ఆర్మూర్, న్యూస్‌లైన్ : ఆర్మూర్ మున్సిపల్ ఎన్నికలలో పోటీపడుతున్న అభ్యర్థులు నిబంధనలకు విరుద్ధంగా పరిమితికి మించి ఖర్చులు చేస్తున్నారు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం కౌన్సిలర్‌గా పోటీచేస్తున్న అభ్యర్థి తన ప్రచారానికి లక్ష రూపాయలు మాత్రమే ఖర్చు చేయాల్సి ఉంటుంది. రాజకీయ పార్టీలు అందించే ప్రచార సామగ్రికి మినహాయింపు ఉంటుంది. నామినేషన్ వేసిన నాటి నుంచి అభ్యర్థి చేసిన ఖర్చులను రెండు రోజులకు ఒకసారి అదనపు ఎన్నికల అధికారికి సమర్పించాల్సి ఉంటుంది. ఈనెల 10వ తేదీన నామినేషన్ల పర్వం ప్రారంభమైంది.
ఈనెల 30న పోలింగ్ ఉన్నందున, 29వ తేదీ వరకు అభ్యర్థులు ప్రచారపు ఖర్చుల వివరాలను అధికారులకు అందజేయాల్సి ఉంటుంది. పట్టణంలోని 23 వార్డులలో నామినేషన్‌ల పరిశీలన, ఉపసంహరణల అనంతరం వివిధ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు 142 మంది పోటీలో ఉన్నారు. ఈసారి ఎన్నికల నిబంధనల ప్రకారం పోటీలో ఉండే అభ్యర్థులు ముందుగానే జీరో బ్యాల్సెన్‌తో బ్యాంకు ఖాతా తెరవాలి. ప్రచారం ఖర్చులను ఈ ఖాతా ద్వారానే నిర్వహించాల్సి ఉంటుంది. అయితే ఈ నిబంధనను అభ్యర్థులు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇప్పటి వరకు కేవలం 60 శాతం మంది అభ్యర్థులు మాత్రమే తమ బ్యాంకు ఖాతాలను మున్సిపల్ ఎన్నికల అధికారులకు సమర్పించారు. ప్రచారంతో పాటు ఇతర ఖర్చుల వివరాలను అభ్యర్థులు ఎన్నికల అధికారులు తెలియజేయడం లేదు.
ప్రచార ఖర్చులు సమర్పించింది ఇద్దరే..
మున్సిపల్ ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా కౌన్సిలర్ అభ్యర్థులు ప్రచార ఖర్చు వివరాలను సమర్పించాల్సి ఉండగా, మంగళవారం సాయంత్రం వరకు ఆర్మూరులో కేవలం ఇద్దరు అభ్యర్థులు మాత్రమే ప్రచార ఖర్చును సమర్పించారు. 18వ వార్డుకు చెందిన చిట్ల పుష్ప, 23వ వార్డుకు చెందిన అంజుమ్ ముజాహత్ మాత్రమే తమ ఎన్నికల ఖర్చును సమర్పించారు. మిగిలిన అభ్యర్థులకు మున్సిపల్ ఎన్నికల సిబ్బంది ఫోన్‌లు చేస్తూ ఎన్నికల ఖర్చుల వివరాలు సమర్పించాల్సిందిగా సూచిస్తున్నారు. స్పందించని అభ్యర్థులకు నోటీసులు జారీ చేయడానికి అధికారులు సిద్ధమవుతున్నట్లు తెలిసింది.
లెక్కా లేదు.. పత్రం లేదు...
Published Wed, Mar 26 2014 1:19 AM | Last Updated on Tue, Aug 14 2018 4:32 PM
Advertisement