మతతత్వ ఎజెండా: సోనియా గాంధీ
బీజేపీ మేనిఫెస్టోపై సోనియా ధ్వజం
న్యూఢిల్లీ/త్రిసూర్: బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో మతతత్వ ఎజెండా అని, అది దేశ సమైక్యత, సమగ్రతలకు పెను ముప్పు అని కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ విమర్శించారు. ఆమె సోమవారం కేరళలోని త్రిసూర్‌లో ఎన్నికల సభలో మాట్లాడుతూ.. దేశ సమైక్యతను కాపాడడం ఒక్క కాంగ్రెస్‌తోనే సాధ్యమని అన్నారు. కాగా, రాజకీయ ప్రయోజనాల కోసం కాషాయదళం మతాన్ని వాడుకుంటోందని, అయితే మదర్సాలకు సాయం చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొనడం స్వాగతనీయమని కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ ఢిల్లీలో అన్నారు. హిందువుల ఓట్లను దక్కించుకోవడానికే బీజేపీ రామాలయ అంశాన్ని ప్రస్తావించిందని, ఆలయ అంశంపై రాజ్యాంగానికి కట్టుబడి ఉంటామనడం కంటితుడుపు మాటని సీపీఎం నాయకుడు సీతారాం ఏచూరి విమర్శించగా, మేనిఫెస్టో ఆరెస్సెస్ ఎజెండా అని సీపీఐ పేర్కొంది.
బీజేపీపై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు: లోక్‌సభ ఎన్నికల తొలిదశ పోలింగ్ అయిన సోమవారమే బీజేపీ మేనిఫెస్టో విడుదల చేయడం చట్టవిరుద్ధమంటూ కాంగ్రెస్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఒకవైపు పోలింగ్ జరుగుతోంటే అయోధ్యలో రామమందిరం నిర్మిస్తామంటూ బీజేపీ ఓట్లను అడిగినందున ఆ పార్టీపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేసింది.