చెల్లెమ్మ కల చెదిరింది
ఒకప్పుడు రాష్ట్ర హోం మంత్రిగా చక్రం తిప్పిన చేవెళ్ల చెల్లెమ్మ సబితా ఇంద్రారెడ్డికి కాంగ్రెస్ పార్టీ రిక్తహస్తం చూపించింది. కుటుంబానికి ఒకటే టికెట్ అన్న సూత్రం ప్రకారం చేవెళ్ల లోక్సభ స్థానాన్ని సబిత కుమారుడు కార్తీక్రెడ్డికి కేటాయించిన అధిష్ఠానం, సబితారెడ్డికి టికెట్ ఇవ్వలేదు. పోనీ.. తనకు ఇవ్వకపోయినా తన వాళ్లలో ఎవరికైనా ఇస్తే ఎలాగోలా చేవెళ్ల పార్లమెంటరీ స్థానం నుంచి కార్తీక్రెడ్డిని గెలిపించుకోవచ్చని అనుకుంటే, ఆ విషయంలోనూ మొండిచేయే ఎదురైంది. సబితా ఇంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మహేశ్వరం నియోజకవర్గాన్ని పొత్తులో భాగంగా సీపీఐకి కేటాయించారు. ఇది తన తనయుడి విజయావకాశాలను దెబ్బతీస్తుందని చేవెళ్ల చెల్లెమ్మ ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు.. ఈసారి రాజేంద్రనగర్ నుంచి తాను బరిలోకి దిగుదామనుకుంటే కూడా అధిష్ఠానం ఒప్పుకోలేదు. పోనీ తనవాళ్లు ఎవరికైనా ఇస్తారేమో అనుకున్నా.. దాన్ని సబిత వైరి వర్గానికి చెందిన జ్ఞానేశ్వర్ ముదిరాజ్‌కు కేటాయించడం ఆమెకు మింగుడుపడని గొంతులో పచ్చి వెలక్కాయలా అడ్డుపడింది.
మరోవైపు మల్కాజిగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్ పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా తయారైంది. కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణతో పొసగక.. టికెట్ రాదేమోననే అనుమానంతో ఆయన టీఆర్‌ఎస్‌లోకి జంప్ చేశారు. మర్నాడు.. మంద కృష్ణ మాదిగ నుంచి తనకు బెదిరింపులు వస్తున్నాయని, ప్రాణభయం ఉందంటూ రాజకీయాల నుంచి విరమించుకున్నట్లు ప్రకటించారు. ఈ పరిణామాల నేపథ్యంలో సోమవారం మళ్లీ కాంగ్రెస్ గూటికి వచ్చిన ఆకులను పార్టీ అక్కున చేర్చుకున్నా.. టికెట్ ఇవ్వడానికి మాత్రం నిరాకరించింది. మల్కాజిగిరి స్థానాన్ని బీజేపీకి కేటాయించడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్‌లో చేరిన టీడీపీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుకు కూడా ఆశించిన ఫలితం దక్కలేదు.