ఇండియన్ ఆర్మీలో జూనియర్ కమీషన్డ్ ఆఫీసర్‌గా బార్డర్‌లో శత్రువులతో పోరాటం చేసే యోధుడు సుధీర్‌కుమార్. ఇప్పుడు కరోనా వైరస్‌పై జరిగే పోరులోనూ నేను సైతం అంటున్నాడు. సుధీర్‌కుమార్ వయసు 43. ప్రస్తుతం అమృత్‌సర్‌లో విధులను నిర్వర్తిస్తున్నాడు. నెలరోజుల దీర్ఘకాలిక సెలవు మీద బీహార్‌లోని మోతిహరి జిల్లా జత్వాలియా గ్రామంలోని తన ఇంటికి వచ్చాడు కూతురు పెళ్లి జరిపించడానికి. పెళ్లి కోసమని 4 లక్షల రూపాయల లోను తీసుకున్నాడు. ఈ టైమ్‌లో లాక్‌డౌన్ వచ్చింది. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కారణంగా మరికొన్ని రోజులు తన లీవ్ పొడిగించమని అతను పనిచేస్తున్న యూనిట్‌కు ముందుగానే మెసేజ్ పంపాడు. ఈ టైమ్‌లోనే సుధీర్ తన కుటుంబంతో కలిసి కరోనా వైరస్‌పై సమరశంఖం పూరించాడు. గ్రామంలో ఈ వైరస్‌కు సంబంధించిన సమాచారం ఇస్తూ ప్రజల్లో అవగాహన కలిగిస్తున్నాడు. అంతేకాదు మాస్కులు సొంతంగా తయారు చేస్తూ వాటితో పాటు పేదలకు కావల్సిన నిత్యాసవసర సరుకులన్నీ ఉచితంగా అందజేస్తున్నాడు.
ఇంటి నుంచే పోరాటం..
‘మేం మా అబ్బాయిని మాస్క్‌లు కొనుక్కురమ్మని పంపినప్పుడు విపరీతమైన డిమాండ్ ఉందని, మాస్క్‌లు దొరకడం లేదని తెలిసింది. అంతేకాదు, ఒక్కో మాస్క్ చాలా ఎక్కువ ధరకు అంటే దాదాపు రూ. 200కు అమ్ముతున్నారు. అయినా, వైరస్‌కు భయపడి ఖరీదైన మాస్క్‌లు కొనాలనే జనం ఆలోచన. ఆ మాస్క్‌లను చూసిన తర్వాత వాటిని ఇంట్లోనే ఎందుకు తయారు చేయకూడదు అనుకున్నాడు సుధీర్.
అతను శిక్షణ కోసం వెళ్లినప్పుడు అతని భార్య కుటుంబ పనుల్లో భాగంగా నేర్చుకున్న కుట్టుపని ఇప్పుడు సాయపడింది. దీంతో సుధీర్ నిర్ణయానికి కుటుంబం నుంచి వెంటనే బలం చేకూరింది. తన గ్రామంలోని ప్రజలకు ఫేస్‌మాస్క్‌లు తయారుచేసి పంపిణీ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని సుధీర్ చెప్పాడు. ఇంట్లో ఒక కుట్టు మిషన్ ఉంది. మరో కుట్టు మిషన్, ముసుగులు తయారు చేయడానికి కావల్సిన సరంజామాను సిద్ధం చేసుకున్నాడు. ఇలాంటి పరీక్ష సమయంలో దేశానికి ఎంతో కొంత సేవ చేయాలని సుధీర్ సంకల్పించాడు.
రక్షణ కేంద్రంగా...
సుధీర్ జిల్లా వైద్యాధికారితో సంప్రదించి, అతని సూచనలతో ఈ మాస్క్‌లను తయారుచేశాడు. భార్యతో కలిసి 4 వేల మాస్క్‌లను తయారుచేసి తమ ఊరివాళ్లకు, పొరుగూళ్లకు కూడా ఉచితంగా అందజేస్తున్నాడు. సుధీర్, అతని కుటుంబం ‘సామాజిక దూరం’ పాటించడంలో తమ గ్రామంలోని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. సుధీర్ గ్రామం చిన్నదైనా జాగ్రత్తలు తీసుకోవడంలో రక్షణ కేంద్రంగా ఉంది. ‘రోజులో ఎక్కువ సమయం మాస్క్ ధరిస్తే మరో మాస్క్ కోసం నా దగ్గరకు వచ్చి తీసుకెళ్లు. కానీ, దానిని ఉతికి వాడాలనుకోకు’ అని మాస్క్ ధరించి మరీ చెబుతున్నాడు.
కూతురి పెళ్లికోసం దాచిన డబ్బును...
జూనియర్ ర్యాంక్ అధికారిగా ఉన్న సుధీర్ సంపాదన ఎక్కువేమీ కాదు. అతని సంపాదన కుటుంబ అవసరాలకే సరిపోదు. కానీ, దేశం సంక్షోభంలో ఉన్నందున తన కూతురు పెళ్లి కోసం తీసుకున్న వ్యక్తిగత రుణాన్ని ప్రజలకు సేవ చేయడానికి ఉపయోగిస్తున్నాడు. గ్రామంలో పేదలకు కావల్సిన పప్పు, ఉప్పు, కూరగాయలను, ఇతర నిత్యావసరాలను ఉచితంగా అందిస్తున్నాడు. ఎవరికి ఎప్పుడు సరుకులు కావాలన్నా వచ్చి తీసుకెళ్లచ్చు అని బోర్డు పెట్టి మరీ చెబుతున్నాడు. ఇతరులకు సాయం చేయడం ద్వారా నాకు డబ్బు కొరత ఉండదు. కానీ, వెలకట్టలేనన్ని ఆశీస్సులు నాకు అందుతాయి’ అని అంటున్నాడు సుధీర్.
– ఆరెన్నార్
Comments
Please login to add a commentAdd a comment