సిరిసిల్ల వస్త్రానికి ఎన్ని‘కళ’
సంక్షోభంలో ఉన్న సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు ఎన్నికల గాలితాకింది. వరుసగా ఎన్నికలు రావడంతో సిరిసిల్ల వస్త్రోత్పత్తి రంగానికి కళ వచ్చింది. ఇక్కడి వస్త్రోత్పత్తిదారులకు చేతినిండా పని లభిస్తోంది. రాజకీయపార్టీలు వినియోగించే బ్యానర్లు, జెండాలు, కండువాలు తయారీకి అవసరమైన గుడ్డ సిరిసిల్లలోనే ఉత్పత్తికావడంతో మంచి డిమాండ్ ఏర్పడింది. ఇక్కడ ఉత్పత్తి అవుతున్న గుడ్డ మన రాష్ట్రంతో పాటు జార్ఖండ్, ఉత్తరాంచల్, ఛత్తీస్‌గఢ్, తమిళనాడు, మధ్యప్రదేశ్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్రలకు ఎగుమతి అవుతోంది.
న్యూస్‌లైన్, సిరిసిల్ల,రాష్ట్రంలోనే అత్యధికంగా సిరిసిల్లలో 34 వేల మరమగ్గాలు ఉన్నాయి. ఇందులో 27వేల మరమగ్గాలపై పాలిస్టర్, 7వేల మగ్గాలపై కాటన్ గుడ్డ ఉత్పత్తి అవుతోంది. పాతికవేల కుటుంబాలు వస్త్రోత్పత్తి పరిశ్రమపై ఆధారపడి ఉన్నాయి. నూలు ధరలు పెరగడం, ఉత్పత్తి చేసిన గుడ్డకు గిరాకీ లేక వస్త్ర వ్యాపారులు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నారు. కరెంటు బిల్లులు పెరిగి విడిభాగాల రేట్లు ఎక్కువై వస్త్రోత్పత్తి గిట్టుబాటు లేని పరిస్థితి గతంలో ఎదురైంది.
ఇప్పుడు గుడ్డకు కాస్త ధర పెరగడంతో వ్యాపారులు ఊపిరి పీల్చుకున్నారు. ఒకేసారి స్థానిక, మున్సిపల్, సార్వత్రిక న్నికలు రావడంతో వస్త్రవ్యాపారులకు కలిసొచ్చింది. సిరిసిల్లలో నిత్యం 27లక్షల మీటర్ల గుడ్డ ఉత్పత్తవుతుండగా, గతంలో వస్త్ర నిల్వలు అమ్మకాల్లేక పేరుకుపోయాయి. ఎన్నికల పుణ్యమా.. అని ఇప్పుడు వస్త్ర నిల్వలన్నీ హైదరాబాద్‌లోని మార్వాడి సేట్లు కొనుగోలు చేయడంతో గుడ్డనిల్వలు లేకుండా పోయాయి.
ఎన్నికల పుణ్యమా అని..
ఎన్నికలకు అవసరమైన జెండాలు, బ్యానర్లు, కండువాలు, క్యాప్‌లకు చౌకగా లభించే గుడ్డ అవసరమవుతోంది. సిరిసిల్లలో నాసిరకం గుడ్డ ఉత్పత్తవుతుండగా, జాతీయ మార్కెట్లో సిరిసిల్ల గుడ్డను ఎన్నడూలేని విధంగా ఎన్నికల సమయంలో ఎక్కువగా కొనుగోలు చేయడం పరిపాటి. దీంతో సిరిసిల్ల వస్త్రానికి గిరాకీ పెరిగింది. ఈ నేపథ్యంలో మరమగ్గాల కార్మికులకు చేతినిండా పని లభిస్తోంది.
పాలిస్టర్ వస్త్రానికి డిమాండ్ ఉండడంతో కార్మికులతో యజమానులు, ఆసాములు పని చేయిస్తున్నారు. సిరిసిల్లలో 8గంటల పని విధానాన్ని అమలుచేయాలని ప్రభుత్వం నిర్దేశించగా, గుడ్డకు డిమాండ్ ఉండడంతో 12 గంటలు పని చేయిస్తున్నారు. మరో మూడు నెలల వరకు కార్మికులకు పని ఉంటుందని భావిస్తున్నారు.
సిరిసిల్లలో తక్కువ ధరకు గుడ్డ దొరుకుతుండగా, ఆ గుడ్డను రంగుల్లో ప్రింట్ చేసేందుకు ప్రాసెసింగ్ చేయడానికి మీటర్ రూ.10 వరకు ఖర్చవుతోంది. హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో మిల్లుల్లో ప్రాసెసింగ్ చేయడానికి ఎక్కువ ఖర్చవుతోంది. మొత్తంగా సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు ఊరట లభించింది.