు. రాష్ట్రపతి ప్రణబ్ చారిత్రక పర్యటనకు గుర్తుగా అమ్మన్ సిటీ కౌన్సిల్ ఆయనకు ‘గోల్డెన్ కీ ఆఫ్ అమ్మాన్’ను బహూకరించింది.
 
 దారిద్య్రరేఖను సవరించిన ప్రపంచ బ్యాంకు
 ప్రపంచ దారిద్రరేఖను ప్రపంచ బ్యాంకు సవరించింది. ఇప్పటి వరకు రోజుకు 1.25 డాలర్లు సంపాదించే వారిని దారిద్య్రరేఖకు దిగువనున్న వారిగా గుర్తిస్తున్నారు. ప్రస్తుతం రోజు వారీ సంపాదనను 1.25 డాలర్ల నుంచి 1.90 డాలర్లకు (రూ.130) సవరించింది.
 
 యూఎన్ వాతావరణ మార్పు
 ప్యానెల్ చైర్మన్‌గా హోసుంగ్ లీ ఐక్యరాజ్యసమితి (యూఎన్) వాతావరణ మార్పులకు సంబంధించిన అంతర్ ప్రభుత్వ ప్యానెల్‌కు (ఐపీసీసీ) చైర్మన్‌గా కొరియన్ ప్రొఫెసర్ హోసుంగ్ లీ అక్టోబరు 6న ఎన్నికయ్యారు. క్రోయేషియాలోని దుబ్రోవ్‌నిక్‌లో జరిగే సదస్సుకు ఆయన నేతృత్వం వహించనున్నారు. లైంగిక వేధింపుల కేసులో నిందితుడిగా ఉన్న ఆర్‌కే పచౌరీ (భారత్) ఈ పదవికి రాజీనామా చేయడంతో ఆ స్థానంలో హోసుంగ్ లీ ఎన్నికయ్యారు.
 
 క్రీడలు
  కర్జాకిన్‌కు ప్రపంచకప్ చెస్ ఛాంపియన్‌షిప్ ప్రపంచకప్ చెస్ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను గ్రాండ్ మాస్టర్ సెర్గీ కర్జాకిన్ (రష్యా) గెలుచుకున్నాడు. బాకు (అజర్‌బైజాన్)లో అక్టోబరు 6న జరిగిన ఫైనల్లో పీటర్ స్విద్లెర్ (రష్యా)పై కర్జాకిన్ విజయం సాధించాడు.
 
 డచ్ ఓపెన్‌లో విజయం సాధించిన జయరామ్
 అజయ్ జయరామ్ డచ్ ఓపెన్ గ్రాండ్‌ప్రి టోర్నమెంట్ విజేతగా నిలిచాడు. అక్టోబరు 11న జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో రౌల్ మస్త్ (ఎస్తోనియా) పై విజయం సాధించాడు. ఈ చాంపియన్‌షిప్‌ను గతేడాది కూడా జయరామ్ దక్కించుకున్నాడు. పురుషుల డబుల్స్‌లో హైదరాబాద్ ప్లేయర్ సుమీత్ రెడ్డి తన భాగస్వామి మనూ అత్రి జోడీ ఫైనల్లో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచింది.
 
 పోకెర్‌స్టార్స్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్
 ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ పోకెర్‌స్టార్స్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్‌లో విజేతగా నిలిచాడు. బ్రిటన్‌లోని ఐల్ ఆఫ్ మ్యాన్ ద్వీపంలో అక్టోబర్ 11న జరిగిన టోర్నమెంట్‌లో నైజల్ షార్ట్ (ఇంగ్లండ్)ను తొమ్మిదో రౌండ్‌లో 50 ఎత్తుల్లో డ్రాగా ముగించి టైటిల్‌ను సాధించాడు. లారెంట్, గాబ్రియెల్‌లకు వరుసగా రెండు, మూడో స్థానాల్లో నిలిచారు.
 
 చైనా ఓపెన్ విజేత సానియా-హింగిస్ జోడి
 అక్టోబర్ 10న జరిగిన చైనా ఓపెన్ డబ్ల్యూటీఏ ప్రీమియర్ టోర్నమెంట్ ఫైనల్లో టాప్ సీడ్ సానియా మీర్జా-మార్టినా హింగిస్ జంట విజయం సాధించింది. వీరు హావో చింగ్ చాన్-యుంగ్ జాన్ చాన్ (చైనీస్ తైపీ)జోడీని ఓడించి టైటిల్ సాధించింది.
 
 జాతీయం
  నీరాంచల్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం నీటి పారుదల సౌకర్యాలను మెరుగు పరచేందుకు చేపట్టనున్న జాతీయ వాటర్‌షెడ్ నిర్వహణ పథకం నీరాంచల్‌కు కేంద్ర కేబినెట్ అక్టోబరు 7న ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.2,142,30 కోట్లు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి 50 శాతం నిధులను ప్రభుత్వం సమకూర్చనుండగా మిగిలిన మొత్తాన్ని ప్రపంచ బ్యాంకు రుణంగా ఇవ్వనుంది. ఈ పథకాన్ని జాతీయ స్థాయిలో అమలు చేయనున్నారు.
 
 ఐఎన్‌ఎస్ అస్త్రధరణి జలప్రవేశం
 టార్పెడోల ప్రయోగ నౌక ఐఎన్‌ఎస్ అస్త్రధరణి అక్టోబరు 5న తూర్పు నావికాదళ చీఫ్ రియర్ అడ్మిరల్ సతీష్‌సోనీ చేతులు మీదుగా జలప్రవేశం చేసింది. ఈ నౌకను పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించారు. టార్పెడోలను ప్రయోగించడంతో పాటు తిరిగి సేకరించగలికే సామర్థ్యం దీనికి ఉంది. గంటకు 15 నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణించగలిగే ఈ నౌక పొడవు 50 మీటర్లు. దీని ద్వారా పలు విధ్వంసకర టార్పెడోలను ప్రయోగించి, శక్తి సామర్థ్యాలను పరీక్షిస్తారు.
 
 బీహార్ తొలిదశలో 57 శాతం పోలింగ్
 బీహార్ శాసనసభకు అక్టోబరు 12న జరిగిన తొలిదశ ఎన్నికల్లో 57 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. తొలివిడతలో 54.5 శాతం మంది పురుషులు, 59.5 శాతం మహిళలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొదటి దశలో 49 నియోజక వర్గాల్లో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని బీహార్ ఎన్నికల ప్రధాన అధికారి అజయ్ నాయక్ తెలిపారు.
 
 అంబేద్కర్ స్మారక నిర్మాణానికి
 ప్రధాని శంకుస్థాపన ముంబైలోని ఇందు మిల్స్ ఆవరణలో 400 కోట్ల వ్యయంతో భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ స్మారక నిర్మాణానికి అక్టోబర్ 11న మోదీ శంకుస్థాపన చేశారు. అంబేద్కర్ జీవితంతో ముడిపడివున్న 5 ముఖ్యమైన స్థలాలను.. ప్రజలు సందర్శనార్థం ‘పంచ తీర్థాలు’గా అభివృద్ధి చేసే ప్రాజెక్టును ప్రభుత్వం ప్రారంభించిందని తెలిపారు. అంబేద్కర్ విగ్రహం 150 అడుగుల ఎత్తు, 110 అడుగుల చుట్టుకొలత ఉంటుంది.
 
 సంక్షిప్తంగా
 అమరావతిలో ప్రతి కట్టడానికి ఎల్‌ఈడీ బల్బులు అమర్చుతామని ఏపీ ఇంధన శాఖ కార్యదర్మి అజయ్ జైన్ తెలిపారు.
 తెలుగు రాష్ట్రాల మానవ హక్కుల వేదిక నూతన అధ్యక్షుడిగా హైదరాబాద్‌కు చె ందిన రిటైర్డ్ ప్రొ॥జీవన్‌కుమార్ ఎన్నికయ్యారు.తెలంగాణ సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో రూ.146.28 కోట్లతో నిర్మిస్తున్న బాలబాలికల విద్యాకేంద్రాలకు ప్రభుత్వం రూ.104.83 కోట్లు విడుదల చేసింది. ఇప్పటికే రూ.41.5 కోట్లు విడుదలయ్యాయి.మిషన్ కాకతీయ విరాళాల సేకరణ కోసం ఏర్పాటు చేసిన ట్రస్ట్‌కు విదేశాలను నుంచి విరాళాలు సేకరించేందుకు మార్గం సుగమమం అయింది. ఈ మేరకు ట్రస్టుకు విదేశీ వ్యవహారాల నియంత్రణ చట్టం-2010 నుంచి కేంద్రం హోం మంత్రిత్వ శాఖ మినహాయింపు ఇచ్చింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement