సాక్షి, ముంబై : అసెంబ్లీ ఎన్నికల సమరానికి ఎన్సీపీ సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ విషయంపై పార్టీ పదాధికారులు, ప్రముఖ నాయకులతో ఎన్సీపీ అధ్యక్షుడు శరద పవార్ చర్చలు జరిపారు. తాజాగా మళ్లీ ఈ నెల 10వ తేదీన పార్టీ ప్రముఖ నాయకులు, పదాధికారులతో పవార్ సమావేశం కానున్నారు. ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ అధికార నివాసమైన దేవగిరి బంగ్లాలో జరగనున్న ఈ సమావేశంలో పార్టీకి చెందిన ప్రస్తుత ఎంపీలు, ఎమ్మెల్యేలందరూ హాజరుకానున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సమావేశంలో అసెంబ్లీ ఎన్నికల వ్యూహరచన చేయనున్నారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఎలాగున్నా అసెంబ్లీలో మాత్రం ఎట్టి పరిస్థితిల్లోనూ అధిక స్థానాలు సాధించి మళ్లీ అధికారంలోకి రావాలని ఎన్సీపీ యోచిస్తోంది. కాంగ్రెస్‌తో విభేదాలు తీవ్రమైతే ఒంటరిగానైనా బరిలోకి దిగాలనే ఆలోచనలో ఎన్సీపీ ఉంది. దీంతో అన్ని కోణాల్లో ఆలోచించి ఆచితూచి అడుగు వేస్తున్నారు.
పార్టీ నియమాలను ఉల్లంఘించినవారిపై కఠిన చర్యలు..
పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇప్పటికే కొందరిని సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా నందుర్బార్ ఎమ్మెల్యే, వైద్య, విద్యాశాఖ మంత్రి అయిన విజయ్‌కుమార్ గావిత్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన మంత్రి పదవి కూడా కోల్పోవాల్సి వచ్చింది. అదేవిధంగా అమరావతికి చెందిన సంజయ్ ఖోడకేపై కూడా చర్యలు తీసుకుంది. ఇదే క్రమంలో కొంకణ్ లోని ఎమ్మెల్యే దీపక్ కేసరకర్, వినాయక్ మెటేపై కూడా ఈ సమావేశంలో ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి. అదేవిధంగా కొంకణ్, ఉత్తర మహారాష్ట్ర, మరాఠ్వాడాకి చెందిన అనేక మంది నాయకులు, పదాధికారులపై పార్టీ నియమాల ఉల్లంఘనపై చర్యలు తీసుకునే అవకాశాలు మెండుగా కన్పిస్తున్నాయి.
వీరిలో ఎమ్మెల్యేలు కూడా ఉన్నారని తెలిసింది. మరోవైపు మే 10న జరగనున్న సమావేశంలో బలాబలాలపై కూడా చర్చలు జరగనున్నాయి. కాంగ్రెస్‌తో మళ్లీ కూటమిగానే పోటీ చేసినట్టయితే ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి..? గతంకంటే అధిక స్థానాలు డిమాండ్ చేయవచ్చా..? ఒంటరిగా బరిలోకి దిగితే ఎలాంటి పరిణామాలు ఉండే అవకాశాలున్నాయి..? తదితర అనేక విషయాలపై చర్చలు జరిగే అవకాశాలున్నాయని తెలిసింది. అదే విధంగా అసెంబ్లీ ఎన్నికల కోసం కొందరు నాయకులకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించనున్నారు.
అసెంబ్లీ సమరానికి ఎన్సీపీ సన్నద్ధం
Published Fri, May 2 2014 10:33 PM | Last Updated on Fri, Oct 19 2018 8:23 PM
Advertisement
Advertisement