* తొలి విడత ప్రచారం పూర్తిచేసిన జగన్, విజయమ్మ, షర్మిల
* 12న పార్టీ మేనిఫెస్టో విడుదల.. అదేరోజు మలిదశ ప్రచారం షురూ
* 13 నుంచి ప్రచారంలో పాల్గొననున్న జగన్‌మోహన్‌రెడ్డి
* అన్ని నియోజకవర్గాలకు వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక దాదాపు పూర్తి
* పొత్తులు, సీట్ల సర్దుబాటు గొడవలో కొట్టమిట్టాడుతున్న టీడీపీ
* బీజేపీతో పొత్తు నేపథ్యంలో పార్టీ నేతల్లో అసమ్మతిపై చంద్రబాబు ఆందోళన
* గర్జనలు మినహా ఇప్పటివరకు సరిగ్గా ప్రచారమే నిర్వహించని టీడీపీ అధినేత
* ప్రచార సారథి లేక, అభ్యర్థులే దొరక్క అయోమయంలో కాంగ్రెస్
సాక్షి, హైదరాబాద్: సీమాంధ్రలో సార్వత్రిక ఎన్నికల నామినేష్లన ఘట్టానికి శనివారం తెరలేవనుంది. ఈ ప్రాంతంలోని 175 శాసనసభ, 25 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనుండటంతో పలు పార్టీలు అభ్యర్థుల ఎంపిక కసరత్తులో తలమునకలుగా ఉన్నారుు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇప్పటికే తొలిదశ ప్రచారం పూర్తిచేసి ముందంజలో ఉంది. పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, జగన్ సోదరి షర్మిల ఇప్పటికే ఒకసారి సీమాంధ్ర ప్రాంతాన్ని చుట్టివచ్చారు. మలిదశ ప్రచారాన్ని ఈ నెల 12న నోటిఫికే షన్ విడుదలయ్యే రోజునుంచీ ప్రారంభించేందుకు షెడ్యూలు ఖరారైంది. 12వ తేదీనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల కానుంది.
13 నుంచీ జగన్ ప్రచారంలో పాల్గొంటారు. ఇక అభ్యర్థుల ఎంపికను కూడా పార్టీ దాదాపు పూర్తి చేసింది. పలు బహిరంగ సభల సందర్భంగా జగన్‌మోహన్‌రెడ్డి కొందరు అభ్యర్థులను ప్రకటించారు. అరుుతే మిగిలిన పార్టీలు మాత్రం ఈ విషయంలో అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాయి. బీజేపీతో పొత్తులో భాగంగా ఏఏ నియోజకవర్గాలు ఆ పార్టీకి కేటాయించాలో తుది నిర్ణయానికి రాలేక టీడీపీ తలపట్టుకుంది. మరోవైపు కాంగ్రెస్ నుంచి చేరిన నేతలకు టికెట్లు ప్రకటించే దశలో వెల్లువెత్తే అసమ్మతిని ఎలా ఎదుర్కోవాలో తెలియక సతమతమవుతోంది. ఇక కాంగ్రెస్ పార్టీని అభ్యర్థుల కొరత వేధిస్తోంది. ఆ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కొత్త పార్టీ పెట్టుకోగా, మిగిలిన వారిలో చాలామంది నేతలు ఇతర పార్టీల్లో చేరిపోయారు.
ఈ పరిస్థితుల్లో చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థులు దొరక్క ఆ పార్టీ నేతలు ఇబ్బంది పడుతున్నారు. బీజేపీ విషయూనికొస్తే టీడీపీతో పొత్తు విషయంలో ఒక అవగాహనకు వచ్చినప్పటికీ కోరిన స్థానాలు దక్కక నేతలు ఎటూ తేల్చుకోలేని ఇరకాటంలో కొట్టుమిట్టాడుతున్నారు. బీజేపీకి కేటాయించిన నియోజకవర్గాల్లో టీడీపీ స్థానిక నేతల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతుండటం, మరోవైపు కేటాయించిన సీట్లను మార్చాలని బీజేపీ పట్టుబడుతుండటంతో ఇరు పార్టీల మధ్య ఒకరకంగా ప్రతిష్టంభన నెలకొంది. చంద్రబాబు సీమాంధ్ర ప్రాంతంలోని కొన్ని జిల్లా కేంద్రాల్లో ప్రజాగర్జనల పేరుతో సభలు నిర్వహించినాప్రచారానికి ఇంకా శ్రీకారం చుట్టలేదు.
గర్జనలు మినహాయిస్తే గత నెల 5వ తేదీన ఎన్నికల షెడ్యూలు వెలువడినప్పటి నుంచి ఆయన హైదరాబాద్‌కే పరిమితమయ్యారు. తెలంగాణ పార్టీలో భగ్గుమన్న అసంతృప్తి, రెబెల్స్ గొడవలతోనే తలపట్టుక్కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో ఎలాంటి వివాదాలు లేని 47 అసెంబ్లీ స్థానాలకు మాత్రం అభ్యర్థులను ఖరారు చేశారు. అయితే ఇప్పటికీ పలు నియోజకవర్గాల్లో సరైన అభ్యర్థులు దొరక్క కొత్తవారిని చేర్పించుకునే ప్రయత్నాల్లోనే చంద్రబాబు సన్నిహిత పారిశ్రామికవేత్తలు నిమగ్నమై ఉన్నారు.
ప్రచారంలో కాంగ్రెస్, టీడీపీ వెనుకంజ
ప్రచారంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉండగా, కాంగ్రెస్, టీడీపీలు చాలా వెనుకబడ్డాయి. తమ శక్తినంతా ఉపయోగించి ప్రజలను సమీకరించడం ద్వారా అడపదడపా గర్జనలు నిర్వహించిన చంద్రబాబుకు అసలైన ఎన్నికల ప్రచారం మాత్రం ఒక సవాలుగా మారిందని పార్టీవర్గాలు చెబుతున్నాయి.
నామినేషన్ల పర్వం ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించిన తర్వాతే ప్రచారంలో పాల్గొనాలని పలు జిల్లాల నేతలు కోరుతున్నట్టు తెలిసింది. అరుుతే అలా అభ్యర్థులను ప్రకటించిన తర్వాత ప్రచారం చేపడితే తీవ్రస్థాయి నిరసనలు వ్యక్తమయ్యే అవకాశాలున్నాయని, తొలివిడత ఎన్నికలు జరుగుతున్న తెలంగాణ పార్టీలో ఇప్పటికే అగ్గిరాజుకుందని సీనియర్లు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో అలాంటి సమస్యలు ఎదురయ్యే నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించకుండా జాప్యం చేసి, అక్కడ ముందుగానే ప్రచారం పూర్తి చేయడం వంటి అంశాలను ఇప్పుడు చంద్రబాబు పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక కాంగ్రెస్ విషయానికొస్తే గతంలో పార్టీని ఏకతాటిపై నడిపించి ఒంటిచేత్తో గెలిపించిన వైఎస్ రాజశేఖరరెడ్డి లాంటి నేత ఇప్పుడు ఆ పార్టీకి కరువయ్యారు.
కాంగ్రెస్ పార్టీకి మేమందరం ఉన్నామని చెబుతున్న కొందరు నేతలు ఎన్నికల్లో పోటీ చేసేందుకు మాత్రం వెనుకంజ వేస్తుండటం గమనార్హం. గురువారం ఏపీసీసీ ఎన్నికల కమిటీ భేటీ అయి అభ్యర్థుల ఎంపికపై సుదీర్ఘంగా సమాలోచనలు జరిపింది. పార్టీకి అందిన దరఖాస్తుల్లో అత్యధికం కొత్తవారి నుంచే ఉండటం గమనార్హం. ఏదోవిధంగా ఒకటీ, రెండురోజుల్లో అభ్యర్థులను ఖరారు చేసినా ఎన్నికల ప్రచారానికే సరైన నాయకత్వం కనిపించడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. చిరంజీవి సినీగ్లామర్ పనిచేస్తుందని ముందు అనుకున్నా ఇటీవల బస్సుయాత్రలో అదేమీ లేదని తేలిపోయిందని ఆ పార్టీ నేతలే అంటున్నారు.