నిజామాబాద్ బరిలో కవిత
* మెదక్ నుంచి కూడా కేసీఆర్ పోటీ
* గోదం నగేష్‌కు రెండు చోట్ల అవకాశం
* సిట్టింగ్ నేత భిక్షపతికి రిక్తహస్తం..
* పరకాల నుంచి సహోదర్ రెడ్డి
* టీఆర్‌ఎస్ మరో జాబితా విడుదల
సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ మరో విడత జాబితాను విడుదల చేసింది. ఇప్పటికే 8 పార్లమెంట్, 73 అసెంబ్లీ స్థానాలకు పార్టీ తరఫున బరిలోకి దిగే వారి పేర్లను ఖరారు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరో 8 మంది ఎంపీ, 36 మంది ఎమ్మెల్యే అభ్యర్థులను టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ మంగళవారం ప్రకటించారు. ఊహించినట్లే కేసీఆర్ కుమార్తె, తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కవితకు నిజామాబాద్ పార్లమెంట్ స్థానాన్ని కేటాయించారు. ఈ సీటును ఆశించిన నగేష్ గుప్తాకు నిజామాబాద్ అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అవకాశం కల్పించారు. ఇక కేసీఆర్ మెదక్ పార్లమెంట్‌తో పాటు గజ్వేల్ అసెంబ్లీ స్థానానికి కూడా పోటీ చేయనున్నారు. పార్టీ నేత గోదం నగేష్ కూడా ఆదిలాబాద్ పార్లమెంట్‌కు, బోథ్ అసెంబ్లీ బరిలోకి దిగుతుండటం గమనార్హం. కాగా, పరకాల సిట్టింగ్ ఎమ్మెల్యే భిక్షపతికి టికెట్ దక్కలేదు. ఇక్కడి నుంచి సహోదర్‌రెడ్డిని పోటీకి దింపుతున్నారు.
అలాగే మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే సీటును కనకారెడ్డికి కేటాయించారు. అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్ ఇటీవలే టీఆర్‌ఎస్‌లో చేరిన సంగతి తెలిసిందే. అయితే తనకు టికెట్ దక్కదని తెలుసుకుని ఆయన మళ్లీ కాంగ్రెస్ గూటికే చేరారు. అయితే అక్కడ కూడా ఆయనకు టికెట్ దక్కలేదు. కాగా, మంగళవారం ఉద యం నుంచి పార్టీ అభ్యర్థుల ఎంపికపై కేసీఆర్ తీవ్ర కసరత్తు చేశారు. మధ్యాహ్నం వరకు తెలంగాణ భవన్‌లోనే పార్టీ నేతలతో మంతనాలు జరిపారు. అయితే అక్కడికి నేతల తాకిడి ఎక్కువ కావడంతో తర్వాత నగర శివార్లలోని తన ఫాంహౌజ్‌కు వెళ్లిపోయారు.
తెలంగాణ భవన్‌లో నిరసనలు
కేసీఆర్ ప్రకటించిన జాబితాతో పలుచోట్ల ఆశావహుల్లో అసంతృప్తి రగిలింది. నగరంలోని గోషామహల్, మెదక్ జిల్లా నర్సాపూర్ అసెంబ్లీ టికెట్ దక్కని నాయకుల అనుచరులు తెలంగాణ భవన్‌కు తరలివచ్చి నిరసనకు దిగారు. గోషామహల్ టికెట్‌ను ఆశిస్తున్న మహేందర్‌రెడ్డిని కాదని ప్రేమ్‌కుమార్‌కు ఇవ్వడాన్ని నిరసిస్తూ ఆందోళనకు దిగారు. కొందరు కార్యకర్తలు పార్టీ కార్యాలయంపైకి ఎక్కి దూకుతామని బెదిరించారు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన పార్టీ నాయకులు నాయిని, కేకేలను కూడా చుట్టుముట్టి నిరసన తెలిపారు. నర్సాపూర్‌లో అవకాశం దక్కని స్థానిక నేత శ్రీశైలం కూడా అనుచరులతో వచ్చి నిరసన వ్యక్తం చేశారు. ఆత్మహత్య చేసుకుంటామని కొందరు కార్యకర్తలు ఒంటిపై కిరోసిన్ పోసుకున్నారు. పార్టీ నాయకులు సర్దిచెప్పడంతో చివరకు ఆందోళన విరమించారు.