ఏలూరు (ఆర్‌ఆర్ పేట), న్యూస్‌లైన్ : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు చేతిలో మరోసారి మోసపోవద్దని, ఆయనవి ఆచరణ సాధ్యం కాని హామీలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త తోట చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని అన్నారు. ఏలూరులోని పలు డివిజన్లలో శుక్రవారం వారు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ తొమ్మిదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని ఏమాత్రం అభివృద్ధి చేయని చంద్రబాబు ఇప్పుడు అధికారమిస్తే చేస్తాననడం హాస్యాస్పదమన్నారు. హై టెక్ మంత్రాన్ని జపిస్తూ రైతులను పట్టిం చుకోకుండా వ్యవసాయాన్ని నిర్వీర్యం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుం దన్నారు.మరలా తనకు అధికారమిస్తే ఇంటింటికీ ఉద్యోగం, రూపాయికే టిఫిన్, ఐదు రూపాయలకే భోజనం అందిస్తానని ఆచరణ సాధ్యంకాని హామీలను గుప్పిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. చంద్ర బాబు మాయమాటలను నమ్మే స్థితిలో ప్రజలు లేరని చెప్పారు.
చిరస్థాయిగా నిలిచిన వైఎస్సార్
సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలుతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని వారు చెప్పారు. ఆయన మరణానంతరం కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలను నిలిపివేసి ప్రజాకంటకంగా మారిందని విమర్శించారు. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ అధికార పక్షంతో కుమ్మైక్కై రాష్ట్ర విభజనకు సహకరించిందని ఆరోపించారు.
సీమాంధ్ర అభివృద్ధి తనతోనే సాధ్యమంటున్న చంద్రబాబు మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉన్నాయని ఎద్దేవా చేశారు. సీమాంధ్రుల అభిప్రాయాలకు ఏమాత్రం విలువనివ్వని చంద్రబాబుకు మరోసారి అధికారం అప్పగిస్తే ఈ రాష్ట్రాన్ని నాలుగు ముక్కలు చేయడానికి కూడా వెనకాడబోరన్నారు. రెండుకళ్ల సిద్ధాంతంతో అటు తెలంగాణ ప్రజలను, ఇటు సీ మాంధ్రులను మోసం చేసేందుకు చం ద్రబాబు తెగించారని చెప్పారు. రాష్ట్ర విభజనలో పాలుపంచుకున్న బీజేపీతో తెలుగుదేశం పొత్తుపెట్టుకోవాలనుకోవడం అనైతికమన్నారు. వీరి కూటమిని చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు.
ఏలూరు రెండో డివిజన్ అభ్యర్థి గుత్తుల బాలా త్రిపుర సుందరి, 16వ డివిజన్ అభ్యర్థి దాసరి రమేష్, 14వ డివిజన్ అభ్యర్థి అబ్బిరెడ్డి వెంకటలక్ష్మి, నాయకులు దాసరి వరలక్ష్మి, ఉదయేశ్వరరావు, బుద్దాల రాము, ఆలా గణేష్, రంగ ముత్యాలు, బత్తిన మస్తాన్ రావు, కోలా భాస్కరరావు, బుద్దాల గోవిందరావు, ఆళ్ల రాంబాబు తదితరులు వారి వెంట ఉన్నారు.
బాబు చేతిలో మోసపోవద్దు
Published Sat, Mar 29 2014 12:54 AM | Last Updated on Sat, Jul 28 2018 6:43 PM
Advertisement