అవలీలగా సర్కార్ ఏర్పాటు చేస్తాం
పార్టీ ఓడితే నేనే బాధ్యత వహిస్తా: పొన్నాల
హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అవలీలగా తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ధీమా వ్యక్తం చేశారు. పార్టీ అధ్యక్షురాలు సోనియా వల్లే తెలంగాణ వచ్చిందన్న కృతజ్ఞతాభావంతో గతంలో ఎన్నడూ లేని విధంగా ఓటర్లు జాతరలా తరలొచ్చి కాంగ్రెస్‌కు బ్రహ్మరథం పట్టారని, ఓటింగ్ శాతం పెరగడానికి అదే ప్రధాన కారణమని అభిప్రాయపడ్డారు. గాంధీభవన్‌లో బుధవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈసారి హోరాహోరీ ప్రచారం జరిగినప్పటికీ తెలంగాణ ప్రజలు మాత్రం కాంగ్రెస్‌కే మద్దతు పలికారన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే క్రెడిట్ అందరికీ దక్కుతుందని, ఓడిపోతే మాత్రం తానొక్కడినే బాధ్యత వహిస్తానన్న మాటకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు.
తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు టీఆర్ఎస్ అవసరం రానేరాదని పొన్నాల వ్యాఖ్యానించారు. కేంద్రంలోనూ కేసీఆర్ మద్దతు లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికల హడావుడిలో తాను నవ్వడమే మర్చిపోయానని, ఇకపై మునుపటి పొన్నాల కనిపిస్తాడని నవ్వుతూ చెప్పారు.