వారణాసిలో మోడీ - బీజేపీలో కొత్త వేడి
వారణాసిలో మోడీ - బీజేపీలో కొత్త వేడి
Published Mon, Mar 31 2014 12:25 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
లోకసభకు 80 మంది ఎంపీలను పంపే ఉత్తరప్రదేశ్ అన్ని పార్టీలకూ కీలకమే. అక్కడ గెలిచిన వారు దేశ రాజకీయాలను శాసిస్తారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ యూపీ నుంచి అనూహ్యంగా 20 వరకూ సీట్లు గెలుచుకుంది. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ సారి కూడా ఉత్తరప్రదేశ్ జాతీయ రాజకీయాల తీరుతెన్నుల్ని శాసించబోతోందా?
ఉత్తరప్రదేశ్ దేశానికి ఇప్పటి వరకూ ఎనిమిది మంది ప్రధానమంత్రులను ఇచ్చింది. నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, విశ్వనాథ్ ప్రతాప్ సింగ్, చరణ్ సింగ్, చంద్రశేఖర్, అటల్ బిహారీలు ఉత్తరప్రదేశ్ నుంచి ప్రాతినిథ్యం వహించిన వారే.
ప్రాభవం నుంచి పతనం దాకా...
1989 లో అయోధ్య ఉద్యమం ఊతకర్రతో ఉత్తర ప్రదేశ్ లో బిజెపి జెండా ఎగిరింది. 1998 లో 37 శాతం ఓట్లు, 62 సీట్లను సాధించి తిరుగులేని శక్తిగా ఎదిగింది. కానీ 2002 తరువాత నుంచీ బిజెపి గ్రాపు నేల చూపులే చూస్తోంది. ఒక పుష్కర కాలం పాటు అక్కడ కాషాయ గవర్నమెంటు కనీస ఛాయలు కూడా లేవు. 2009 లోకసభ ఎన్నికల్లో పార్టీ 17 శాతం ఓట్లతో సరిపెట్టుకుని, యూపి రాజకీయ నాలుగు స్తంభాలాటలో నాలుగో స్థానానికి దిగజారింది. ఆ తరువాత 2012 అసెంబ్లీ ఎన్నికల్లో అదేకథ రిపీట్ అయింది. ఈ సారి మరో రెండు శాతం ఓట్లు తగ్గాయి.
వాజ్ పేయీ రాజకీయ సన్యాసం, పార్టీకి సరైన నేతృత్వం లేకపోవడం, పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న బ్రాహ్మణ, రాజపుత్ర వర్గాల నేతల మధ్య కుమ్ములాట, మాజీ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ పార్టీని వీడటంతో చెల్లాచెదరైన ఓబీసీ ఓటు బ్యాంక్ వంటివి బిజెపిని కుంగదీశాయి. ఇంతే కాక బలీయమైన ప్రాంతీయకుల పార్టీల వల్ల బిజెపి పూర్తిగా దెబ్బతిన్నది. యాదవ్ ముస్లిం ఓట్లతో ములాయం సింగ్ యాదవ్ నాయకత్వంలోని సమాజ్ వాదీ పార్టీ, దళిత, ముస్లిం కాంబినేషన్ తో మాయావతి నేతృత్వం లోని బహుజన సమాజ్ పార్టీలు జాతీయ పార్టీలను దెబ్బతీశాయి.
వారణాసిలో మోడీ
అయితే ఇప్పుడు మాత్రం ఉన్నట్టుండి ఉత్తరప్రదేశ్ బిజెపిలో కొత్త చైతన్యం పెల్లుబుకుతోంది. బిజెపి పట్ల ఓటర్లలో కొత్త ఆసక్తి పెరుగుతోంది. దీనికి తోడు నరేంద్ర మోడీ వారణాసి నుంచి పోటీ చేయడంతో కనీసం తూర్పు ఉత్తరప్రదేశ్, పశ్చిమ బీహార్ లలోని నలభై యాభై స్థానాల్లో బిజెపికి ఎనలేని సానుకూలత ఏర్పడింది. వారణాసి తొలి నుంచీ హిందుత్వ కంచుకోట. అయోధ్య లో రామజన్మభూమి ఉంటే, కాశీలో విశ్వనాథ మందిరంఉంది. అయోధ్య లాగానే కాశీ మందిరం కూడా దాడికి గురైంది. కాశీలోని జ్ఞానవాపీ మసీదు స్థానంలో మందిరాన్ని నిర్మించాలన్న డిమాండ్ కూడా చాలా పాతది. అందుకే ఇక్కడ హిందుత్వ సెంటిమెంట్ చాలా బలంగా ఉంటుంది. మోడీ ఇక్కడి నుంచి బరిలో దిగడం వల్ల బిజెపి హిందుత్వ ఏజెండా చెక్కు చెదరలేదన్న సంకేతాలు వెళ్తాయి.
అమిత్ షా - మార్పుకు బాద్షా
ఉత్తరప్రదేశ్ లో బిజెపికి బాగా కలిసొస్తున్న మరో అంశం - అమిత్ షా. గుజరాత్ కి చెందిన ఈ వివాదాస్పద బిజెపి నేతకు యూపీ పార్టీ పగ్గాలు అప్పగించారు. ఇది నరేంద్ర మోడీ ఎంతో ఆలోచించి తీసుకున్న నిర్ణయం. గత 14 ఏళ్లుగా మోడీతో అతి సన్నిహితంగా పనిచేస్తున్ షా కి చక్కని సంస్థాగత నైపుణ్యాలున్నాయి. ఆయన గత ఒక్క ఏడాదిలో యూపీలోని 70 నియోజకవర్గాల్లో పర్యటించారు. మన లక్ష్యం 2014 కాదు. మన లక్ష్యం 2017 అసెంబ్లీ ఎన్నికలు అని ఆయన కార్యకర్తకు చెప్పారు. 401 కాషాయ రథాలను ఇప్పటికే 403 అసెంబ్లీ నియోజకవర్గాలలో విస్తృతంగా తిప్పుతున్నారు. వీటన్నిటి ఫలితంగా యూపీ రాజకీయాల్లో మార్పు వచ్చింది. 'బిజెపి ప్రధాన శత్రువు కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీలు కావు. బిఎస్ పీయే' అని పార్టీ కార్యకర్తలకు చెప్పారు. వీటన్నిటి ఫలితంగా బిజెపి భాగ్యరేఖ పైకి ఎగబాకడం మొదలైంది.
ఈ ఎన్నికల్లో బిజెపి ఏ మేరకు విజయం సాధిస్తుంది? దేశ రాజకీయాలను శాసించగలుగుతుందా? ఉత్తరప్రదేశ్ బిజెపి పాలిట ఉత్తమ ప్రదేశ్ అవుతుందా లేక ఉత్త ప్రదేశ్ అయి కూచుంటుందా? ఈ ప్రశ్నలకు జవాబులు త్వరలో దొరకబోతున్నాయి.
Advertisement
Advertisement