
‘కోట్ల కుటుంబంతో పెట్టుకోకండి’
ఆలూరు: ‘కోట్ల కుటుంబంతో పెట్టుకోకండి. నాపై వ్యతిరేక వార్తలు రాస్తే మీ అంతు చూస్తాను’ అంటూ ఆలూరు సాక్షి విలేకరులను డోన్ మాజీ ఎమ్మెల్యే, కేంద్ర రైల్వేశాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి సతీమణి సుజాతమ్మ ఫోన్‌లో బెదిరించారు. ఈసారి కర్నూలు జిల్లా అలూరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఆమె కొన్ని ఫ్యాక్షన్ గ్రామాల్లో ఇటీవల పర్యటిస్తుండగా కొట్లాటలు జరిగాయి. ఈ కేసుల్లో స్థానిక పోలీసులు నిబంధనలు కాలరాసి వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలు వేధించారు.
ఈ అంశంపై ఆధారాలతో సహా సాక్షి దినపత్రికలో మంగళవారం ‘కోట్లతో పోలీసులు మిలాఖత్, ‘పోలీస్ పవర్’ శీర్షికన వార్తలు ప్రచురితమయ్యాయి. వీటిపై కోట్ల సుజాతమ్మ ఉదయం 9.25 నుంచి 9.35 గంటల మధ్య 9849610231 నంబర్ నుంచి సాక్షి విలేకరులకు ఫోన్ చేశారు. ‘ఇలాంటి వార్తలు రాస్తే మీ అంతు చూస్తా’నని హెచ్చరించారు. మిమ్మల్ని కోర్టుకు ఈడుస్తానని అన్నారు. దీనిపై ఏపీయూడబ్ల్యూజే నాయకులు స్వరూప్ కుమార్, తదితరులు స్పందిస్తూ... వాస్తవాలు రాస్తే ఇలా బెదిరించడం సరికాదన్నారు.