సిట్టింగ్ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి మృతి చెంది మూడు రోజులు కావస్తున్నా ఆళ్లగడ్డ నియోజకవర్గం కోలుకోలేదు. పరామర్శించడానికి వచ్చిన వారిని పట్టుకొని భూమా కుటుంబ సభ్యులు ఇప్పటికీ విలపిస్తున్నారు.
ఆళ్లగడ్డ, న్యూస్‌లైన్: సిట్టింగ్ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి మృతి చెంది మూడు రోజులు కావస్తున్నా ఆళ్లగడ్డ నియోజకవర్గం కోలుకోలేదు. పరామర్శించడానికి వచ్చిన వారిని పట్టుకొని భూమా కుటుంబ సభ్యులు ఇప్పటికీ విలపిస్తున్నారు. ప్రజలు కూడా ఎక్కడికక్కడ గుమిగూడి చర్చించుకుంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు. శోభా నాగిరెడ్డి 16 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా పని చేయడంతో స్థానిక ప్రజలు ఆమెకు తలలో నాలుకలాగా వ్యవహరిస్తూ వచ్చారు. అర్థరాత్రి సైతం ఫోన్ చేస్తే స్పందిస్తూ.. ప్రజలతో ఆమె మమేకమవుతూ వచ్చారు. వేలాది మంది ప్రజలు శనివారం ఆళ్లగడ్డ పట్టణంలోని భూమా నివాసం చేరుకొని.. ఇక మాకెవరు దిక్కంటూ గుండెలవిసేలా రోదించారు.
భూమా కుటుంబ సభ్యులైన అఖిల, నాగమౌనిక, జగత్ విఖ్యాత్‌రెడ్డిలు కూడా దుఃఖం ఆపుకోలేకపోయారు. కడప, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ఒంగోలు, తెలంగాణ, కోస్తాంధ్ర ప్రాంతాలకు చెందిన నాయకులు, ప్రజలు కూడా వచ్చి భూమా కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు. శోభమ్మ అంత్యక్రియల్లో శుక్రవారం మూడు లక్షల మంది పాల్గొన్నట్లు అంచనా. నియోజకవర్గంలో శోభా నాగిరెడ్డి అభిమానులు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు మూడు రోజుల నుంచి భోజనాలు కూడా చేయకుండా దిగాలు పడిపోయారని తెలుస్తోంది. ఇప్పట్లో నియోజకవర్గం కోలుకునే పరిస్థితి లేదని స్థానిక నాయకులు వివరిస్తున్నారు.