మెగాభినేత్రి | anchor niharika special interview for her new movie debbue | Sakshi
Sakshi News home page

మెగాభినేత్రి

Published Sat, May 7 2016 11:34 PM | Last Updated on Sun, Sep 3 2017 11:37 PM

నాగబాబు, పద్మజల కూతురు నీహారిక : మెగా ఫ్యామిలీలో తొలి అభినేత్రి

నాగబాబు, పద్మజల కూతురు నీహారిక : మెగా ఫ్యామిలీలో తొలి అభినేత్రి

పుట్టినప్పుడు మూడున్నర కిలోలట! వెరీ హెల్దీ బేబీ. మెగాస్టార్... చేతుల్లోకి ఎత్తుకుంటే తదేకంగా చిరంజీవినే చూస్తూ ఉండిపోయిందట... పసి నీహారిక. ఇప్పుడు చిరంజీవి తదేకంగా చూసే సందర్భం వచ్చేసింది! మెగా కుటుంబంలో మొట్టమొదటి హీరోయిన్‌గా నీహారిక సినిమా రాబోతోంది. నీహారిక అంటే గెలాక్సీ. అంటే పాలపుంత. పద్మజకు నీహారిక ఎప్పుడూ స్టారే. మరి నీహారికకు? మమ్మీ ఈజ్ హర్ గెలాక్సీ. మదర్స్‌డే స్పెషల్

నీహారిక: నిన్ను ఇంటర్వ్యూ చేస్తానమ్మా.. నిజాలే చెప్పాలి.
పద్మజ: ఏమడుగుతావో అడుగు. అన్నీ నిజాలే చెబుతా.

నీహా: ఓకే.. రెడీయా.. ముందుగా నేను పుట్టినప్పుడు నీకెలా అనిపించిందో కొంచెం షేర్ చేసుకోవా?

పద్మజ: ఫస్ట్ అబ్బాయి (వరుణ్ తేజ్) పుట్టాడు కాబట్టి, రెండోసారి పాపే పుట్టాలని నేనూ, మీ నాన్న అనుకున్నాం. అదే జరిగింది. నువ్వు పుట్టినప్పుడు మొదలైన ఆనందం మీ నాన్నకి ఇంకా తీరలేదు. పుట్టినప్పుడు నీ వెయిట్ మూడున్నర కేజీలు. ముద్దుగా ఉండేదానివి. ‘ఈ రోజు నలుగురు పుట్టారు. అందరికన్నా మీ పాపే క్యూట్‌గా ఉంది’ అని నర్సులు అన్నారు. ఆ రోజు నువ్వెలా ఉన్నావో అలా నా మనసులో ప్రింట్ అయిపోయింది. ఇంకో విషయం చెప్పనా? ఏడో రోజు నిన్ను ఉయ్యాలలో వేసినప్పుడు మీ పెదనాన్న (చిరంజీవి) ఎత్తుకుంటే, చాలాసేపు ఆయన్నే చూస్తూ ఉండిపోయావు. మా బావగారిని నువ్వెందుకలా చూశావో అర్థం కాలేదు.

నీహా: చిన్నప్పుడు వరుణ్ అన్నయ్య, నేనూ చేసిన అల్లరి గురించి... అన్నయ్యే ఎక్కువ అల్లరి చేసేవాడు కదూ..?

పద్మజ: ఏం కాదు... నువ్వే. చిన్నప్పుడు ఇద్దరూ బాగా కొట్టుకునేవాళ్లు. పెద్దయ్యాక ప్రేమగా ఉంటున్నారు. పైగా నీ గొంతేమో పెద్దది.

నీహా: నన్నంటున్నావ్.. నీ గొంతు కూడా అంతే కదమ్మా. ఆ మాటకొస్తే మనింట్లో మన నలుగరిదీ పెద్ద గొంతే. కాకపోతే.. అన్నయ్య, నాన్న ఎక్కడ వాడాలో అక్కడ వాడతారు. మనిద్దరం మాత్రం ఏదైనా గట్టిగా మాట్లాడేస్తాం. అందుకే కదమ్మా ఇంట్లో మనిద్దరం రహస్యాలు మాట్లాడుకోవాలంటే తలుపులేసేసుకుంటాం. అవునూ.. మీ మమ్మీకీ, నా మమ్మీకి పిల్లల్ని పెంచే విషయంలో తేడా ఏంటి?

పద్మజ: మీ అమ్మమ్మ మన దగ్గరే ఉండేది. తనే నన్ను పెంచింది. నేనూ నీలానే బాగానే అల్లరి చేసేదాన్నట. అందుకే నీ అల్లరికి తట్టుకోలేక ఎప్పుడైనా తిడితే, ‘ఊరుకో. నువ్వింతకంటే ఎక్కువే అల్లరి చేశావ్’ అని మా అమ్మ అనేది. మా అప్పుడు స్కూల్స్‌లో టూర్స్, బోల్డంత మంది ఫ్రెండ్స్, కంప్యూటర్లు.. ఇలా ఏవీ ఉండేవి కాదు. స్కూలు, ఇల్లు అంతే. ఇప్పుడేమో అంతా ఫాస్ట్. టూర్స్‌కి వెళతారు. ఫ్రెండ్స్‌తో సినిమాలకెళతారు. ఎక్కడికీ వెళ్లనివ్వకుండా మిమ్మల్ని ఇంట్లో కూర్చోపెట్టుకోవడం నాకిష్టం ఉండదు. బయటకు పంపించినా, మీరిద్దరూ ఇంటికి తిరిగి వచ్చేదాకా టెన్షన్. ఆ తేడా తప్ప పెంపకం విషయంలో మా  అమ్మకీ, మీ అమ్మకీ వేరే ఏ తేడా లేదు.

నీహా: నన్నూ, అన్నయ్యని పెంచడానికి ఇబ్బంది పడ్డావా?

పద్మజ: నేనేం ఇబ్బందిలా ఫీలవ్వలేదు. మీ ఇద్దరు తప్ప నాకు వేరే ఆలోచన ఉండేది కాదు. మీరు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి నేను మీ కళ్ల ముందు ఉండాల్సిందే. ఎప్పుడైనా లేకపోతే వరుణ్ ఫోన్ చేసి, ‘నేను వస్తానని తెలుసు కదా.. ఇంట్లో ఎందుకు లేవు’ అని అరిచేసేవాడు.

నీహా: మా చిన్నప్పుడు నువ్వు మమ్మల్ని ఎవరికీ ఇచ్చేదానివి కాదట.. నువ్వే పెంచావట... అందుకే అమ్మా.. ‘ఐ కాంట్ గెట్ ఎ బెటర్ మమ్మీ. లవ్ యు లాట్’.

పద్మజ: మిమ్మల్ని వదిలి ఎక్కడికీ వెళ్లేదాన్ని కాదు. మీ ఇద్దరూ ఇంటి నుంచి బయటికెళ్లేటప్పుడు, నాకు ముద్దు పెట్టి, బై చెప్పి వెళ్లేవాళ్లు. చిన్నప్పుడు మొదలైన ఆ అలవాటు ఇప్పటికీ ఉండటం నాకు హ్యాపీగా ఉంది నీహా.

నీహా: నన్ను ఫస్ట్ డే స్కూల్‌కి పంపించినప్పుడు ఏడ్చానా?

పద్మజ: ప్రీ కేజీలో ఆ రోజు నీతో పాటు చేరిన పిల్లలం దరూ దాదాపు ఏడ్చారు. నువ్వు కూడా ఏడుస్తావేమోనని భయపడుతూ, నీవైపు చూశా. అప్పుడు నువ్వు నన్ను చూసి, ‘అమ్మా.. నువ్వెల్లిపో.. వెల్లిపో’ అని ముద్దు ముద్దుగా అన్నావు (మురిపెంగా చూస్తూ).

నీహా: నేనలా మాట్లాడిన వాటిలో నీకు బాగా గుర్తున్నవి ?

పద్మజ: చిన్నప్పుడు నువ్వేదైనా చెప్పాలంటే.. ‘చూడు.. చూడు.. అమ్మా.. చూడు.. చూడు’ అనేదానివి. ముందు ఆ మాటలు అని, ఆ తర్వాతే విషయం చెప్పేదానివి. ఇప్పటికీ నీకా అలవాటు పోలేదు.

నీహా: ఓహో.. అందుకేనా ఇప్పుడు కూడా ఏదైనా చెప్పే ముందు ‘అమ్మా.. చూడు.. చూడు’ అని నేనంటే చిన్నప్పటిది గుర్తుకొచ్చి నవ్వుతుంటావ్? అది సరే... అమ్మా నాలో నీకు నచ్చని విషయాలు, నచ్చినవి?

పద్మజ: నీకు కోపం ముక్కు మీద ఉంటుంది. ఎంత త్వరగా వస్తుందో అంతే త్వరగా పోతుంది కాబట్టి, నేను సీరియస్‌గా తీసుకోను. ఆ కోపం అంటే నాకు నచ్చదు. నచ్చే విషయాలంటే.. నేనేదైనా విషయానికి బాధపడితే.. చాలా మెచ్యుర్డ్‌గా మాట్లాడతావ్. అప్పటివరకూ బాధపడిన నేను ‘ఇంత చిన్న విషయానికి బాధపడ్డామా’ అనుకుంటాను. నీహా.. నువ్వంత మెచ్యుర్డ్‌గా మాట్లాడటం, బోల్డ్‌గా ఉండటం నాకు నచ్చుతుంది.

నీహా: నీకో కాంప్లిమెంట్ అమ్మా... నువ్వు యంగ్‌గా కనిపిస్తావ్... చాలా ప్రౌడ్‌గా ఉంది..

పద్మజ: అందుకేనా.. నాకన్నా నువ్వే బాగున్నావని ఏడిపిస్తుంటావ్? మీ అన్నయ్య కాలేజ్‌కి నేను వెళ్లినప్పుడు, తనేమన్నాడో నీకు గుర్తుండే ఉంటుంది. కాలేజీలో ‘మీ సిస్టరా?’ అని అడిగారట. అందుకని వరుణ్ ఇంటికొచ్చి ‘అమ్మా.. నువ్వు కాలేజీకి వస్తే రా కానీ, చుడీదార్లు వేసుకోకు.. చీరలు కట్టుకుని రా’ అన్నాడు (నవ్వుతూ).
మా అమ్మచెప్పిన అబ్బాయినే పెళ్లి చేసుకుంటా. నాకెలాంటి అబ్బాయి సూట్ అవుతాడో మా అమ్మకు బాగా తెలుసు. అందుకే డెసిషన్ తనదే.
మా ఇద్దరి రిలేషన్‌షిప్ మదర్, డాటర్‌లా ఉండదు. కోపం వచ్చినప్పుడు బాగా గొడవపడతాం. ఆ కోపం కాసేపే. ఆ తర్వాత నేను ‘సారీ అమ్మా’ అనేస్తాను. మేమిద్దరం అటు ఫ్రెండ్స్ కాదు.. ఇటు ఎనిమీస్ కాదు. మేం ‘ఫ్రెనిమీస్’ అంటాను.

నీహా: నీకింకో కాంప్లిమెంట్ కూడా.. నువ్వు సింపుల్‌గా ఉన్నా చాలా బాగుంటావమ్మా. ఒక మామూలు హౌస్‌వైఫ్ ఎలా ఉంటుందో అలానే ఉంటావ్.

పద్మజ: నాక్కూడా ఇలా ఉండటమే ఇష్టం నీహా. మీ నాన్నగారికి కూడా నేనిలా ఉండటమే ఇష్టం కదా.

నీహా: అవును. అన్నయ్యకు కూడా నువ్విలానే ఉండటం ఇష్టం. నిన్ను చుడీదార్లు వేసుకోవద్దంటాడు. చీరలే కట్టుకోమంటాడు. బొట్టు పెట్టుకోమంటాడు. ఎప్పుడైనా నువ్వు పోనీటైల్ వేసుకున్నా, ఊరుకోడు. జడేసుకోమంటాడు.

పద్మజ: అవును. వరుణ్ మరీ పర్టిక్యులర్‌గా ఉంటాడు. నేను కూడా ఇలా ఉండటానికే ఇష్టపడతాను.

నీహా: నేను హీరోయిన్ అవుతానని ఊహించావా?

పద్మజ: వరుణ్ హీరో అవుతాడని అనుకున్నాను. నాకూ ఇంట్రస్టే. కానీ, నీ గురించి ఏమీ అనుకోలేదు. నువ్వు డాక్టర్ అవ్వాలనుకునేదానివి. కానీ, నాకు తెలుసు నువ్వు కావని. ఒకేచోట కుదురుగా ఉండటం నీవల్ల కాని పని. నువ్వు డాక్టర్ అయితే.. నాలుగు గంటలు ఆపరేషన్ చేయాలంటే రెండు గంటలు చేసి, మిగతా సగం వదిలేస్తావనుకుంటుంటాను (నవ్వుతూ). మీ నాన్నగారి అమ్మమ్మ నిన్ను ఐఏఎస్‌గా చూడాలనుకునేది. కానీ, నీకు బీఏ మాస్ కమ్యూనికేషన్ చేయాలని ఉండేది. నీ ఇష్టాన్ని కాదనలే దు. అందుకే హీరోయిన్ అవుతానంటే ఓకే చెప్పాం. ఓకే చెప్పే ముందు నేనూ, నాన్న చాలా డిస్కస్ చేసుకున్నాం. 

నీహా: మీ ఇద్దరూ ఏం డిస్కస్ చేసుకున్నారో చెప్పవా ప్లీజ్..

పద్మజ: (నవ్వుతూ). మేమిద్దరం ఒకటే అనుకున్నాం. ‘భవిష్యత్తులో మన అమ్మాయి ఏ విషయంలోనూ ఫీల్ కాకూడదు. ఇప్పుడు కనుక తన ఇష్టాన్ని కాదంటే.. రేపు తను ఫీలవుతుంది. పెళ్లయ్యాక హీరోయిన్‌గా ఎలాగూ చేయలేదు. టీవీ షోస్ అయితే ఎప్పుడైనా చేయొచ్చు. అందుకే ఇప్పుడు చేయనిద్దాం’ అనుకున్నాం.

నీహా: అవునమ్మా.. పెళ్లయ్యాక నేను సినిమాలు చేయను. నువ్వు నీ పిల్లల్ని ఎలా జాగ్రత్తగా చూసుకున్నావో నేనూ అలానే చూసుకుంటాను. నేనే పని చేసినా ఫుల్‌గా కాన్సన్‌ట్రేట్ చేస్తా. అందుకే మ్యారీడ్ లైఫ్‌ని నీలానే లీడ్ చేస్తాను.

నీహా: ఇంతకీ అన్నయ్య ఫస్ట్ సినిమా అప్పుడా.. ఇప్పుడు నేను యాక్ట్ చేసిన నా ఫస్ట్ సినిమా (ఒక్క మనసు) రిలీజ్ అవుతుంటే ఎగ్జయిట్ అవుతున్నావా?

పద్మజ: అన్నయ్య సినిమా అప్పుడు ఎగ్జయిట్‌మెంట్, టెన్షన్ ఉండేది. నీ సినిమాకి ఇంకా ఎక్కువ ఉంది. దానికి కారణం మన మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న మొదటి హీరోయిన్‌వి నువ్వే. ఏదైనా జరిగితే నిన్ను అనరు.. నన్ను అనరు. ఫ్యామిలీని అంటారు. అందుకే, మంచి యాక్ట్రెస్ అనిపించుకుంటావా? లేదా? అని టెన్షన్.

నీహా: అవును. నేను కూడా ఆ విషయం గురించి ఆలోచించాను. ‘కొణిదెల మెగా ఫ్యామిలీ’ అనే పేరు మా డాడీ చిరంజీవిగారిది. నేను మంచి సినిమా చేసినా, చెడ్డ  సినిమా చేసినా అది ఫ్యామిలీకే వస్తుంది. అందుకే ఫ్యామిలీని దృష్టిలో పెట్టుకుని, నిర్ణయాలు తీసుకుంటా .

పద్మజ: నువ్వు టాలెంటెడ్ నీహా. అందుకే ఎంకరేజ్ చేశాం. బయట ఫ్యాన్స్ సినిమాలు చేయొద్దన్నా.. వేరేవాళ్లు వద్దన్నా.. నీ కోరిక తీరలేదంటే... భవిష్యత్తులో నువ్వు ఎవర్నీ అడగవ్. ‘నా కోరికను ఎందుకు కాదన్నారు’ అని నన్నూ, నాన్ననే అడుగుతావ్. అందుకే ఒప్పుకున్నాం.

నీహా: బిహైండ్ మై సక్సెస్ ఎవరో కాదు.. నువ్వే అమ్మా.

పద్మజ: ఏం చేసినా నువ్వు కమిటెడ్‌గా చేయడం నాకూ ఆనందంగా ఉంది. టీవీ షోస్ చేసేటప్పుడు గంటల తరబడి నిలబడి, ఆ తర్వాత కాళ్ల నొప్పులతో బాధపడతావ్ కదా.. అప్పుడు నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంటుంది.

నీహా: అన్నయ్య, నా విషయంలో నీకేదైనా బాధ?

పద్మజ: ఏ బాధా లేదు. మీ ఇద్దరూ చాలా బాగా పెరిగారు. మీకు బయటి ఫుడ్ పెట్టకూడదని మీ చిన్నప్పుడు చైనీస్ వంటకాలు కూడా నేర్చుకున్నాను. నేను చేసే బిర్యాని, నాన్‌వెజ్ కర్రీస్ అంటే నీకిష్టం. ఇప్పుడేమో ఇద్దరూ డైటింగ్ అంటూ తినడం మానేశారు. నువ్వేమో నాన్‌వెజ్ మానేశావ్. చిన్నప్పుడు మీ ఇద్దరూ స్కూల్ నుంచి ఇంటికి రాగానే ‘ఏం తింటారు’ అని అడిగేదాన్ని. ఇప్పుడు బయట నుంచి రాగానే, మీ అన్నయ్యను అలా అడిగితే.. ‘తింటావా అని మాత్రం అడక్కు’ అంటాడు. మీ ఇద్దరూ ఫుడ్ కంట్రోల్ చేసుకోవడం కొంచెం బాధగా ఉంది.

నీహా: కరెక్టే అమ్మా.. చిన్నప్పుడు ఏ టైమ్‌లో పడితే ఆ టైమ్‌లో ఏది పడితే అది తినడానికి అడిగేదాన్ని కదా..

పద్మజ: చిన్నప్పుడు మ్యాంగో సీజన్ కానప్పుడు మ్యాంగో జ్యూస్ అడిగేదానివి. ఒకసారి రాత్రి 12 గంటలకు మైసూ ర్‌పాక్ కావాలని మారాం చేసావ్. అప్పటికప్పుడంటే ఎలా? నాకు చేయడం రాదు. చిన్నప్పుడు ఎవరో చేస్తుంటే చూసా. అది గుర్తు తెచ్చుకుని చేసిస్తే, తిన్నావ్.

నీహా: పెదనాన్న (చిరంజీవి), బాబాయ్ (పవన్ కల్యాణ్) పెద్ద హీరోలయ్యారు కదా.. మరి.. నాన్న... పెద్ద హీరో కానందుకు బాధపడ్డావా?

పద్మజ: నాకే బాధా లేదు. మరి.. నీ సంగతేంటి నీహా?

నీహా: డాడీ (పెదనాన్న చిరంజీవిని నీహా అలానే పిలుస్తారు), బాబాయ్ పెద్ద హీరోలయ్యారు. నాన్నగారి నటన డిఫరెంట్‌గా ఉంటుంది. నాన్న మెయిన్ ఫోకన్ యాక్టింగ్‌పైన కాదు. ఆయనలో మంచి రైటర్ ఉన్నాడు. నేను యూ ట్యూబ్‌లో చేసిన వెబ్ సిరీస్‌కి రైటింగ్ విషయంలో నాన్న హెల్ప్ తీసుకున్నాను. నాన్న ‘సీతామాలక్ష్మి’ సీరియల్ కథ రాస్తున్నారు. రైటింగ్ విషయంలో నాన్న హెల్ప్ తీసుకుంటా కాబట్టి, ఆయన ఫుల్ టైమ్ ఆర్టిస్ట్ కాకపోవడం ఆనందంగా ఉంది. స్వార్థం అనుకోవద్దమ్మా ప్లీజ్.

నీహా: ఫైనల్‌గా ఒక్క మాట చెప్పమ్మా.. నాలాంటి కూతురు ఉన్నందుకు నీకెలా అనిపిస్తోంది?

పద్మజ: చాలా ప్రౌడ్‌గా ఉంది. చాలా తెలివిగా నిర్ణయాలు తీసుకుంటావ్. అలాగే, ‘ఇది తప్పమ్మా.. చేయొద్దు’ అంటే చేయవు. అది ఇంకా ఇంకా ఇష్టం.

నీహా: నేనూ, అన్నయ్యా మా ప్రేమను నీకెంత ఇచ్చామో తెలియదు కానీ, నువ్వు మాత్రం హండ్రెడ్ పర్సంట్‌కన్నా ఎక్కువే ఇచ్చావమ్మా. ఎప్పటికీ నువ్వే మా అమ్మ కావాలి.  
- డి.జి. భవాని

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement