ఉత్తరాంధ్రలో మారిన లెక్కలు!
ఓటరు నాడి ఓ పట్టాన చిక్కదనడానికి తాజాగా జరిగిన స్థానిక సంస్థల, సార్వత్రిక ఎన్నికల ఫలితాల సరళిని బట్టి విశదమవుతోంది. ఓటరు తీర్పు ఎప్పటికప్పుడు విలక్షణంగానే ఉంటుందనేది మరోసారి విస్పష్టమైంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఫలితాలను లోతుగా అధ్యయనం చేస్తే పలు ఆసక్తికరమైన అంశాలు చోటుచేసుకున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో పది, విజయనగరం జిల్లాలో 9, విశాఖపట్నం జిల్లాలో 15 మొత్తం 34 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వీటిలో విశాఖపట్నం జిల్లాలోని విశాఖ పశ్చిమ, ఉత్తరం, దక్షిణం, తూర్పు, గాజువాక అసెంబ్లీ నియోజకవర్గాల మినహా స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు, సార్వత్రిక ఎన్నికల ఫలితాలను బేరీజు వేచి చూడగా పలు ఆసక్తికరమైన అంశాలు కనిపిస్తున్నాయి. విశాఖపట్నం జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు మినహా ఉత్తరాంధ్రలోని 29 నియోజకవర్గాల ఫలితాలను ఒకసారి పరిశీలిద్దాం.
మున్సిపల్, జెడ్పీ ఎన్నికల ఫలితాలను బట్టి చూస్తే శ్రీకాకుళం జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆమదాలవలస, నరసన్నపేటల్లోనే ఆధిక్యం కనిపించింది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రెండు నియోజకవర్గాల్లో టీడీపీ గెలుపొందడం గమనార్హం! అయితే, ఈ జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్, జెడ్పీ ఎన్నికల ఫలితాల్లో వెనుకబడిన పాతపట్నం, పాలకొండ, రాజాం అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయబావుటా ఎగురవేయడం విశేషం! ఆమదాలవలస పరిధిలో స్థానిక ఎన్నికల్లో 5,229 ఓట్ల ఆధిక్యం కనిపించినా, అసెంబ్లీకి వచ్చేసరికి ఈ నియోజకవర్గం నుంచి కూన రవికుమార్ (టీడీపీ) తన సమీప ప్రత్యర్థి తమ్మినేని సీతారాం (వైఎస్సార్‌సీపీ)పై ఐదు వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇక నరసన్నపేటలో స్థానిక ఎన్నికల్లో 3,260 ఓట్ల ఆధిక్యాన్ని వైఎస్సార్‌సీపీ కనబరిచినా, అసెంబ్లీ ఫలితాల్లోకి వచ్చేసరికి ఇక్కడ బగ్గు రమణమూర్తి (టీడీపీ) సిట్టింగ్ ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ (వైఎస్సార్‌సీపీ)పై 4,889 ఓట్ల మెజారిటీ సాధించారు. పాతపట్నం పరిధిలో స్థానిక ఎన్నికల ఫలితాలను బట్టి చూస్తే, వైఎస్సార్‌సీపీకి ప్రత్యర్థి టీడీపీ కన్నా 1317 ఓట్లు తక్కువ ఓట్లు వచ్చినప్పటికీ అసెంబ్లీ అభ్యర్థి కలమట వెంకటరమణ (వైఎస్సార్‌సీపీ) తన సమీప ప్రత్యర్థి, మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు (టీడీపీ)పై 3,865 ఓట్ల మెజారిటీతో గెలుపొందడం విశేషం. పాలకొండలో స్థానిక ఎన్నికల్లో టీడీపీకి 3,504 ఓట్ల ఆధిక్యం వచ్చినా, అసెంబ్లీ స్థానాన్ని మాత్రం వైఎస్సార్‌సీపీ గెలుచుకుంది. ఇక్కడ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి విశ్వాసరాయి కళావతి టీడీపీ అభ్యర్థి నిమ్మక జయకృష్ణపై 1620 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. రాజాంలో స్థానిక ఎన్నికల్లో టీడీపీ 4289 ఓట్ల ఆధిక్యం కనబరిచినా, అసెంబ్లీ ఫలితం వచ్చేసరికి కంబాల జోగులు (వైఎస్సార్ సీపీ) మాజీ స్పీకర్ ప్రతిభాభారతి (టీడీపీ)పై 512 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇక ఈ జిల్లాలోని ఇచ్చాపురం, పలాస, ఎచ్చెర్ల, టెక్కలి, శ్రీకాకుళం స్థానాలు స్థానిక, సార్వత్రిక ఫలితాల్లో ఆధిక్యత కనబరిచిన టీడీపీ ఖాతాలోకి వెళ్లాయి.
విజయనగరం జిల్లా ఫలితాలను విశ్లేషిస్తే.. స్థానిక ఫలితాల్లో వైఎస్సార్ సీపీ ఆధిక్యం కనబరిచిన బొబ్బిలి సెగ్మెంట్‌లో ఆ పార్టీయే గెలుపొందింది. స్థానిక ఫలితాల్లో వైఎస్సార్‌సీపీకి 6384 ఓట్ల ఆధిక్యం రాగా.. అసెంబ్లీ అభ్యర్థి సుజయ్ కృష్ణరంగారావు టీడీపీ అభ్యర్థి లక్ష్మునాయుడుపై 7330 ఓట్ల మెజారిటీ సాధించారు. ఈ జిల్లాలో మరోరెండు స్థానాలను వైఎస్సార్‌సీపీ గెలుపొందింది. కురపాంలో స్థానిక ఎన్నికల ఫలితాల్లో 525 ఓట్లు తగ్గినప్పటికీ అసెంబ్లీకి వచ్చేసరికి పి.పుష్పశ్రీవాణి టీడీపీ అభ్యర్థి జనార్థన్ థాట్రాజ్‌పై 19వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలుపొందడం విశేషం! సాలూరులో స్థానిక ఫలితాల్లో టీడీపీ 1654 ఓట్ల ఆధిక్యాన్ని కనబరిచినా, అసెంబ్లీకి వచ్చేసరికి వైఎస్సార్ సీపీ అభ్యర్థి రాజన్నదొర టీడీపీ అభ్యర్థి భాంజ్‌దేవ్‌పై సుమారు ఐదు వేల ఓట్ల మెజారిటీతో విజయఢంకా మోగించారు. ఈ జిల్లాలో మిగిలిన పార్వతీపురం, చీపురుపల్లి, గజపతినగరం, నెల్లిమర్ల, విజయనగరం, శృంగవరపుకోట సెగ్మెంట్లలో స్థానిక, సార్వత్రిక ఫలితాల్లో టీడీపీదే పైచేయిగా ఉంది.
ఇక విశాఖపట్నం జిల్లా ఫలితాల సరళిని చూస్తే.. స్థానిక ఫలితాల్లో వైఎస్సార్‌సీపీ ఆధిక్యం కనబరిచిన పాడేరు (9282), అరకులోయ (21824), మాడుగుల (45) సెగ్మెంట్లలో ఆ పార్టీనే విజయం సాధించింది. అయితే స్థానిక ఎన్నికల ఫలితాల్లో వచ్చిన ఆధిక్యం కన్నా సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో పాడేరులో జి.ఈశ్వరి పాతికవేలకు పైగా, అరకులోయలో కిడారి సర్వేశ్వరరావు 33వేల పైగా, మాడుగులలో బూడి ముత్యాలనాయుడు ఐదు వేలపైగా ఓట్ల మెజారితో విజయం సాధించారు. ఉత్తరాంధ్రలో స్థానిక ఫలితాల సరళిని బట్టి చూస్తే ఆరు నియోజకవర్గాల్లో ఆధిక్యం కనబరిచిన వైఎస్సార్ సీపీ అసెంబ్లీ ఎన్నికల్లో 9 నియోజకవర్గాల్లో విజయం సాధించింది.
-అవ్వారు శ్రీనివాసరావు