జిల్లా కాంగ్రెస్‌లో ఎప్పటినుంచో రగులు తున్న వర్గాలు ఎన్నికల వేళ జూలు విప్పాయి. టికెట్ల ఖరారులో మాజీ మంత్రి అరుణ వర్గీయులది పై చేయి అయిందని భావిస్తున్న కొందరు నేతలు తమను పట్టించుకోని పార్టీకి చుక్కలు చూపించాలని ఎత్తులు వేస్తున్నారు. తిరుగుబాటు అస్త్రాన్ని సంధించి స్వతంత్రులుగా బరిలో దిగాలని యోచిస్తున్నారు. తమ సత్తా ఏమిటో ప్రజల ద్వారానే చూపించి పట్టు సాధించేందుకు ప్లాన్‌చేస్తున్నారు.
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : కాంగ్రెస్ పార్టీలో టికెట్ల కేటాయింపు సందర్భంగా చెలరేగిన అసమ్మతి ఇప్పట్లో చల్లారే సూచనలు కనిపించడం లేదు. టికెట్ దక్కని నేతలు పార్టీ అధిష్టానానికి చుక్కలు చూపించాలనే వ్యూహంపై కసరత్తు చేస్తున్నారు. కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి, డీకే అరుణ లాబీయింగ్ మూలంగా టికెట్ దక్కని నేతలు స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేసేందుకు సిద్దమవుతున్నారు. కొడంగల్ నుంచి టికెట్ దక్కని మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్‌రెడ్డి ఇప్పటికే టీఆర్‌ఎస్ గూటికి చేరి టికెట్ కూడా సాధించుకున్నారు.
మిగతా చోట్ల ఇతర పార్టీల్లో అవకాశం లేకపోవడంతో సొంతంగా పోటీ చేయాలని భావిస్తున్నారు. కొల్లాపూర్ టికెట్ దక్కని విష్ణువర్దన్ రెడ్డి మంగళవారం హైదరాబాద్‌లో టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్యతో భేటీ అయ్యారు. మాజీ మంత్రి డీకే అరుణ, మల్లు రవి సమక్షంలో విష్ణువర్దన్ రెడ్డిని బుజ్జగించేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. పార్టీ ఎంపిక చేసిన అభ్యర్థి హర్షవర్దన్ రెడ్డికి మద్దతుగా ప్రచారం చేయాల్సిందిగా సూచించారు. పార్టీ అధికారంలోకి వస్తే భవిష్యత్తులో ఇతర అవకాశాలు ఇస్తామంటూ నచ్చ చెప్పేందుకు ప్రయత్నించారు. అయితే విష్ణువర్దన్ రెడ్డి అవలంభించే వైఖరి బుధవారం వెల్లడి కానున్నది. మరోవైపు షాద్‌నగర్ నుంచి టికెట్ ఆశించిన వీర్లపల్లి శంకర్, రమేశ్‌రెడ్డి (జడ్చర్ల), ప్రదీప్ కుమార్ గౌడ్ (దేవరకద్ర) తదితర నాయకులు స్వతంత్రులుగా బరిలోకి దిగే అవకాశం వుంది. మహబూబ్‌నగర్ ఎంపీ టికెట్ ఆశించి భంగపడిన ఓ నేత అసమ్మతి నేతలను కూడగట్టే ప్రయత్నంలో వున్నట్లు సమాచారం. వీరిని ప్యానెల్‌గా ఏర్పాటు చేసి స్వతంత్ర ఎంపీ అభ్యర్తిగా బరిలోకి దిగేందుకు సదరు నేత వ్యూహం సిద్దం చేసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.
జైపాల్‌కు తప్పని అసమ్మతి పోటు?
పట్టుబట్టి మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానాన్ని దక్కించుకున్న కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డికి కాంగ్రెస్ అసెంబ్లీ అభ్యర్థుల ఎంపిక వ్యవహారం చుట్టుకునేలా కనిపిస్తోంది. కొడంగల్ స్థానాన్ని మాజీ ఎంపీ విఠల్‌రావుకు కేటాయించడంతో మిగతా నియోజకవర్గాలపై ప్రభావం కనిపిస్తోంది. మక్తల్, దేవరకద్ర నియోజకవర్గాల్లో తాను సూచించిన అభ్యర్థులకు జైపాల్‌రెడ్డి టికెట్లు ఇప్పించుకోలేక పోయారు. ఇతర అసెంబ్లీ స్థానాల్లో షాద్‌నగర్, నారాయణపేట కాంగ్రెస్ అభ్యర్థులు మాత్రమే జైపాల్‌రెడ్డికి అనుకూలంగా వున్నట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీలో అంతర్గతంగా నెలకొన్న వ్యతిరేకతను జైపాల్‌రెడ్డి ఎలా అధిగమిస్తారనే అంశంపై సొంత పార్టీ నేతలు ఉత్కంఠతో చూస్తున్నారు.
చుక్కలు చూపిద్దాం...!
Published Wed, Apr 9 2014 3:52 AM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM
Advertisement
Advertisement