ఊరికి దూరంగా... దేవునికి దగ్గరగా.. క్రిస్మస్‌! | Away from the village Christmas is close to God | Sakshi
Sakshi News home page

ఊరికి దూరంగా... దేవునికి దగ్గరగా.. క్రిస్మస్‌!

Published Sun, Dec 23 2018 12:05 AM | Last Updated on Sun, Dec 23 2018 12:05 AM

Away from the village Christmas is close to God - Sakshi

తెల్లారితే క్రిస్మస్‌... ఊరికి దూరంగా విసిరేసినట్టుగా ఉన్న ఒక పాత ఇల్లు... దాన్ని ఆనుకొని ఒక కార్‌ రిపేర్‌ షాపు... చిమ్మచీకటి, భోరున కురుస్తున్న మంచు.. బయటి ప్రపంచం, కాలం అతనికి ఎప్పుడో అతని భార్య చనిపోయినప్పుడే పదేళ్ల క్రితమే స్తంభించింది ఆ ఇంట్లోని 70 ఏళ్ళ ముసలాయన జార్జ్‌కి ... క్రిస్మస్‌ అంటే అయిష్టమేమీ లేదు, కాకపోతే ఆనందమూ లేదు. ఏడాదిలో అదీ ఒక రోజు అంతే!! ఇంతరాత్రి కస్టమర్లెవరొస్తారులే అనుకొంటున్న సమయంలో ఒక అపరిచితుడు తలుపు తోసుకొని లోనికి వచ్చాడు. అతనూ వయసులో పెద్దవాడే. పాపం! బాగా అలసిపోయి బలహీనంగా ఉన్నాడు... ‘‘చలిగా ఉంది, వచ్చి హీటర్‌ వద్ద కూర్చోండి’’ అన్నాడు జార్జ్‌ జాలిగా... చలికి గడ్డకట్టుకుపోతున్న ఆ వ్యక్తికి ఆ మాటలు గుడిగంటల్లా వినిపించాయి. హీటర్‌ వద్ద కూర్చున్న ఆ అపరిచితునికి ఆ రాత్రి తన కోసం చేసుకున్న వేడి వేడి సూప్‌ను ఫ్లాస్కులో నుండి పోసి ఇచ్చాడు.

‘‘బయట చలి భరించలేక లోనికి వచ్చాను... మీరేమో నాకింత మంచి ఆతిథ్యమిస్తున్నారు’’ అన్నాడా అపరిచితుడు. సరిగ్గా అదే సమయంలో అతని ఇంటి కాలింగ్‌ బెల్‌ మోగింది. ఎవరో కస్టమర్‌ వచ్చాడన్న మాట!! తలుపు తీసి చూస్తే ఒక పాత కారు, దాని డ్రైవింగ్‌ సీట్‌లో ఒక యువకుడు... ‘‘నా భార్య నిండు చూలాలు, నొప్పులొస్తున్నాయి. కానీ నా కార్‌ ముందుకు సాగడం లేదు... కాస్త రిపేర్‌ చేస్తారా?’’ అనడిగాడా వ్యక్తి ఎంతో దీనంగా. అది రిపేరయ్యే  కారు కాదని అతనికి అర్ధమై ఆ మాటే అతనితో అన్నాడు జార్జ్‌. ‘‘ప్లీజ్‌... నా భార్య చాలా ప్రమాదంలో ఉంది. సాయం చెయ్యండి’’ అంటూ ప్రాధేయపడుతున్నాడతను. జార్జ్‌ తలుపేసి లోపలికొచ్చి గోడకున్న  తాళపు చెవుల గుత్తిలో నుండి తన కారు తాళం చెవులు తీసుకొని బయటికెళ్లి షెడ్డులోనుండి తన కార్‌ బయటికి తీసి అతనిముందు పెట్టి ‘‘నా ఈ కార్‌ తీసుకెళ్లండి. పాతదే కానీ బాగా పరుగెత్తుతుంది’’ అన్నాడు.

అతని కారులోనుండి భార్యను ఎత్తి తన కారులో కూర్చోబెట్టడంలో సాయం చేసి...‘‘కంగారు పడొద్దు. నెమ్మదిగా, జాగ్రత్తగా వెళ్ళు. నీ భార్యకేమీ కాదు’’ అన్నాడు జార్జ్‌. అతని కారు వెళ్లిన తర్వాత ఇంట్లోకి వస్తూ ‘‘నా కాఫీ ఎలా ఉంది?’ అనడగబోతూ ఆగిపోయాడు. అపరిచితుడక్కడ లేడు, వెళ్ళిపోయాడు. పోనీలే అనుకొంటూ  జార్జ్‌ సర్దుకొంటుండగా, తుపాకీ కాల్పుల శబ్దం వినిపించింది. బయటికి పరుగెత్తాడు. ఎవరో ఆగంతకుడు జరిపిన కాల్పుల్లో ఒక పోలీసు ఆఫీసర్‌ గాయపడ్డాడు. అతను పోలీసు కారులో ఉన్నాడు. కాల్పులు జరిపిన వాడు పారిపోయాడు. జార్జ్‌ గతంలో సైన్యంలో పనిచేశాడు. ప్రథమ చికిత్స చెయ్యడం అతనికి తెలుసు. మెల్లిగా పోలీసు ఆఫీసర్‌ను లోనికి తెచ్చి పడుకోబెట్టి కట్టుకట్టాడు. నొప్పి తగ్గడానికి కొన్ని మాత్రలిచ్చి ‘మీ వాళ్లకు కబురు చేసి ఆంబులెన్స్‌ పిలిపిస్తాను’ అంటూ బయటికెళ్లి పోలీసు కారులోని వైర్‌లెస్‌ ద్వారా సమాచారం పంపి మళ్ళీ లోపలికొచ్చాడు. ‘‘థాంక్యూ. మీరు నాకు ఎంతో సాయం చేశారు, నా ప్రాణాలు కాపాడారు’’ అన్నాడా పోలీసు ఆఫీసర్‌ ఎంతో కృతజ్ఞతగా.. ‘‘ఇందులో నేను పెద్దగా చేసిందేమీ లేదు.

గాయాలతో నిస్సహాయ స్థితిలో ఒక వ్యక్తి బయట పడి ఉంటే నేను విస్మరించలేను... నేను చెయ్యగలిగింది నేను చేశాను’’ అన్నాడు జార్జ్‌. అతనికీ కాఫీ కప్పు ఇచ్చాడు. అతను కాఫీ తాగుతోంటే విసురుగా తలుపు తెరుచుకొని ఒక యువకుడు చేతిలో తుపాకీతో లోనికొచ్చాడు. ‘‘మీ వద్ద ఉన్న డబ్బులన్నీ బయటికి తీయండి’’ అంటూ తుపాకీతో బెదిరించాడు. ‘‘నన్ను ఇందాక గాయపర్చింది ఇతనే’’ అన్నాడు పోలీసు అధికారి. ‘‘బాబూ ముందా తుపాకీ పక్కన పెట్టు, నీకు కావలసింది ఇస్తాం’’ అన్నాడు జార్జ్‌. ‘‘ముసలోడా!! నోరు మూసుకొని ముందు డబ్బంతా బయటికి తియ్యి’’ అన్నాడా యువకుడు. పోలీసు అధికారి తన తుపాకీ తియ్యబోతుండగా ‘ఆ అవసరం లేదు’ అని అతన్ని వారించాడు జార్జ్‌. ‘‘ఈ రోజు క్రిస్మస్‌ ఈవ్‌ కదా... ఈ డబ్బంతా తీసుకో. దయచేసి నీ తుపాకీ మాత్రం పక్కన పెట్టు’’ అన్నాడు జార్జ్‌ అనునయంగా.

తన వద్ద ఉన్న 150 డాలర్లు తీసుకెళ్లి జార్జ్‌ అతని చేతిలోపెట్టి, ‘‘చాలా ఇంకా కావాలా?’’ అనడిగాడు. ఆ యువకుడు అలసిపోయినవాడిలాగా తుపాకీ వదిలేసి మోకాళ్ళ మీద కుప్ప కూలిపోయాడు. ‘‘నాకిలాంటి పనులు అలవాటు లేదు. నా ఉద్యోగం పోయింది, ఆరు నెలలు ఇంటి అద్దె బకాయిపడ్డాను. ఫైనాన్స్‌ వాళ్ళు నా కార్‌ తీసుకెళ్లిపోయారు. ఈ క్రిస్టమస్‌ కోసం నా భార్యకు, కొడుక్కు ఏమైనా కొందామనుకున్నానంతే’’ అంటూ ఆ యువకుడు ఏడుస్తున్నాడు. జార్జి అతని తుపాకీ తీసి పోలీసు ఆఫీసర్‌కి ఇచ్చాడు. ‘‘బాబూ!  తప్పులు చేయడం మానవ సహజం. మనం ప్రయాణిస్తున్న దారిలో ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి. కానీ పట్టుదలతో, కష్టపడే తత్వంతో వాటిని ఎదుర్కోవాలి, సమస్యలు తీర్చుకోవాలి, కానీ ఇలా కాదు’’ అని చెప్పాడు జార్జ్‌. అతన్ని ఒక కుర్చీలో కూర్చోబెట్టి అతనికీ ఒక కప్పు కాఫీ ఇచ్చాడు. ‘‘కాస్త అలసట తీర్చుకో... అన్నీ కుదుటపడతాయి..’’ అన్నాడాయన.ఆ యువకుడు భోరున ఏడుస్తూ ‘‘సారీ, మిమ్మల్ని తుపాకీతో కాల్చాను’’ అంటూ పోలీసు అధికారికి క్షమాపణ చెప్పాడు.

‘‘నోరు మూసుకొని కాఫీ తాగు’’ అని బెదిరించాడా అధికారి. ఇంతలో ఆంబులెన్స్‌ వచ్చింది. ఇతర పోలీసు అధికారులొచ్చారు. ‘‘నీ మీద కాల్పులు జరిపింది వీడేనా?’’ అని ఆ యువకుని చూపిస్తూ వాళ్లడిగారు. ‘‘అతను కాదు... వాడు తుపాకీ ఇక్కడ పారేసి పారిపోయాడు’’ అని అధికారి జవాబిచ్చాడు. జార్జి, ఆ యువకుడు ఒకరినొకరు ఆశ్చర్యంగా చూసుకున్నారు. ‘‘మరి ఇతనెవరు?’’ అని వాళ్లడిగారు అనుమానంగా. ‘‘ఈ రోజే కొత్తగా నావద్ద పనిలో చేరాడు’’ అని జార్జ్‌ వారికి బదులిచ్చాడు. అతన్ని ఆంబులెన్స్‌లోకి ఎత్తడంలో ఆ యువకుడు కూడా సాయం చేస్తూ ‘‘నన్నెందుకు క్షమించారు?’’ అని గుసగుసగా అడిగాడు. పోలీసు అధికారి చిన్నగా నవ్వుతూ ‘‘హ్యాపీ క్రిస్మస్‌’’ అన్నాడు. ‘‘నీకు కూడా జార్జ్‌... నాకెంతో సాయం చేశావు’’ అన్నాడతను. వాళ్ళు వెళ్లిపోయాక, జార్జ్‌ ఇంటిలోనికి వెళ్లి ఒక చిన్న పెట్టెలాంటిది తెచ్చి ఆ యువకునికిచ్చాడు. ‘‘నేనెంతో కాలం బతకను. కానీ దీంట్లోనివి నీకు అక్కరకొస్తాయి. నా భార్య మార్త బతికుంటే సరిగ్గా ఇదే పని చేసి ఉండేది’’ అన్నాడు జార్జ్‌. దాంట్లో చూస్తే అతని భార్య తాలూకు పెద్ద వజ్రపుటుంగరం అందులో ఉంది.

 ‘‘అయ్యో ఇంత ఖరీదైనది నేను తీసుకోలేను’’ అన్నాడా యువకుడు. ‘‘నువ్వు తప్పక దాన్ని తీసుకోవాలి. ఎందుకంటే దాని అవసరం నీకు ఉంది. నాకు అత్యంత విలువైన నా భార్య జ్ఞాపకాలు చాలు’’ అన్నాడు జార్జ్‌. ‘‘నీకున్న 150 డాలర్లు నాకిచ్చేశావు. ఇవి మాత్రం తీసుకోవాలి’’ అన్నాడా యువకుడు. సరేనంటూ అతన్ని వీధిలోకి సాగనంపి ఇంట్లోకి వచ్చి మంచం మీద అతను మేను వాలుస్తూ ఉండగా ఆ యువకుడు నవ్వుతూ మళ్ళీ లొనికొచ్చాడు. ‘‘నేను తలుపేశానుగా, లోనికెలా వచ్చావు?’’ అనడిగాడు జార్జ్‌ ఆశ్చర్యంగా. ‘‘నువ్వు క్రిస్మస్‌ పండుగ చేసుకోవా?’’ అనడిగాడా యువకుడు. ‘‘నా భార్య మార్తతోటే ఆ ఆనందమంతా ఆవిరైపోయింది. క్రిస్మస్‌ చేసుకునే ఓపిక నాకిప్పుడు లేదు’’ అన్నాడు జార్జ్‌. ఆ యువకుడు జార్జ్‌ భుజాలమీద చెయ్యి వేసి ‘‘కానీ నీ భార్య జ్ఞాపకాలతో నీవింకా అద్భుతంగా క్రిస్మస్‌ చేసుకుంటున్నావు జార్జ్‌. నీలాంటి వారు చాలా అరుదు. నీవు నాకు ఆహారమిచ్చావు, తాగడానికి కాఫీ ఇచ్చావు, హీటర్‌ వెచ్చదనాన్నిచ్చావు. నీవు సాయం చేసిన ఆ జంటకు కొడుకు పుట్టి గొప్ప డాక్టర్‌ అయి ఎంతో మందికి సేవచేస్తాడు.

నీవు ప్రాణాలు కాపాడిన పోలీసు అధికారి మరెంతోమంది ప్రాణాలు కాపాడుతాడు. నీవు దారిచూపించిన నాలాంటి యువకుడు మరెంతో మందికి దారి చూపించి యేసుక్రీస్తు ప్రేమను,  క్షమాపణను లోకానికంతటికీ చాటిచెప్పుతాడు...’’ అని అతను చెబుతుంటే ‘‘నీకివన్నీ ఎలా తెలుసు?’’ అనడిగాడు జార్జ్‌ ఆశ్చర్యంగా. ‘‘నేను ఎప్పుడూ నీవెంటే ఉంటాను జార్జ్, సదా నిన్ను నేను ఆవరించి ఉంటాను. ఇక వెళ్తాను మరి. లోకమంతా నా జన్మదినం జరుపుకోవడానికి సంసిద్ధమవుతోంది మరి, నేను లేకపోతే ఎలా?’’ అంటూ అతను నవ్వుతూ వెళ్లిపోతుండగా అతని చిరిగిపోయిన వస్త్రాలు తెల్లబడి బంగారు రంగులో మారి ధగధగా మెరిసిపోయాయి... ఆ ప్రాంతమంతా వెలుగుతో నిండిపోగా జార్జ్‌ మోకాళ్ళ మీదుం ‘‘హ్యాపీ బర్త్‌డే జీసస్‌’’ అన్నాడు. ‘జీసస్‌ను నా మార్త కూడా చూసి ఉంటే ఎంత బావుండేది’ అని జార్జ్‌ అనుకొంటూ ఉండగా, ‘‘నీ ప్రియమైన మార్త ఇపుడు నాకు ప్రియమైన కుమార్తె. ఆమె నాతోపాటే ఉంది జార్జ్‌’’ అంటూ ఆయన వెళ్ళిపోయాడు. 

– రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్‌
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement