ఆరులో జోరెవరిది? | who are the winners in six phase elections | Sakshi
Sakshi News home page

ఆరులో జోరెవరిది?

Published Thu, Apr 24 2014 1:10 AM | Last Updated on Tue, Nov 6 2018 4:55 PM

ఆరులో జోరెవరిది? - Sakshi

ఆరులో జోరెవరిది?

దేశవ్యాప్తంగా ఐదు దశల్లో 232 లోక్‌సభ నియోజకవర్గాల్లో జరిగిన ఎన్నికల సందర్భంగా ప్రజాస్వామ్యవాదులు సంతోషించదగ్గ కొన్ని సానుకూల పరిణామాలతో పాటు కొందరు నాయకుల ఆటవిక పదజాల రూపంలో కొన్ని ప్రతికూలతలు కూడా చోటు చేసుకున్నాయి. అయితే, ఈ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరగడం, పోలింగ్ ప్రక్రియలో యువతరం ఉత్సాహంగా పాలుపంచుకోవడం ముఖ్యమైన సానుకూల అంశాలుగా చెప్పుకోవచ్చు. దేశంలో సానుకూల మార్పునకు దోహదంచేసే తమ ఓటు విలువను గ్రహించిన చాలామంది ఓటర్లు తమ ఇళ్లల్లోంచి బయటకు వచ్చి పోలింగ్‌లో పాల్గొన్నారు.
 
నేడు 11 రాష్ట్రాల్లోని 117 స్థానాల్లో ఎన్నికలు
మొత్తమ్మీద ఈ ఆరో విడత ఎన్నికల్లో తమిళనాడులో జయలలితకు విజయావకాశాలు ఎక్కువగా ఉండగా, పశ్చిమబెంగాల్‌లో మమతా బెనర్జీ అత్యధిక స్థానాలు గెలుచుకోవచ్చు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్‌లలో బీజేపీ ఆధిపత్యం కనిపిస్తోంది. మహారాష్ట్రలోనూ కాంగ్రెస్- ఎన్సీపీ కూటమి కన్నా బీజేపీ- శివసేన కూటమి బలంగా కనిపిస్తోంది. ఉత్తరప్రదేశ్, బీహార్‌లలో కుల రాజకీయాల ప్రభావంతో ప్రాంతీయ పార్టీల హవానే కొనసాగనుంది. కేవలం అస్సాంలో మాత్రమే కాంగ్రెస్‌కు మెజారిటీ స్థానాలు లభించవచ్చు.
 
ఏయే రాష్ట్రాల్లో...
అస్సాం, బీహార్, ఛత్తీస్‌గఢ్, జమ్మూకాశ్మీర్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్. వీటితోపాటు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో కూడా ఎన్నికలు జరగనున్నాయి.
 
2009లో ఎవరికెన్ని
2009 ఎన్నికల్లో ఈ 117 సీట్లలో కాంగ్రెస్ 36, కాంగ్రెస్ మిత్రపక్షాలు 7, బీజేపీ 26, ఆ పార్టీ మిత్రపక్షాలు 4 స్థానాల్లోనూ గెలుపొందాయి. ఏఐఏడీఎంకే 9, ఎస్పీ 4, వామపక్షాలు 3 సీట్లను గెలుచుకున్నాయి. మిగతా 27 సీట్లను ఇతర ప్రాంతీయ పార్టీలు, స్వతంత్రులకు దక్కాయి.

ఓట్లశాతం ఇలా
గత ఎన్నికల్లో యూపీఏ,ఎన్డీఏలు కలిసి 62 శాతం ఓట్లను సాధించగా, ఇతర జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు, స్వతంత్రులు కలిసి 38% ఓట్లను గెలుచుకున్నాయి. ప్రస్తుత ఎన్నికల్లో యూపీఏ కోల్పోనున్న స్థానాలను బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ గెలుచుకుంటుందా? లేక తృతీయ కూటమి పార్టీలు గెలుచుకుంటాయా? అన్నది ఆసక్తికరంగా మారింది.
 
రాజస్థాన్

ఉత్తర రాజస్థాన్‌లోని ఐదు సీట్లలో పోలింగ్ జరుగుతుంది. అవి అల్వార్, భరత్‌పూర్, కరౌలీ ధోల్‌పూర్, దౌసా, టోంక్‌సవాయి మధోపూర్ నియోజకవర్గాలు. దౌసా స్థానాన్ని ఎస్టీలకు, కరౌలీ ధోల్‌పూర్, భరత్‌పూర్ స్థానాలను ఎస్సీలకు రిజర్వ్ చేశారు. 2009 ఎన్నికల్లో ఈ ఐదు సీట్లలో నాలుగింటిని కాంగ్రెస్ గెలుచుకుంది. మరో సీటును ఇండిపెండెంట్ అభ్యర్థి దక్కించుకున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ అధిక సీట్లను గెలుచుకుంటుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. నేడు పోలింగ్ జరిగే మధ్యప్రదేశ్, రాజస్థాన్ సీట్లలో 10కి పైగా సీట్లు గెలుచుకోవాలన్న లక్ష్యంతో బీజేపీ ఉంది.
 
 మధ్యప్రదేశ్
 ఈ విడత మధ్యప్రదేశ్‌లో పోలింగ్ జరిగే 10 స్థానాల్లో 5 మాల్వా ప్రాంతంలో, 4 మాల్వా గిరిజన ప్రాంతంలో, ఒకటి మహాకోసల్ ప్రాంతంలో ఉన్నాయి. దేవాస్, ఉజ్జయిని స్థానాలను ఎస్సీలకు, రట్లం, ధార్, ఖర్గోన్, బెతూల్ సీట్లను ఎస్టీలకు రిజర్వ్ చేశారు. దేవాస్, ఉజ్జయిని, ఖాండ్వా నియోజకవర్గాల్లో 10 శాతానికి పైగా ముస్లిం ఓటర్లున్నారు. 2009 ఎన్నికల్లో ఈ స్థానాల్లో 6 సీట్లలో కాంగ్రెస్ విజయం సాధించగా, మిగతా స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. మోడీ ప్రభావం, ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ ఇమేజ్‌తో ఈ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను గెలుచుకోగలమన్న విశ్వాసంతో బీజేపీ ఉంది.
 
బీహార్
బీహార్ ఉత్తర ప్రాంతంలోని 6 నియోజకవర్గాలు, మిథిలా ప్రాంతంలోని ఒక నియోజకవర్గంలో నేడు పోలింగ్ జరుగుతుంది. 2009 లో వీటిలో బీజేపీ 4 స్థానాల్లో విజయం సాధించగా.. కిషన్‌గంజ్‌లో కాంగ్రెస్, సుపాల్‌లో జేడీయూ గెలిచాయి. బంకాలో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. కిషన్‌గంజ్ స్థానంలో 40 శాతానికి పైగా ముస్లిం ఓటర్లున్నారు. అరారియా, కటిహార్, పూర్నియా నియోజకవర్గాల్లో 20 శాతానికి పైగా ముస్లిం ఓటర్లున్నారు. బీజేపీ అభ్యర్థులను ఓడించేందుకు, ముస్లిం ఓట్లు చీలకుండా ఉండేలా లౌకికవాద పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఇది బీజేపీని కొంత ఆందోళనపరిచేదే అయినా, మోడీ ప్రభావంపై బీజేపీ ఆశలు పెట్టుకుంది.
 
మహారాష్ట్ర
బీజేపీ బలంగా ఉన్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ముఖ్యమైనవి. మహారాష్ట్రలో గురువారం 19 సీట్లలో పోలింగ్ జరుగుతుంది. వీటిలో మరాఠ్వాడా ప్రాంతంలో 2, ఉత్తర మహారాష్ట్రలో 6, ముంబై- ఠాణెలో 10, కొంకణ్ ప్రాంతంలో ఒకటి ఉన్నాయి. వీటిలో 20 శాతానికి పైగా ముస్లింలున్న సీట్లు 4, 10% పైగా ముస్లింలు న్న స్థానాలు ఐదు ఉన్నాయి. 2009లో వీటిలో కాంగ్రెస్ 7, ఆ పార్టీ మిత్రపక్షం ఎన్సీపీ 3, బీజేపీ 5, శివసేన 3 స్థానాల్లో  గెలుపొందాయి. స్వతంత్ర అభ్యర్థి ఒక స్థానంలో గెలిచారు. ఈ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకత కారణంగా యూపీఏ కోల్పోయే స్థానాలను ఎన్డీఏ కైవసం చేసుకోవచ్చని భావిస్తున్నారు.
 
తమిళనాడు
వింధ్య పర్వతాలకు దక్షిణాన ఉన్న తమిళనాడులో ఆరో విడతలో భాగంగా ఒకే దశలో మొత్తం 39 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది.  తమిళ రాజకీయాల హవా నడిచే కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి లోని ఒక స్థానానికి కూడా అదేరోజు పోలింగ్ జరగనుంది. 2009 సార్వత్రిక ఎన్నికల్లో డీఎంకే హవానే కొనసాగింది. డీఎంకే కూటమి ఆ ఎన్నికల్లో 27 స్థానాల్లో(డీఎంకే 18, కాంగ్రెస్ 8, వీసీకే 1) విజయం సాధించగా.. జయలలిత నేతృత్వంలోని ఏఐఏడీఎంకే కూటమి 12(ఏఐఏడీఎంకే 9, సీపీఐ 1, సీపీఎం 1, ఎండీఎంకే 1) స్థానాల్లో గెలుపొందింది. 2004 ఎన్నికలతో పోలిస్తే డీఎంకే ఓటుశాతం పెరగనప్పటికీ అప్పటికన్నా రెండుసీట్లను అదనంగా గెలవగలిగింది. 2009లో పొత్తులు, సీట్ల పంపకం ఏఐఏడీఎంకేకు  సరైన ఫలితాలనివ్వలేదు.బీజేపీ ఒంటరిగా పోటీ చేసి ఒక్క స్థానంలోనూ గెలుపొందలేకపోయింది.

అయితే, ప్రస్తుత ఎన్నికల్లో రాష్ట్రంలోనూ, దేశంలోనూ పరిస్థితులు బాగా మారిపోయాయి. కొత్త రాజకీయ సమీకరణాలు రూపుదిద్దుకున్నారుు. 2012లో డీఎంకే, కాంగ్రెస్ వుధ్య బంధం తెగిపోరుుంది. ఈ ఎన్నికల్లో వీసీకే, ఐయూఎంఎల్, ఎంఎంకే, పీటీ మొదలైన చిన్న చిన్న ప్రాంతీయ పార్టీలతో కలిసి డీఎంకే పోటీకి దిగింది. గత ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసిన బీజేపీ మాత్రం ఈసారి సినీస్టార్ విజయకాంత్ నేతృత్వంలోని డీఎండీకే, వైగో నాయుకత్వంలోని ఎండీఎంకే, డాక్టర్ ఎస్.రామ్‌దాస్‌కు చెందిన పీఎంకే సహా ఐజేకే, కేఎండీకేలతో పొత్తు పెట్టుకుని ఆరు పార్టీల కూటమిగా బరిలో నిలిచింది. మొదట వామపక్షాలతో పొత్తు పెట్టుకుని ఆ తర్వాత వాటితో పొత్తు వద్దనుకున్న ఏఐఏడీఎంకే  వూదిరిగానే కాంగ్రెస్ కూడా ఈ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తోంది. దాంతో గత ఎన్నికల మాదిరిగా ద్విముఖ పోటీ కాకుండా అనేక స్థానాల్లో ప్రస్తుతం బహుముఖ పోటీనెలకొని ఉంది.
 
అయితే ఈ కొత్త పొత్తుల కారణంగా ఓట్లశాతంలో ఎలాంటి మార్పులు రానున్నాయన్నది విశ్లేషించాల్సి ఉంది. 2009 ఎన్నికల ఓటుశాతం ఆధారంగా అంచనా వేస్తే.. ప్రస్తుత డీఎంకే కూటమికి 29%( డీఎంకే 25%, వీసీకే 2%, ఇతరులు 2%).. ప్రస్తుత బీజేపీ కూటమికి 24 శాతం(బీజేపీ 2%, డీఎండీకే 10%, ఎండీఎంకే 4%, పీఎంకే 6%, ఇతరులు 2%).. కాంగ్రెస్ 15%, ఏఐఏడీఎంకే 23% ఓట్లు ఉన్నాయి. గత ఎన్నికల్లో ఆయా పార్టీలకు లభించిన ఓట్లే ఈ సారి కూడా లభిస్తాయనుకుంటే డీఎంకే కూటమి అత్యధిక స్థానాలను, కాంగ్రెస్ అతి తక్కువ స్థానాలను గెలుచుకుంటాయి. బీజేపీ కూటమి, ఏఐఏడీఎంకేలు సమాన స్థాయిలో సీట్లను సాధించగలవు. అయితే, ఇది జరగడం దాదాపు అసాధ్యమనే చెప్పవచ్చు.
 
  అందుకు రెండు కారణాలను ప్రధానంగా పేర్కొనవచ్చు. అవి ఒకటి.. కాంగ్రెస్, డీఎంకేలు ప్రభుత్వ వ్యతిరేకతను తీవ్రంగా ఎదుర్కొంటున్నాయి. అందులోనూ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, కరుణానిధి కుమారుడు అళగిరి తిరుగుబాటు నేపథ్యంలో డీఎంకేకు కలిగే నష్టం మరింత ఎక్కువగా ఉంటుంది. ఇవి కోల్పోయే ఓట్లు ఏఐఏడీఎంకే వైపు వెళ్లే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. బయటకు బలంగా కనిపిస్తున్న బీజేపీ కూటమిలోని లుకలుకలు అందుకు రెండో కారణంగా చెప్పవచ్చు. కూటమిలోని పార్టీల మధ్య సయోధ్య లేకపోవడం, అందులోని రెండు ప్రధాన పక్షాల నేతలు పరస్పరం శత్రువులుగా వ్యవహరిస్తుండడం స్పష్టంగా కనిపిస్తోంది.
 
 దాంతో క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలిస్తే.. డీఎంకే, కాంగ్రెస్‌ల వ్యతిరేక ఓటును బీజేపీ కూటమి ఆకర్షించలేకపోవచ్చు. జమ్మూకాశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పిస్తున్న రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని తొలగిస్తామంటున్న బీజేపీ హామీని మిత్రపక్షం పీఎంకే సమర్థించడం లేదు. తిరువళ్లూరు, కాంచీపూరం, విల్లుపురం, నీలగిరి, చిదంబరం, నాగపట్టణం, తెంకాశి  స్థానాలు ఎస్సీలకు రిజర్వ్ అయ్యాయి. ఇవి కాకుండా మరో 9 నియోజకవర్గాల్లో ఎస్సీల జనాభా 20% పైగా ఉంది. దాంతో రెండు దళిత పార్టీలతో పొత్తు పెట్టుకున్న డీఎంకే ఈ స్థానాలపై ఆశలు పెట్టుకుంది. కావేరీ జల సమస్యను పరిష్కరిస్తామని, గుజరాత్ మోడల్‌లో తమిళనాడును అభివృద్ధి చేస్తామంటున్న మోడీ ప్రభావంపైనే బీజేపీ ఆశలు పెట్టుకుంది.
 
 మోడీ హవాతోనే డీఎంకే, ఏఐఏడీఎంకేలను ఎదుర్కోవాలని బీజేపీ భావిస్తుండగా.. ఆ పార్టీ మిత్రపక్షాలైన డీఎండీకే, ఎండీఎంకే, పీఎంకేలు సైతం మోడీ హవాపైనే నమ్మకం పెట్టుకున్నాయి.మొత్తంమీద ఎన్నికల ప్రచారంలో అందరికన్నా ముందంజలో ఐఏఐడీఎంకే అధినేత్రి, ముఖ్యమంత్రి జయలలిత ఉన్నారు. ఆమె సభలకు, ర్యాలీలకు ప్రజలు భారీగా హాజరవుతున్నారు. యూపీఏ ప్రభుత్వ వైఫల్యాలను, అవినీతి కుంభకోణాలను, శ్రీలంక తమిళల సమస్యను పరిష్కరించడంలో యూపీఏ మిత్రపక్షం డీఎంకే వైఫల్యాన్ని సందర్భానుసారంగా ఆమె ఎండగడుతున్నారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలపై కూడా జయలలిత ఆధారపడుతున్నారు.
 
 తాము ఉచితంగా ఇచ్చిన మిక్సీ -
గ్రైండర్లు, ఫ్యాన్లు, సబ్సిడీకి భోజనం అందించే ‘అమ్మ’ ఆహార కేంద్రాలు తదితరాలను ప్రచారంలో ఉపయోగించుకుంటున్నారు.
 తమిళనాడులో ఆసక్తి కలిగిస్తున్న స్థానాల్లో శివగంగ (కాంగ్రెస్ తరఫున కేంద్ర మంత్రి పి.చిదంబరం కొడుకు కార్తి  పోటీ చేస్తున్నారు), ధర్మపురి(పీఎంకే వ్యవస్థాపకుడు డాక్టర్ ఎస్ రామ్‌దాస్ కుమారుడు, కేంద్ర మాజీ ఆరోగ్యమంత్రి అంబుమణి రామ్‌దాస్ పోటీ చేస్తున్నారు), దక్షిణ చెన్నై (అసెంబ్లీ మాజీ స్పీకర్ జయకుమార్ కుమారుడు జయవర్ధన్, ఏఐఏడీఎంకే), తూత్తుకుడి (పి.జగన్, డీఎంకే), ఉత్తర చెన్నై (ఆర్ గిరిరాజన్, డీఎంకే) ఉన్నాయి. వాటితోపాటు ‘ఆప్’ టికెట్‌పై కూడంకుళం అణు విద్యుత్ కేంద్రానికి వ్యతిరేకంగా ఉద్యమించిన ఉదయకుమార్ బరిలో ఉన్న కన్యాకుమారి స్థానంపై కూడా అందరి దృష్టి ఉంది.
 
 ఉత్తరప్రదేశ్
ఈ విడతలో ఉత్తరప్రదేశ్‌లోని 12 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో దోయుబ్(గంగా, యువుున నదుల వుధ్య ప్రాంతం) ప్రాంతంలో 11, అవధ్‌లో ఒకటి ఉన్నాయి. 7 నియోజకవర్గాల్లో 20 శాతానికి పైగా ముస్లింలున్నారు. హత్రాస్, ఆగ్రా, హర్దోయి, ఇటావా సీట్లు దళితులకు రిజర్వ్ అయ్యాయి. ఈ మొత్తం 12 నియోజకవర్గాల్లో 2009 ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ 5, కాంగ్రెస్, ఆరెల్డీలు రెండేసి సీట్లను గెలుచుకోగా.. బీజేపీ, బీఎస్పీ, స్వతంత్ర అభ్యర్థి ఒక్కో స్థానంలో విజయం సాధించారు. ములాయం ప్రాతినిధ్యం వహిస్తున్న మెయిన్‌పురి నియోజకవర్గం ఎస్పీకి పట్టుగొమ్మలాంటిది. మెయిన్‌పురితో పాటు కనౌజ్,ఎటా, ఫిరోజాబాద్ స్థానాల్లో యాదవులు, ముస్లింల జనాభా అధికంగా ఉంది. గత రెండు దశాబ్దాలుగా ఈ ముస్లిం- యాదవ్ ఓట్లు ఎస్పీకే పడేవి. అయితే ముజఫర్‌నగర్ మత కలహాలను ఎస్పీ ప్రభుత్వం సమర్ధంగా అదుపుచేయులేకపోవడంతో ముస్లింలు ఎస్పీకి దూరమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇది గ్రహించే ములాయం మెయిన్‌పురితో పాటు ఆజంగఢ్ నుంచి కూడా పోటీ చేస్తున్నారన్న వాదన ఉంది. ఎస్పీకి దూరమైన ముస్లిం ఓట్లపై బీఎస్పీ ఆశలు పెట్టుకుంది.
 
 జార్ఖండ్
 ఈ విడత జార్ఖండ్‌లో 4 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. వాటిలో మూడు సంతాల్ పరగణా, ఒకటి ఉత్తర జార్ఖండ్‌లోనివి. రాజ్‌మహల్, దుంకా స్థానాలను ఎస్టీలకు రిజర్వ్ చేశారు. వాటిలో రాజ్‌మహల్ నియోజకవర్గంలో 20 శాతంపైగా ముస్లిం ఓటర్లున్నారు. 2009 ఎన్నికల్లో వీటిలో మూడు స్థానాలను బీజేపీ, ఒక స్థానాన్ని జేఎంఎం గెలుచుకున్నాయి. జేఎంఎం నేత శిబూ సొరేన్ దుంకా  నుంచి ఆరు సార్లు గెలుపొందారు. కానీ ఈసారి గెలుపు కోసం ఆయన తీవ్రంగా కృషి చేయాల్సి వస్తోంది.
 
జమ్మూ,కాశ్మీర్
ఆరో విడతలో జమ్మూకాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ నియోజకవర్గంలో పోలింగ్ జరగనుంది. 2009 ఎన్నికల్లో ఈ స్థానం నుంచి నేషనల్ కాన్ఫరెన్స్ అభ్యర్థి మీర్జా మెహబూబ్ బేగ్ గెలుపొందారు. ఇక్కడ 16 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండటం విశేషం. ప్రస్తుత ఎన్నికల్లో ఈ స్థానం నుంచి పీడీపీ తరఫున మెహబూబా ముఫ్తీ, నేషనల్ కాన్ఫెరెన్స్ తరఫున సిటింగ్ ఎంపీ  బేగ్ బరిలో ఉన్నారు. బీజేపీ టికెట్‌పై ముస్తాఖ్ అహ్మద్ మాలిక్ పోటీ చేస్తున్నారు. సిటింగ్ ఎంపీపై ఉన్న వ్యతిరేకతే తనను గెలిపిస్తుందన్న విశ్వాసంతో ముఫ్తీ ఉన్నారు.
 
 అస్సాం
అస్సాంలో ప్రాంతీయ రాజకీయ పార్టీలైన అస్సాం గణపరిషత్(ఏజీపీ), బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్(బీడీఎఫ్), అస్సాం యునెటైడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్(ఏయూడీఎఫ్)ల ప్రాబల్యం బలంగా ఉంది. రాష్ట్రంలో మస్లింల జనాభా కూడా ఎక్కువే. ఇక్కడ 31%పైగా ముస్లింలున్నారు. 9 స్థానాల్లో అభ్యర్ధుల విజయావకాశాలను వారు ప్రభావితం చేయగలరు.
 
నేడు 6 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతుంది. అవి ధుబ్రి, కోక్రాఝర్, బార్పేటా, గువాహటి, మంగల్దోయి, నగావ్. వీటిలో కోక్రాఝర్ స్థానాన్ని ఎస్సీలకు రిజర్‌‌వ చేయగా, మిగతాయన్నీ జనరల్ సీట్లు. నగావ్ మినహా అన్ని స్థానాలు దిగువ అస్సాంలోనే ఉన్నాయి. గత ఎన్నికల్లో బీజేపీ గెలుచుకున్న నాలుగు స్థానాల్లో రెండు ఈ ప్రాంతంలోనివే కావడం విశేషం. మిగతా మూడింటిని ఏజీపీ, బీడీఎఫ్, ఏయూడీఎఫ్‌లు పంచుకున్నాయి. గత ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్న ఏజీపీ ఈ సారి ఒంటరిగానే బరిలో దిగింది. బీజేపీ మాత్రం 11 ప్రాంతీయ పార్టీల సమాఖ్య అయిన ‘నార్త్ ఈస్ట్ రీజనల్ పార్టీస్ ఫోరమ్’తో పొత్తు పెట్టుకుంది. కేంద్రంలో కాంగ్రెస్‌కు మిత్రపక్షమైన ఏయూడీఎఫ్ బీజేపీని ఓడించే లక్ష్యంతో అస్సాంలో మాత్రం ఒంటరిగానే పోటీ చేస్తోంది.
 
 ఛత్తీస్‌గఢ్

 బీజేపీ సానుకూల ప్రభావం ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్. ఈ రాష్ట్రాల్లో 2009లో గెలుచుకున్న స్థానాలను నిలబెట్టుకోవడంతో పాటు మరికొన్ని సీట్లను గెలుచుకోగలమని బీజేపీ భావిస్తోంది. ఛత్తీస్‌గఢ్‌లోని ఉత్తర, మధ్య ప్రాంతాల్లో ఉన్న 7 సీట్లలో గురువారం పోలింగ్ జరుగుతుంది. వీటిలో సర్గూజ, రాయ్‌గఢ్ స్థానాలను ఎస్టీలకు, జాంజ్‌గీర్-చాంపా స్థానం ఎస్సీలకు రిజర్వ్ చేశారు. వీటిలో 2009 ఎన్నికల్లో బీజేపీ ఆరు సీట్లను గెలుచుకోగా, కోర్బా స్థానంలో కాంగ్రెస్ విజయుం సాధించింది.
 
పశ్చిమబెంగాల్
ఈ రాష్ట్రంలో 6 సీట్లక్లు ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో రాయ్‌గంజ్, మాల్దా ఉత్తర్, మాల్దా దక్షిణ్, జంగీపూర్, ముర్షిదాబాద్ నియోజకవర్గాల్లో 40% పైగా, బలూర్‌ఘాట్‌లో 20%పైగా ముస్లిం ఓటర్లున్నారు. 2009 ఎన్నికల్లో వీటిలో 5 స్థానాల్లో కాంగ్రెస్, ఒక స్థానంలో ఆరెస్పీ విజయం సాధించాయి. ఈ ఎన్నికల్లో మాత్రం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్‌కాంగ్రెస్ అత్యధిక స్థానాలు గెలుచుకునే అవకాశం కనిపిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement