కొత్త బంగారం
అరవింద్ అడిగా
ముంబయిలో నివసిస్తున్న కుమార్ల కుటుంబంతో నవల ప్రారంభం అవుతుంది. 14 ఏళ్ల రాధాకృష్ణ (రాధ), 13 ఏళ్ల మంజునాథ్ (మంజు), తండ్రి మోహన్! ఆయన తన కొడుకులను పేరొందిన క్రికెటర్లుగా తయారు చేయడానికి, కర్ణాటక నుండి ముంబయి మురికివాడకు వస్తాడు. కుర్రాళ్లు తమ బాల్యాలను ఆరోగ్యం, శుభ్రత కోసం త్యాగం చేయవలసి వచ్చినప్పుడు, తండ్రిని అసహ్యించుకుంటారు. భార్య వదిలేసి పోతుంది.
మోహన్ రైల్లో ప్రయాణికులతో చెప్తుంటాడు: ‘నేను అద్భుతమైన చట్నీలమ్ముతాను. రోజుకి 24 రకాలైన చట్నీలు. పుదీనా, వెల్లుల్లీ, మిరపా, తీపీ. అన్నీ నూరు శాతం శాకాహారం’.
అబ్బాయిలు టీనేజీలోకి ప్రవేశించినప్పుడు, ముంబయి క్రికెట్ అసోసియేషన్ కోసం పని చేసే ‘టామీ సర్’ కుర్రాళ్ళ ప్రతిభ గుర్తించి, స్పాన్సర్షిప్ ఇప్పిస్తాడు. ఆ డబ్బుని మితంగా ఖర్చుపెడుతూ కుమార్ల కుటుంబం చెంబూర్‌కు మారుతుంది. మంజూ, రాధా క్రికెట్ ఆడుతున్నప్పుడు, వారి జట్టులో ఉండే జావెద్ అన్సారీ వాళ్ళకి పోటీగా నిలబడతాడు. అన్నదమ్ములకీ తండ్రికీ మధ్య ఘర్షణ ఎక్కువవుతూ ఉంటుంది. సెలెక్షన్ డే సమీపిస్తున్నప్పుడు, తనవల్ల ఇతరులకి కావలసినదేమిటో, తనకోసం తాను కోరుకున్నదేమిటో అని పరిశీలించుకునే అవసరం పడుతుంది మంజుకి.
ఇక, సెలెక్షన్ డే నాడు తండ్రి నమ్మకం పెట్టుకున్న రాధ ఎంపికవక, క్రికెట్ ఆడటం ఇష్టం లేని మంజు ఎంపికవుతాడు. అన్నదమ్ముల మధ్య ఈర్షా్యద్వేషాలు పుడతాయి. మంజుకీ, జావెద్‌కీ ఉన్న సంబంధం లైంగిక రూపం దాలుస్తుంది. పుస్తకంలో స్త్రీలు ఉండరు. వారి గురించిన క్లుప్తమైన ఉదహరింపులుంటాయంతే. నవలలో అధికభాగం తోబుట్టువుల మధ్య పోటీ గురించినదే. పుస్తకం, క్రికెట్లో పేరు ప్రఖ్యాతుల కోసం మార్గం వెతకడం కన్నా, ఆ క్రీడవల్ల మూసుకోబడిన ఇతర మార్గాల గురించినది. తన పాత్రలకున్న భయాలనీ, మనఃస్థితులనీ, తమకి తాము నిర్మించుకున్న వారి ఖైదులనీ– రచయిత వారి అంతర్గత కంఠాల లోపలకీ, బయటకీ త్వరితంగా ప్రయాణిస్తూ, వర్ణిస్తారు.
చిన్న పాత్రలకి కూడా రచయిత విషాదాన్నీ, గంభీరతనీ ఆపాదిస్తారు. వ్యంగ్య చిత్రాలు లేవు నవల్లో. ఇతివృత్తం ఆహ్లాదకరమైనది. 1983 అనంతరపు క్రికెట్ చుట్టూ కథ అల్లారు రచయిత. నవల నేపథ్యం క్రికెట్ మీదనున్న భారతదేశపు ఆరాధన. ఆ క్రీడ మీద సవిమర్శక పరిశీలనతోనే నడిచే నవల ఇది. క్రికెట్ అంటే మనకి దేవుడు, అది జాతీయ వ్యామోహమే కాక ఒక మతంలా కూడా తయారయిందన్న ఉదహరింపులున్నాయి. పుస్తకం, లైంగిక మేల్కొలుపు గురించినది కూడా!
రచయిత రాసిన విధానం వల్ల కథను ఆస్వాదించాలంటే పాఠకులకి క్రికెట్ గురించి తెలియాల్సిన అవసరం ఉండదు. క్రీడల మీద రాయబడిన ఇతర పుస్తకాల్లాగే ఇక్కడ కూడా, క్రికెట్ అన్న అంశం– విస్తృత సమస్యలను అన్వేషించే పరికరం మాత్రమే. ఈ క్రీడ మనుష్యులని ఎలా ఏకం చేస్తుందో, విడదీస్తుందో, ఉత్తేజపరుస్తుందో అన్న సంగతులనీ, తెర వెనకాతల సాగే లంచగొండితనాలూ, సాధికారతలన్నిటినీ రచయిత వర్ణిస్తారు.తన తొలి నవల ‘ద వైట్ టైగర్’కు 2008లో బుకర్ ప్రైజ్ గెలుచుకున్న అరవింద్ అడిగా మూడో నవల ఈ ‘సెలెక్షన్ డే’. 2016లో వచ్చింది.
u క్రిష్ణవేణి
Comments
Please login to add a commentAdd a comment