సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఇబ్రహీంపట్నం కొత్తగా నగరపంచాయతీ కావడం.. వీటి పరిధిలో నాలుగు గ్రామాలుండడంతో ఆసక్తికర పోటీ నెలకొంది. పార్టీల తరఫున చైర్మన్ అభ్యర్థులు ఖరారు కానప్పటికీ ఎవరికి వారు చైర్మన్ అభ్యర్థులుగా ప్రకటించుకుని ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. 20 వార్డుల్లో దాదాపు మెజారిటీ స్థానాల్లో టీడీపీ, కాంగ్రెస్ అభ్యర్థుల మధ్య నువ్వానేనా అన్న రీతిలో పోటీ నెలకొంది. కొన్ని వార్డుల్లో బీజేపీతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా ముందంజలో ఉన్నారు.
సీతారాంపేట్, ఖానాపూర్, శేరిగూడ గ్రామాల్లో అభ్యర్థుల సంఖ్య పెద్దగా లేనప్పటికీ.. ఇబ్రహీంపట్నంలో మాత్రం ప్రతి వార్డులోనూ ఆసక్తికర పోరు సాగుతోంది. 12వ వార్డు జనరల్‌కు రిజర్వ్ కావడంతో అన్ని సామాజిక వర్గాలకు చెందిన నేతలు బరిలో దిగారు. ఈ వార్డు నుంచి కాంగ్రెస్ తరపున మాజీ జెడ్పీటీసీ భర్త యాలాల యాదయ్య, టీడీపీ రాష్ట్ర నేత చంద్రశేఖర్‌లతో పాటు ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు కలిపి మొత్తం 13 మంది బరిలో ఉన్నారు. అదేవిధంగా ఏడో వార్డులోనూ టీడీపీ తరపున పోటీలో ఉన్నారు .రాములుతో పాటు ఇతర పార్టీల అభ్యర్థులు కూడా జోష్ మీదున్నారు. మిగిలిన వార్డుల్లోనూ అభ్యర్థుల మధ్య గట్టి పోటీ కనిపిస్తోంది.
ఉదయం ఆరున్నర గంటలకే ప్రచారాన్ని ప్రారంభిస్తున్న అభ్యర్థులు.. సాయంత్రం రెండోవిడత ప్రచారానికి సిద్ధపడుతున్నారు. ఎండలు తీవ్రమవుతున్న తరుణంలో మధ్యాహ్నం సమయంలో సైతం ప్రచారానికి అభ్యర్థులు వెనకడుగేయడం లేదు. మహిళా అభ్యర్థుల ప్రచారం మరింత ఆసక్తికరంగా మారింది. పూలు, కుంకుమబొట్లతో విన్నూతంగా, సంప్రదాయబద్దంగా కొత్తరకమైన ప్రచారానికి తెరతీశారు.
తాండూరులో ఇంటిపోరు
మున్సిపల్ ఎన్నికల్లో పలు వార్డుల్లో రెబల్స్ బరిలో ఉండటం అభ్యర్థులను కలవరపాటుకు గురిచేస్తోంది. పలు వార్డుల్లో టీఆర్‌ఎస్,కాంగ్రెస్ నుంచి టిక్కెట్లు ఆశించి భంగపడిన పలువురు తిరుగుబాటు బాట పట్టారు. ఓ వార్డులో సొంత అన్నదమ్ములు పోటీపడుతున్నారు. 18 వార్డులో కాంగ్రెస్ నుంచి సయ్యద్‌ముజీబ్ హుస్సేన్, ఆయన తమ్ముడు తమ్ముడు జాకీర్ హుస్సేన్ బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు. ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములిద్దరూ పోటీ చేస్తుండటంతో ఇక్కడ పోరు రసవత్తరంగా సాగుతోంది. ఇక 21వ వార్డు నుంచి టీఆర్‌ఎస్ తరపున హన్మంతు పోటీ చేస్తుండగా... ఆ పార్టీ రెబెల్ అనిల్‌సింగ్ కయ్యానికి కాలుదువ్వారు. కొన్ని కారణాల వల్ల బీ-ఫారం హన్మంతుకు దక్కడంతో పట్టువదలని అనిల్‌సింగ్ స్వతంత్ర అభ్యర్థిగానే బరిలోకి దూకారు.
11వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా అలీం పోటీచేస్తుండగా... రెబల్‌గా మాజీ కౌన్సిలర్ ఇర్ఫాన్ పోటీలో ఉన్నారు. 12వ వార్డు నుంచి మున్సిపల్ మాజీ చైర్మన్ సత్తయ్యగౌడ్ కొడుకు జి.సుదర్శన్‌గౌడ్‌కు కాంగ్రెస్ టికెట్ దక్కలేదు. ఇక్కడ పార్టీ వెంకటేశంకు బీ-ఫారం ఇవ్వడంతో సుదర్శన్‌గౌడ్ రెబల్‌గా పోటీపడుతున్నారు. 15వ వార్డు నుంచి కాంగ్రెస్ బీ-ఫారం మాజీ కౌన్సిలర్ లయఖ్‌ఫాతిమాకు దక్కడంతో ఈ వార్డుకు చెందిన కాంగ్రెస్ నాయకుడు రఫిఖ్‌ఖాన్ కూడా పోటీలో ముందుకు సాగుతున్నారు. మొత్తం మీద మున్సిపాలిటీలో రెబల్స్ జోరు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.
వికారాబాద్‌లో ఇంటిపోరు...
వికారాబాద్ మున్సిపల్ ఎన్నికల సమరంలో రాజకీయాలు వేడెక్కాయి. దాదాపు బరిలో నిలిచిన అన్ని పార్టీల్లోనూ ఇంటిపోరు ఎక్కువైంది. ఆయా పార్టీల నుంచి టికెట్లు దక్కని వారంతా రెబల్స్‌గా మారి ప్రత్యర్థుల గెలుపుకోసం ప్రయత్నిస్తున్నారు. ఈ పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో ఒకింత ఎక్కువగా కన్పిస్తోంది. టీఆర్‌ఎస్‌లో సైతం నేతలు ఒకరికొకరు సహకరించుకునే పరిస్థితి కన్పించడం లేదు. దాదాపు 14 వార్డుల్లో రెబల్స్ అసలు అభ్యర్థులకు వణుకు పుట్టిస్తున్నారు.
‘పుర’పోరు రసవత్తరం!
Published Sun, Mar 23 2014 11:46 PM | Last Updated on Tue, Aug 14 2018 4:21 PM
Advertisement
Advertisement