గంగలో మునిగిన కేజ్రీవాల్
ఎన్నికల్లో పోటీ చేయడమంటే మాటలు కాదు. అందునా వారణాసి లాంటి చోట ఎన్నికల్లో పోటీ చేయాలంటే తప్పనిసరిగా గంగలో మునిగి తీరాల్సిందే. మహామహా నాయకులు చేశారు. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజరీవాల్ కూడా అదే చేశారు.
బిజెపి ప్రధాని అభ్యర్థిపై పోటీకి వారణాసి బరిలో దిగుతానని ప్రకటించిన అరవింద్ కేజరీవాల్ మంగళవారం అక్కడికి చేరుకున్నారు. వస్తూండగా దారిలోనే ఆయన ట్వీట్ చేసి మరీ 'నాపై బిజెపి హింసకు పాల్పడే అవకాశం ఉంది' అని కాషాయ సేన ముందరికాళ్లకు బంధం వేశారు. వచ్చీ రాగానే చొక్కా ప్యాంటూ విప్పేసి, తువ్వాలు కట్టుకుని గంగానదిలో దిగి స్నానం చేశారు.
మోడీపై పోటీకి దిగుతారా లేదా అన్నది ఆయన మంగళవారం ప్రకటించే అవకాశం ఉంది. 'నిండా మునిగేశాం. ఇంక చలేమిటి' అనుకుని బరిలోకి దిగేస్తారా లేక మిగతా నియోజకవర్గాల్లో పార్టీని గెలిపించుకోవడం ముఖ్యం అనుకుంటారా అన్నది త్వరలోనే తేలిపోనుంది.