పరిటాల కోటలో వైఎస్ జగన్కు బ్రహ్మరథం
అనంతపురం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అనంతపురం జిల్లాలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం లభించింది. పరిటాల రవి ఒకప్పుడు ప్రాతినిధ్యం వహించిన పెనుకొండ, ఆయన భార్య సునీత ప్రాతినిధ్యం వహిస్తున్న రాప్తాడు నియోజకవర్గాల్లో వైఎస్ జగన్కు బ్రహ్మరథం పట్టారు. బుధవారం జరిగిన సభలకు ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు. కనగానపల్లి, తగరకుంట, పెనుకొండలో జగన్ రోడ్ షో నిర్వహించారు.
తాజా ఎన్నికల్లో రాప్తాడు నుంచి టీడీపీ తరపున సునీత పోటీచేస్తుండగా, వైసీపీ అభ్యర్తిగా తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి బరిలో నిలిచారు. ఇక పీసీసీ అధ్యక్షుడు ఎన్ రఘువీరా రెడ్డి కళ్యాణదుర్గం నుంచి పెనుకొండకు మారారు. వైసీపీ తరపున శంకర నారాయణ పోటీ చేస్తున్నారు. టీడీపీ కంచుకోటలుగా ఉన్న ఈ నియోజకవర్గాల్లో జగన్ సభలకు విశేష స్పందన రావడంతో వైసీపీ శ్రేణుల్లో ధీమా మరింత పెరిగింది.
రోజుకో హామీ ఇస్తున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తన హయాంలో ఎందుకు చేయలేకపోయారని జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు ఏ రోజైనా మంచి పని చేశారా అని విమర్శించారు. ఆయన పాలనలో రైతులు, ఉద్యోగులు, అన్ని వర్గాలు ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారని జగన్ అన్నారు. చంద్రబాబు తన పాలనలో మద్యపాన నిషేధం తొలగించారని, రెండు రూపాయిల కిలో బియ్యం పథకానికి తూట్లు పొడిచారని విమర్శించారు. చంద్రబాబు ఎన్నికల ప్రచారినికి వస్తే ఈ అంశాలను నిలదీయాలని సూచించారు. జగన్ ప్రసంగానికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది.