సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : సీపీఐ-కాంగ్రెస్ పొత్తు దాదాపు ఖరారైందని భావించిన తరుణంలో, కామ్రేడ్లు టీఆర్‌ఎస్‌తో పొత్తు దిశగా అడుగులు వేస్తుండటం జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారనున్నాయి. ఈ రెండింటిలో ఏ పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పటికీ సీట్ల పంపకాల్లో జిల్లాలోని బెల్లంపల్లి స్థానాన్ని మాత్రం తమకే కేటాయించాలని సీపీఐ పట్టుబడుతోంది. ఇక్కడ ఆ పార్టీ శాస నసభాపక్ష నేత గుండా మల్లేష్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
గత ఎన్నికల్లో ఆయన ఇక్కడి నుంచే ఎమ్మెల్యేగా గెలుపొందా రు. సీపీఐ-టీఆర్‌ఎస్ పొత్తు ఖరారైన పక్షంలో బెల్లంపల్లి నుం చి పోటీ చేయాలని భావిస్తున్న మాజీ మంత్రి, టీఆర్‌ఎస్ ని యోజకవర్గ ఇన్‌చార్జి గడ్డం వినోద్ ఆశలు గల్లంతవనున్నాయి. బెల్లంపల్లి, చెన్నూరు స్థానాల్లో ఏదైనా ఒక చోట నుంచి వినోద్ పోటీ చేసేందుకు గట్టి ప్రయత్నాల్లో ఉన్నారు. చెన్నూరులో సిట్టింగ్ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు ఉండటంతో బెల్లంపల్లిపైనే ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. తీరా ఇప్పుడు సీపీఐ టీఆర్‌ఎస్‌తో పొత్తు కుదిరితే వినోద్ ప్రత్యామ్నాయం వెతుక్కోవాల్సి వస్తుంది. ఇందులో భాగంగా ఆయన కరీంనగర్ జిల్లా ధర్మపురి స్థానం నుంచి పోటీ చేసేందుకు ప్రత్యామ్నా ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు ప్రచారం జరిగింది.
మున్సిపల్ బరిలో పొత్తుతోనే..
రాష్ట్ర స్థాయిలో పొత్తు ఇంకా ఖరారు కాకపోయినా బెల్లంపల్లి మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం ఇప్పటికే టీఆర్‌ఎస్, సీపీఐ జతకట్టాయి. బెల్లంపల్లి మున్సిపాలిటీలో కలిసి పోటీ చేస్తున్నాయి. సీట్ల పంపకాల్లో భాగంగా టీఆర్‌ఎస్ 28 వార్డుల్లో పోటీ చేస్తుంటే, ఎనిమిది వార్డుల్లో సీపీఐ అభ్యర్థులను బరిలోకి దింపింది. రెండు చోట్ల మాత్రం స్నేహపూర్వక పోటీ కొనసాగుతోంది. ఈ పొత్తు సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఉండే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు సీపీఐ కాంగ్రెస్‌తో పొత్తు ఖరారైన పక్షంలో ఈ స్థానానికి పోటీ చేయాలని భావిస్తున్న కాంగ్రెస్ నాయకుల ఆశలపై నీళ్లు చల్లినట్లు కానుంది.
కాంగ్రెస్ నుంచి ఇన్‌చార్జి చినుముల శంకర్‌తోపాటు, మాజీ ఎమ్మెల్యే అమరాజుల శ్రీదేవి, సి.దుర్గాభవాణి, కే.హెమలత, రాజేశ్వర్‌రావు, రవికుమార్, డి.నర్సయ్య తదితరులు కాంగ్రెస్ టిక్కెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. కాంగ్రెస్ సీపీఐతో పొత్తు కుదిరితే వీరు కాంగ్రెస్ తరఫున పోటీ చేసే అవకాశం లేకుండా పోనుంది. పొత్తు, సీట్ల పంపకాల్లో భాగంగా సీపీఐ తెలంగాణలో 3 ఎంపీ, 20 అసెంబ్లీ స్థానాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. ఇందులో ఆదిలాబాద్‌తోపాటు మెదక్, వరంగల్, మహబూబ్‌నగర్‌లలో ఒక్కో సీటును తమకు కేటాయించాలనే డిమాండ్‌తో ఉంది. నల్గొండ, ఖమ్మంలో మూడేసి సీట్లు, కరీంనగర్‌లో రెండు స్థానాలు కేటాయించాలని కోరుకుంటోంది.
సీపీఐకి పలు చోట్ల పట్టు
సీపీఐకి జిల్లాలో పలుచోట్ల మంచి పట్టుంది. ముఖ్యంగా సింగరేణిలో ఈ పార్టీ అనుబంధ కార్మిక సంఘమైన ఏఐటీయూసీ బలంగా ఉంది. సింగరేణి ఓట్లు బెల్లంపల్లితోపాటు, జిల్లాలోని శ్రీరాంపూర్ (మంచిర్యాల నియోజకవర్గం), మందమర్రి, రామకృష్ణాపూర్ (చెన్నూరు నియోజకవర్గం) ప్రాంతాల్లో అధికంగా ఉంటాయి. ఆదిలాబాద్‌తోపాటు, మరికొన్ని ప్రాంతాల్లో కూడా సీపీఐకి కేడర్ ఉంది. పొత్తు ఖరారైతే సీపీఐ పట్టున్న ఈ ప్రాంతాల్లో తమకు కలిసొస్తుందనే భావనతో కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లు భావిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ ఎన్నికల్లో సీపీఐతో పొత్తు పెట్టుకుని, ఎన్నికలయ్యాక కేంద్రంలో బీజేపీకి మద్దతివ్వాల్సి వస్తే రాజకీయ విమర్శలు ఎదురవుతాయని తమ అధినేత భావిస్తున్నారని టీఆర్‌ఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి.
వినోద్ ఆశలు గల్లంతు?
Published Tue, Mar 25 2014 2:23 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM
Advertisement
Advertisement