బహుముఖ పోరు | elections fights between various constituency political leaders | Sakshi
Sakshi News home page

బహుముఖ పోరు

Published Sat, Apr 12 2014 2:30 AM | Last Updated on Tue, Aug 14 2018 4:21 PM

elections fights between various constituency political leaders

 మల్కాజిగిరి లోక్‌సభ స్థానం.. ఇప్పుడు హాట్‌స్పాట్‌గా మారింది. ఓటర్ల సంఖ్యపరంగా దేశంలోనే అతిపెద్ద లోక్‌సభ నియోజకవర్గమైన ఈ స్థానం నుంచి జయకేతనం ఎగరేసేందుకు ఉద్దండులు ఉవ్విళ్లూరుతున్నారు. ఈ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎంపీ సర్వే సత్యనారాయణ కాంగ్రెస్ అభ్యర్థిగా మరోసారి పోటీకి సిద్ధం కాగా ఆయన్ను ఢీ కొట్టేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. రాష్ట్ర తాజా మాజీ పోలీస్ డెరైక్టర్ జనరల్ వి.దినేశ్‌రెడ్డిని రంగంలోకి దింపింది.
 
 తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా సీఎంఆర్ విద్యాసంస్థల అధిపతి చామకూర మల్లారెడ్డి, తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థిగా మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, లోక్‌సత్తా అభ్యర్థిగా డాక్టర్ జయప్రకాశ్ నారాయణతో పాటు స్వతంత్ర అభ్యర్థి ప్రొఫెసర్ నాగేశ్వర్, ఆమ్‌ఆద్మీ పార్టీ నుంచిమాజీ ప్రధాని పీవీ నరసింహారావు మనవడు డాక్టర్ ఎన్‌వీ సుధాకిరణ్‌తో కలిపి మొత్తం పదిహేడు మంది బరిలో నిలిచారు.
 
 (శ్రీగిరి విజయ్‌కుమార్‌రెడ్డి)
 2009లో ఏర్పడ్డ ఈ లోక్‌సభ  జనరల్ స్థానం నుంచి మంచి విజయం సాధించిన సర్వే సత్యనారాయణ మరోసారి పోటీకి దిగారు. అయితే సర్వేపై స్థానికంగా వ్యతిరేకతకు తోడు శాసనసభ టికెట్ల పంపిణీ వ్యవహారం, పలు సందర్భాల్లో ఆయన అనుసరించిన తీరు నియోజకవర్గ పార్టీ కార్యకర్తల్లో అసంతృప్తికి కారణమైంది. కాంగ్రెస్‌లో కొనసాగిన నాయకులే ఎల్బీనగర్, కుత్బుల్లాపూర్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థులుగా శాసనసభకు పోటీ చేస్తుండటం, మల్కాజిగిరిలో ఇప్పటికీ బలమైన శక్తిగా ఉన్న ఆకుల రాజేందర్ సర్వేకు వ్యతిరేకంగా పనిచేయాలని నిర్ణయించటం,  నియోజకవర్గ పరిధిలో మెజారిటీ ఎమ్మెల్యే అభ్యర్థులతో ఇప్పటికీ ఆయనకు సఖ్యత లేకపోవటం, కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగి ఇతర పార్టీల్లో తన సానుభూతిపరులుగా ముద్రపడిన వారితో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్న తీరు ఈ ఎన్నికల్లో సర్వేను రెంటికి చెడ్డ రేవడిని చేసే అవకాశం లేకపోలేదు. దీనికితోడు ఈ నియోజకవర్గంలో ఫలితాన్ని నిర్ణయించే స్థాయిలో ఉన్న ఓ ప్రాంతం ప్రజలను పలుమార్లు అవమానించే తీరుగా సర్వే చేసిన వ్యాఖ్యలు కూడా ఆయన్ను ఇబ్బంది పెట్టే అవకాశం లేకపోలేదు.
 
 లోక్‌సత్తా..‘దేశం’ చెరో రూటు
 తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని ఈ నియో జకవర్గం నుంచి ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసేందుకు లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్‌నారాయణ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సీఎంఆర్ విద్యాసంస్థల అధిపతి చామకూర మల్లారెడ్డి సైతం లోక్‌సభ బరిలో నిలిచారు. అయితే గత ఆర్నెళ్ల నుంచి లోక్‌సత్తా, తెలుగుదేశం పార్టీ మధ్య పొత్తు ఉంటుందన్న సంకేతాలుండటం, చివరి నిమిషంలో ఎవరికీ వారే పోటీకి దిగటంతో లోక్‌సత్తా పరిస్థితి పూర్తి ఇబ్బంది కరంగా తయారైంది. ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ మద్దతు లేదని తేలిపోవటంతో లోక్‌సత్తా కార్యకర్తలు పూర్తిగా డీలాపడ్డారు.
 
 ఇక స్వతంత్ర అభ్యర్థిగా ఎంఎల్‌సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ పోటీలో ఉండటం లోక్‌సత్తాకు పెద్దదెబ్బగా భావించవచ్చు. ఇక తెలుగు దేశం విషయానికి వస్తే ఎల్‌బీనగర్, మల్కాజిగిరి, ఉప్పల్ నియోజకవర్గాల్లో పార్టీ ముఖ్య నాయకులంతా పార్టీని వదిలిపెట్టారు. ఎల్‌బీనగర్ స్థానాన్ని ఆర్.కృష్ణయ్యకు ఇవ్వటాన్ని నిరసిస్తూ నియోజకవర్గ ఇన్‌చార్జి కృష్ణప్రసాద్, ముఖ్య నాయకులు సామ రంగారెడ్డి, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు పార్టీని వదిలిపెట్టడంతో ఈ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి దయనీయంగా మారిపోయింది. ఉప్పల్  స్థానాన్ని బీజేపీకి ఇవ్వడాన్ని నిరసిస్తూ స్థానిక నాయకులంతా ఇతర పార్టీల్లో చేరిపోయారు.
 
 కారుకు స్టార్టింగ్ ట్రబుల్స్
 తెలుగుదేశం, ఆపై కాంగ్రెస్ పార్టీలను వదిలి చివరి నిమిషంలో టీఆర్‌ఎస్‌లో చేరిన మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు లోక్‌సభ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. నియోజకవర్గంలో మెజారిటీ ప్రాంతాల్లో పార్టీకి పునాదులు లేకపోవటం, ఇతర పార్టీల నుంచి చివరి నిమిషంలో టీఆర్‌ఎస్‌లో చేరిన వారికి టికెట్లు ఇవ్వటంతో కారు జోరందుకునేందుకు సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది.  
 
 ఆమ్ ఆద్మీ నుంచి పీవీ మనవడు
 ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున మాజీ ప్రధాని పీవీ మనవడు ఎన్‌వీ సుధాకిరణ్ పోటీ చేస్తున్నారు. ఈయన పీవీ పెద్దకూతురు శారద కుమారుడు. చాలాకాలం పాటు ఎన్‌టీఆర్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంకులో వివిధ హోదాల్లో పనిచేసిన సుధాకిరణ్ ఆమ్ ఆద్మీ పిలుపుతో క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చారు.
 
 దూసుకుపోతున్న.. దినేశ్‌రెడ్డి
 తాజా మాజీ డీజీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి వి.దినేశ్‌రెడ్డి ప్రచారంలో దూసుకు వెళుతున్నారు. సౌమ్యుడిగా పేరున్న దినేశ్‌రెడ్డికి ఈ నియోజకవర్గ వ్యాప్తంగా భారీ సంఖ్యలో బంధువులు, మిత్రులతో పాటు వివిధ వర్గాలకు చెందిన వారితో సన్నిహిత సంబంధాలున్నాయి.
 
 ఆయన క్రియాశీలక రాజకీయాల్లో చేరిన రోజు నుంచే నియోజకవర్గంలో హంగూ ఆర్భాటం లేకుండా విస్తృత పర్యటనలు చేస్తున్నారు. పోలీస్ శాఖలో అనేక విప్లవాత్మక మార్పులకు కారణమైన తనను, ఎంపీగా ఎందుకు గెలిపించాలో.. ఓటర్లకు వివరిస్తున్నారు. నిజాయితీపరుడిగా ముద్రపడిన దినేశ్‌రెడ్డికి ఈ నియోజకవర్గంలో అనేకమంది ముఖ్యులతో వ్యక్తిగత సంబంధాలకు తోడు వైఎస్ అభిమానులు భారీ ఎత్తున ఉన్నారు. అనేక మంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి దినేశ్‌రెడ్డ్డి కోసం ప్రచారాన్ని ప్రారంభించారు. పలు స్వచ్ఛంద సంస్థలు ఇప్పటికే దినేశ్‌రెడ్డికి మద్దతు ప్రకటించాయి. ఇక వైఎస్ హయాంలో ఫీజు రీయింబర్స్‌మెంట్, ముస్లిం రిజర్వేషన్లు, ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ  తదితర పథకాల  ద్వారా లబ్ధిపొందిన వారి సంఖ్య 70 శాతం వరకు ఉండటం వైఎస్సార్ కాంగ్రెస్‌కు కలిసొచ్చే అంశం.
 
 ఈ దఫా నియోజకవర్గం రూపురేఖలు మారుస్తా.
 నా శాఖకు సంబంధించి నియోజకవర్గం మీదుగా వెళ్లే రహదారులన్నింటినీ భారీ ఎత్తున విస్తరించాం. మంచినీటి పథకాలకు మోక్షం కల్పించాను.
 నియోజకవర్గంలో అన్ని ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకే నా ప్రాధాన్యం
 - సర్వే సత్యనారాయణ (కాంగ్రెస్)
 
 నియోజకవర్గంలో అన్ని ప్రాంతాలను కలిపే విధంగా మెట్రోరైల్ లైన్ ఏర్పాటుకు కృషి చేస్తా.
 పెరిగిన జనాభాకు తగ్గట్టుగా మౌలిక సదుపాయాల విస్తరణ.
 మంచినీరు, రహదారులు, డ్రైనేజీ, వీధిలైట్ల వంటి అంశాలతోపాటు విద్య, వైద్యం, ఉపాధి అంశాలకు ప్రాధాన్యమిస్తా.    
 - వి.దినేశ్‌రెడ్డి,(వైఎస్సార్‌సీపీ)
 
 నియోజకవర్గంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, ఐటీఐల ఏర్పాటుకు కృషిచేస్తా.  
 ఐటీ, ఐటీ ఆధారిత పరిశ్రమల జోన్ ఏర్పాటుకు కృషిచేస్తా.
 నగరాన్ని కాలుష్యరహిత ప్రాంతంగా అభివృద్ధి చేస్తా
 నిరుపేదలకు అందుబాటులో ప్రభుత్వ వైద్యం
 - సి.మల్లారెడ్డి (టీడీపీ)
 
 జనాభా నిష్పత్తి మేరకు ఆయా వార్డులకు బడ్జెట్‌ను కేటాయించి, పనులను స్థానిక కమిటీలకే అప్పగించేలా చూస్తా.
 రూ.7000 కోట్ల నిధుల కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి మంచినీటి వ్యవస్థను మెరుగుపరుస్తా.
 నియోజకవర్గంలో కొత్త పరిశ్రమల ఏర్పాటుకు  
 కృషిచేస్తా.      
 - జయప్రకాశ్ నారాయణ (లోక్‌సత్తా)
 
 ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషిచేస్తా.
 కృష్ణా మూడో దశ, గోదావరి జలాలను రప్పిం చటం, డ్రైనేజీ, నిర్మాణ ం నా తొలి ప్రాధాన్యత.
 నగరం చుట్టూ వ్యవసాయ భూములను హార్టికల్చర్ జోన్‌గా అభివృద్ధి చేయటం
 - డాక్టర్ సి.నాగేశ్వర్ (స్వతంత్ర)
 
 తెలంగాణ ఏర్పాటైన తర్వాత కూడా స్థానికులకు ప్రత్యేక కోటాలు లేకపోతే ప్రయోజనం ఉండదు.
 ముఖ్యంగా విద్య, ఉపాధి రంగాల్లో స్థానికుల కోసం ప్రత్యేక కోటాను కేటాయించేందుకు కృషి.
 మౌలిక సదుపాయాలకు అవకాశం కల్పిస్తూ, రహదారుల అభివృద్ధికి ప్రాధాన్యం.
 - మైనంపల్లి హన్మంతరావు (టీఆర్‌ఎస్)
 
 రాజకీయాలంటే అధికారాన్ని అనుభవించటం కాదు. కేవలం ప్రజాసేవకు ఓ మంచి మార్గం.
 అధికారం కోసం అడ్డమైన పార్టీలతో పొత్తులకు దిగే పార్టీల నిజస్వరూపాన్ని ఎండగడతాం.
 మౌలిక సదుపాయాల కల్పనతో పాటు స్వచ్ఛమైన పరిపాలన, సేవలు అందించేందుకు కృషిచేస్తా.
 - డాక్టర్ ఎన్‌వీ సుధాకిరణ్(ఆమ్ ఆద్మీ)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement