బీసీలకు బాబు టోపీ...!
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈసారి వెనుకబడిన తరగతుల వారికి టోపీ పెట్టేశారు. బీసీ వర్గాల వారికి వంద సీట్లు కేటాయిస్తానని గత ఎన్నికల ముందు ఊదరగొట్టిన చంద్రబాబు టిక్కెట్ల కేటాయింపులో మొండిచెయ్యి చూపారు. ఇప్పుడు బిసిలు బాబు పేరు చెబితే చాలు భగ్గుమంటున్నారు.
కృష్ణయ్యను పోటీలో దింపి చెయ్యిచ్చిన బాబు
తెలంగాణలో బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రిని చేస్తానంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. సీఎం అభ్యర్థిగా దశాబ్దాలుగా బీసీల హక్కులకోసం పోరాడుతున్న ఆర్.కృష్ణయ్యను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించారు. బీసీ ఓట్ల కోసం టీడీపీ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా పార్టీ విడుదల చేసిన ఎన్నికల పత్రికా ప్రకటనల్లో సైతం ఆయన ఫొటో కూడా ప్రచురించారు. కానీ కృష్ణయ్య ఓడిపోయేందుకు చేయాల్సిందంతా చేశారని ఆరోపణలు వస్తున్నాయి. కృష్ణయ్య గెలుపుకోసం కాకుండా పలువురు నేతలు ఆయన ఓటమి కోసం పనిచేయడంపై బుధవారం జరిగిన ఎన్నికల పోలింగ్ సరళిని విశ్లేషించుకున్న బీసీ వర్గాల్లో ఇప్పుడు అనుమానాలు తలెత్తుతున్నాయి.
అసమ్మతులకు పరోక్ష ప్రోత్సాహం
చంద్రబాబు కూడా కృష్ణయ్యను బరిలోకి దింపి, ఆ తర్వాత ఆయన గురించి పట్టించుకోవటం మానేశారు. ఆయన గెలుపు కోసం ముఖ్య నేతలెవ్వరికీ ఎలాంటి బాధ్యతలు అప్పగించలేదు. ఎల్బీనగర్ టిక్కెట్టు ఆశించి భంగపడ్డ ఎస్‌వీ కృష్ణప్రసాద్ అనుచరులు కృష్ణయ్య నామినేషన్ దాఖలు సమయంలోనే ఆయన వాహనశ్రేణితో పాటు అనుచరులపై దాడి చేశారు. అయినప్పటికీ కృష్ణప్రసాద్‌పై చంద్రబాబు చర్య తీసుకోలేదు. పలుచోట్ల టిక్కెట్టు ఆశించి భంగపడ్డవారిని పిలిపించి బుజ్జగించిన చంద్రబాబు కృష్ణ ప్రసాద్‌తో కనీసం మాట్లాడలేదు. కృష్ణయ్య సన్నిహితులు, బీసీ సంఘాల నేతలు కూడా చంద్రబాబు వైఖరిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు తెలిసింది.
బిసి సంక్షేమం పెదాల వరకే పరిమితం
ఎన్నికలకు రెండేళ్ల ముందు నుంచి రాష్ట్రవ్యాప్తగా బీసీలకు వంద సీట్లు ఇస్తానని పదేపదే చెబుతూ వచ్చిన బాబు తీరా ఎన్నికల సమయానికి అందులో సగం కూడా ఇవ్వకపోవడంతో బీసీ వర్గాల్లో తీవ్ర అసంతృప్తి ఏర్పడింది. తెలంగాణలో 119 అసెంబ్లీ సీట్లలో బీజేపీకి 45 సీట్లు కేటాయించారు. మిగిలిన 74 సీట్లలో 18 సీట్లు మాత్రమే బీసీలకు కేటాయించారు. బీజేపీకి కేటాయించగా మిగిలిన తొమ్మిది లోక్‌సభ సీట్లల్లో ఒక్కటి మాత్రమే బీసీకి కేటాయించారు. సీమాంధ్ర లోనూ ఇదే కథ పునరావృతం అయింది. సీమాంధ్రలో 175 అసెంబ్లీ సీట్లకు గాను బీజేపీకి 13 సీట్లు కేటాయించారు. మిగిలిన 162 సీట్లలో 40 సీట్లు చంద్రబాబు బీసీ సామాజికవర్గాలకు కేటాయించారు. టీడీపీ 21ఎంపీ సీట్లలో పోటీచేస్తుండగా మూడు సీట్లు మాత్రమే బీసీలకు కేటాయించారు.