బతుకు బతుకమ్మ కావాలె: తెలంగాణ... ఓ చారిత్రక నేపథ్యం. ఆత్మ గౌరవ నినాదమే ఆయుధం. స్వయం పాలనకు ధిక్కార స్వరం. ఆవేశం, అమాయకత్వం ఇక్కడి ప్రత్యేకం.
బతుకు బతుకమ్మ కావాలె: తెలంగాణ... ఓ చారిత్రక నేపథ్యం. ఆత్మ గౌరవ నినాదమే ఆయుధం. స్వయం పాలనకు ధిక్కార స్వరం. ఆవేశం, అమాయకత్వం ఇక్కడి ప్రత్యేకం. స్వేచ్ఛ కోసం ముక్కోటి గొంతుకలతో భూమి బద్దలయేటట్టు నినదించిన నేల. బిగిసిన పిడికిళ్లతో మరో స్వతంత్ర సంగ్రామాన్ని తలపించిన పోరాటం. ఉవ్వెత్తున ఉప్పెనలా యువతరం ఉరుములై గర్జించిన పోరు గడ్డ. ఎన్నెన్నో పోరాటాలకు నిలయంగా మారిన ఈ ప్రాంతం ఆక్రోశం, ఆగ్రహం, ఆశయ స్ఫూర్తికి వేదికగా నిలిచింది. కాళ్లగజ్జెల కవాతై తిరుగాడింది. పిడికిలెత్తి నిలబడ్డది. బలిదానాలు.. ఆత్మార్పణలు.. తీరని శోకాలతో కదలాడింది.
..నేడు అరవై ఏళ్ల కల సాకారమైంది. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. గంపెడాశతో ఉజ్వల భవిష్యత్‌ను కోరుకుంటోంది. రాళ్లగుట్టలు... కంప పొరకలు.... మట్టి దుబ్బలు... ఎండిన బీళ్లు... పల్లె కన్నీళ్లను ఇక దూరం చేద్దామంటోంది. తెర్లయిన బతుకులకు రాంరాం పలుకుతూ ధూంధాం చేద్దాం రమ్మంటోంది. నడుం బిగించి జజ్జనకరి జనారె అంటూ చీకటికి చరమగీతం పాడుదామంటోంది. వీర తెలంగాణ ...పోరు తెలంగాణ.. వేరు తెలంగాణ ఇక అవ్వల్ దర్జా తెలంగాణగా మారాలని ఆకాంక్షిస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ నవ నిర్మాణంపై వివిధ రంగాలకు చెందిన మేథావులు, నిపుణుల అభిప్రాయాలు నేటినుంచి...
నవ తెలంగాణ నిర్మాణంలో భాగం కండి
అమరుల త్యాగాలు... సబ్బండ వర్ణాల పోరాటాలతో అరవై ఏళ్ల తండ్లాట తీరింది. నెత్తుటి జ్ఞాపకాలు, నిత్య నినాదాలతో చరిత్రలో నిలిచిన తెలంగాణ గడ్డ నేడు నవ తెలంగాణ కోరుకుంటున్నది. సామాజికంగా, ఆర్ధికంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా మరింతగా వెలుగులీనాలంటే ఎలాంటి మేలిమి మార్పులు రావాలి? అందుకోసం ఏమేం చేయాలి? ఎవరెవరు ఎలా నడుం బిగించాలి? వీటన్నింటి మీద మీ ఆలోచనలను ‘సాక్షి’తో పంచుకోండి. మీ అభిప్రాయాలను క్లుప్తంగా మాకు రాసి పంపండి. ఫొటోను జతపర్చండి.
- ఎలక్షన్ సెల్, సాక్షి దినపత్రిక, రోడ్ నం.1 బంజారాహిల్స్, హైదరాబాద్