ఉగ్రవాదుల పట్ల కాంగ్రెస్ మెతక వైఖరి అవలంబిస్తోందన్న బీజేపీ విమర్శలపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు.
బీజేపీపై రాహుల్ నిప్పులు
ఎన్డీయే పాలనలో ఉగ్రదాడులకు 22 వేల మంది బలి
కాషిపూర్(ఉత్తరాఖండ్): ఉగ్రవాదుల పట్ల కాంగ్రెస్ మెతక వైఖరి అవలంబిస్తోందన్న బీజేపీ విమర్శలపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ఎన్డీయే ఆరేళ్ల పాలనా కాలంలో ఉగ్రవాదుల పట్ల అవలంబించిన వైఖరి.. దేశంలో ఆ ఆరేళ్ల కాలంలో 22 వేల మంది అమాయకుల ప్రాణాలను పొట్టనబెట్టుకుందని నిప్పులు చెరిగారు. ‘కాంధహార్ హైజాక్’ వ్యవహారంలో అప్పటి వాజపేయి ప్రభుత్వం హైజాకర్లకు అనుకూలంగా వ్యవహరించబట్టే దేశంలో ఉగ్రదాడులు పెచ్చరిల్లాయని దుయ్యబట్టారు.
బీజేపీ ప్రభుత్వంలో ప్రధాని వాజ్‌పేయి సహా ఉన్నతస్థాయి మంత్రులు నంబర్ ఒకటి నుంచి ఐదు వరకు హైజాకర్ల డిమాండ్లకు తలూపి, ఏం కావాలో చెప్పండంటూ హైజాకర్లను కోరారని, వారికి(హైజాకర్లకు) డబ్బు కూడా ఇచ్చారని, ముగ్గురు ఉగ్రవాదులను సైతం దేశం నుంచి విడిచిపెట్టారని విమర్శించారు. వారిని అప్పటి విదేశీ వ్యవహారాల మంత్రి జశ్వంత్ సింగ్ పాకిస్థాన్ వరకు తీసుకెళ్లి విడిచిపెట్టి వచ్చారని రాహుల్ దుయ్యబట్టారు. ఈ మేరకు మంగళవారం ఉత్తరాఖండ్‌లోని కాషిపూర్‌లో నిర్వహించిన ఎన్నికల సభలో రాహుల్ గాంధీ ప్రసంగించారు. కాశ్మీర్‌లో కాంగ్రెస్ విధానాల కారణంగానే ఉగ్రమూకలు తోకముడిచాయని ఆయన చెప్పారు.