రసవత్తరం.. జెడ్పీ జంగ్
సాక్షిప్రతినిధి, నల్లగొండ,జిల్లా పరిషత్ ఎన్నికలు ఆసక్తి గొల్పుతున్నాయి. ప్రధాన రాజకీయ పార్టీలు అత్యధిక జెడ్పీటీసీ స్థానాలను గెలుచుకునే పనిలో పడ్డాయి. కాంగ్రెస్ పార్టీలో జెడ్పీ రాజకీయం కొత్త సమీకరణలకు తెర లేపుతోంది. మాజీ మంత్రి కె.జానారెడ్డి ఈసారి కూడా జెడ్పీ పీఠంపై తనకు కావాల్సిన వ్యక్తినే కూర్చోబెట్టే పనిలో పడ్డారు. జెడ్పీటీసీ స్థానాలకు అభ్యర్థులను బరిలోకి దింపే దశ నుంచే కాంగ్రెస్ ఆచితూచి అడుగేసింది. సార్వత్రిక ఎన్నికల్లో అసెంబ్లీ నియోజకవర్గాల్లో టికెట్ల కేటాయింపు, పొత్తులను ముందే పరిగణనలోకి తీసుకుని ముందస్తు వ్యూహంతో ముందుకు వెళ్లింది.
కాంగ్రెస్, సీపీఐల మధ్య ఎన్నికల పొత్తుకు అవకాశాలు ఎక్కువగా ఉండడాన్ని కీలకంగానే భావించారు. దీనిలో భాగంగానే దేవరకొండ ఎమ్మెల్యే బాలూనాయక్‌ను జెడ్పీ బరిలోకి దింపారు. ఆయన చందంపేట జెడ్పీటీసీ స్థానం నుంచి పోటీలో ఉన్నారు. వాస్తవానికి ముందు నుంచీ ఈసారి బాలూనాయక్‌కు అసెంబ్లీ టికెట్ ఇవ్వరన్న ప్రచారం జోరుగా జరగడంతో ఆయన కూడా ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తోంది. అయితే, ఎన్నికల పొత్తులో భాగంగా సీపీఐ బలంగా కోరే అసెంబ్లీ స్థానాల్లో దేవరకొండ ఒకటి కావడంతో, ఈసారి కూడా కచ్చింతా ఈ సీటును అడుగుతారని భావించారు. పొత్తు లేని పక్షంలో సిట్టింగ్ ఎమ్మెల్యేకే అవకాశం దక్కే వీలున్నా, ఒకవేళ పొత్తు ఖరారు అయితే మాత్రం ఏమీ చేయలేమని, వారు కోరే దేవ రకొండను వదులు కోవాల్సి వస్తుందని బాలూనాయక్‌కు కొందరు సూచించినట్లు చెబుతున్నారు.
దీంతో ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొనే ఎమ్మెల్యే బాలూ జెడ్పీ పోటీలో ఉన్నట్లు చెబుతున్నారు. మరోైవె పు దేవరకొండ కాంగ్రెస్ టికెట్ కోసం దరఖాస్తు చేసిన మాజీ ఎమ్మెల్యే రాగ్యానాయక్ తనయుడు స్కైలాబ్‌నాయక్ దామరచర్ల జెడ్పీటీసీ స్థానానికి, జెడ్పీ మాజీ ఫ్లోర్ లీడర్ లచ్చిరాం నాయక్ పెద్దవూర జెడ్పీటీసీ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు.
దీంతో జెడ్పీచైర్మన్ పీఠానికి గట్టిపోటీ ఉంటుందని అంతా భావించారు. అయితే, జానారెడ్డి చొరవ తీసుకుని వారిద్దరూ తమ నామినేషన్లను ఉపసంహరింపజేసుకునేలా చక్రం తిప్పారు. ఇప్పటికే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కోదాడ, హుజూర్‌నగర్ ప్రాంతాలకు ముఖ్యమైన పదవులు ఇప్పించుకున్నారు. ఇక, మిగిలింది సూర్యాపేట ప్రాంతమే. దీంతో ముందే మేల్కొన్న జానారెడ్డి, జెడ్పీ పీఠంపై తన ముద్ర వేసేందుకు ఏకంగా ఎమ్మెల్యే బాలూనాయక్‌నే ముందు పెట్టారు.
మరోవైపు కాంగ్రెస్ తర్వాత అత్యధిక స్థానాల్లో పోటీలో ఉన్న టీఆర్‌ఎస్ స్థానిక రాజకీయం గురించి ఏ అంచనాకూ రాలేని పరిస్థితి కనిపిస్తోంది. టీడీపీ నుంచి జిల్లా అధ్యక్షుడు బిల్యానాయక్ భార్య అనిత చింతపల్లి జెడ్పీటీసీ స్థానం నుంచి బరిలో ఉంది. కానీ టీడీపీ కేవలం 48 స్థానాల్లోనే పోటీ చేసింది.
కాకుంటే ఆయా మండలాల్లో అవసరాలను బట్టి టీఆర్‌ఎస్, భారతీయ జనతా పార్టీ, సీపీఎం తదితర పార్టీలతో అవగాహన కుదుర్చుకుంది. ఒక విధంగా చెప్పాలంటే, కాంగ్రెస్ ఒక వైపు, మిగిలిన పార్టీలు ఒక వైపు ఉండి జిల్లా పరిషత్ అధ్యక్ష పదవి కోసం పోరాటం చేస్తున్నాయి.