చోటా కె నాయుడి ‘లవ్‌ స్టోరీ’ | Chota K Naidu Interview With Sakshi | Sakshi
Sakshi News home page

సీతా కె నాయుడు

Published Sun, Mar 1 2020 3:39 AM | Last Updated on Sun, Mar 1 2020 9:15 AM

Chota K Naidu Interview With Sakshi

చోటా కె నాయుడి పేరులో ‘చోటా’ అని ఉండొచ్చు. సినిమాటోగ్రాఫర్‌గా ఆయన కెరీర్‌లో ఉన్నవన్నీ పెద్దవే! పెద్ద సినిమాలు.. పెద్ద హీరోలు.. పెద్ద పెద్ద దర్శకులు. అతడి వెనుక కూడా ఓ పెద్ద శక్తి ఉంది. సీతాదేవి! ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ముప్పై ఏళ్లయింది పెళ్లయి. లవ్లీగా, ప్రశాంతంగా ఉన్నారు. ‘క్రెడిట్‌ గోస్‌ టు మై వైఫ్‌ సీతాదేవి’ అంటాడు. అందుకే అతడు.. చోటా కె కాదు.. సీతా కె నాయుడు. ఆమె.. వైఫ్‌ మాత్రమే కాదు..  అతడి లైఫ్‌ కూడా.

►30 ఏళ్లకు పైగా మ్యారీడ్‌ లైఫ్‌ మీది. ఇద్దరూ చాలా ప్రశాంతంగా కనిపిస్తున్నారు. సీక్రెట్‌?
చోటా: మగవాడి డామినేషన్‌ ఉన్న ఈ దేశంలో స్త్రీకి సమాన హక్కులు ఉన్నా ఓ ప్లేసులో పెట్టి ఆమెను ఆపేశారు. అయితే మగవాడి డామినేషన్‌ ఉన్నప్పటికీ భార్య సపోర్ట్‌ లేకుంటే ఫ్యామిలీ కరెక్ట్‌గా ఉండదు. అది మగవాళ్లు అర్థం చేసుకోవాలి. నువ్వు ఎక్కువా నేను ఎక్కువా... లాంటివి ఉండకూడదు.  అలాగే భార్యకి స్పోర్టివ్‌నెస్, ఓపిక, శక్తి లేకపోతే ఆ ఫ్యామిలీ కంటిన్యూ కాదు. మా సంసారం సాఫీగా ఉందంటే ‘దట్‌ క్రెడిట్‌ గోస్‌ టు మై వైఫ్‌ సీతాదేవి’. వైవాహిక జీవితం బాగుండాలంటే భార్యాభర్తలిద్దరూ కడదాకా ఒకేమాట మీద ఉండాలి.

►ఇంతకీ మీ ఇద్దరికీ ఎలా పరిచయం?
చోటా: నేను చెన్నైలో మా గురువు దాసరిగారి సినిమాలకు కెమెరా అసిస్టెంట్‌గా చేశాను. ఇక కెమెరామేన్‌ అయిపోదాం అనుకుని ఉన్న పని మానేశాను. ప్రాక్టికల్‌ ఎక్స్‌పీరియన్స్‌ కోసం వేరే కెమెరామేన్‌ దగ్గర ఓ సంవత్సరం పని చేస్తే కెమెరామేన్‌ అయిపోవచ్చు అనుకున్నాను. ఆ టైమ్‌లో చాలామంది దర్శకుల దగ్గరికి వెళ్లి అవకాశం అడిగాను. ఎవరూ ఇవ్వలేదు. ఆ డిప్రెషన్‌లో ఉండగా హైదరాబాద్‌ నుంచి ఓ టీవీ సీరియల్‌కి కెమెరామేన్‌ కావాలని ఫోన్‌ వచ్చింది. ఆ అవకాశం నాకు రాలేదు, భరత్‌ పారేపల్లి (డైరెక్టర్‌) అని నా స్నేహితుడికి వచ్చింది. ఇద్దరం బయలుదేరి హైదరాబాద్‌ వచ్చాం. నాకూ చాన్స్‌ వచ్చింది. ‘క్రీస్తు జననం’ అనే టెలీఫిల్మ్‌ చేశాం. దానికి ప్రొడ్యూసర్‌ సీతాదేవిగారు, సంగీత దర్శకుడు కీరవాణిగారు, సింగర్‌ మనో. అందరి నోట్లో నుండి ఈమె పేరు వినేవాణ్ని కానీ, ఈమెను చూడలేదు. షూటింగ్‌ టైమ్‌లో ఏ కారులో నుంచి ఏ అమ్మాయి దిగినా ఆమె సీతాదేవి అనుకునేవాణ్ని. షూటింగ్‌ అయిపోయింది. మేం చైన్నై వెళ్లిపోయాం. ఆ తర్వాత ‘మర్యాద రామన్న’ సీరియల్‌ మొదలుపెట్టాలనుకున్నారామె. ఆ యూనిట్‌లో పని చేసే దుర్గా నాగేశ్వరరావు ఎవరో కెమెరామేన్‌ను సజెస్ట్‌ చేశారట. ‘లేదు.. నా టీమ్‌ నాకుంది’ అని నన్ను పిలిపించారామె. అప్పుడు నేను ఆమెను కలిశాను. అలా ట్రావెల్‌ చేస్తున్న టైమ్‌లో నేను ప్రపోజ్‌ చేశాను.

►ఆమె నిర్మాత కదా.. ప్రపోజ్‌ చేస్తే ఉన్న పని పోతుందేమో అని భయపడలేదా?
చోటా: అలాంటి టెన్షన్‌ ఏమీ లేదు. ప్రతిరోజూ మా షూటింగ్‌ ప్యాకప్‌ అవగానే యూనిట్‌ అంతా ఎస్‌.ఆర్‌. నగర్‌లోని సీతాదేవిగారి ఇంటికి వెళ్లి భోజనం చేసి ఎవరి రూమ్‌లకు వాళ్లు వెళ్లాలి. అలా మేం వెళ్లేటప్పుడు తలుపుకు తాళం వేసుకుని లోపలికి వెళ్లిపోయేది. రోజులానే ఆ రోజు కూడా వచ్చి, తాళమేసుకుంది. నేను బయట నిలబడి ‘ఓ సారి మీ చేయి ఇటివ్వండి’ అన్నాను. ‘ఎందుకు’ అని అడుగుతూనే ఇచ్చింది. ఆ చేతిని ముద్దుపెట్టుకుని ‘ఐ లవ్‌ యూ’ అని పరుగో పరుగు  (నవ్వుతూ). తాళం వేసి ఉంది కాబట్టి ఆమె నన్ను కొడదామన్నా కుదరదు కదా,అందుకే అలా చేశా.  తర్వాత ఆమె కలిసినప్పుడు ‘ఇదే విషయం ఓ సంవత్సరం తర్వాత కూడా అనిపిస్తే అప్పుడు చెప్పు’ అన్నారు. ఏడాది తర్వాత అదే చెప్పాను. అలా మా లవ్‌ ట్రావెల్‌ కంటిన్యూ అయ్యింది.

►మీది ఇంటర్‌క్యాస్ట్‌ మ్యారేజ్‌ కదా?
చోటా: నా కూతురికి ఇంతవరకు దాని క్యాస్ట్‌ ఏంటో తెలియదు. 
సీతాదేవి: చిన్నప్పుడు ఓసారి ఏదో ఫామ్‌ నింపుతూ ‘ఎస్‌.సి’ అని ఉన్నచోట టిక్‌ పెట్టిందట. ఇంటికొచ్చి ఆ విషయం చెప్పింది. అలా ఎందుకు పెట్టావు అంటే ఎస్‌.సి అంటే మనం ‘సూపర్‌ క్యాస్ట్‌’ కదా అంది. సో... మా ఇంట్లో నో క్యాస్ట్‌.

►బాగుంది.. ఇప్పుడు ఫ్యామిలీ లైఫ్‌లో ఓ సెక్యూరిటీ.. ఫైనాన్షియల్‌గా ఫుల్‌ హ్యాపీ. మరి పెళ్లయిన కొత్తలో ఏమైనా కష్టాలు ఫేస్‌ చేశారా? 
చోటా: మా పెళ్లయ్యేసరికి ఓ బ్లాక్‌ అండ్‌ వైట్‌ టీవీ, డబుల్‌ కాట్‌ బెడ్, ఓ డైనింగ్‌ టేబుల్, రెండు కేన్‌ కుర్చీలుండేవి. అప్పట్లో మూడువేల రూపాయల అద్దె ఇంట్లో ఉండేవాళ్లం. అప్పుడు కూడా పనోళ్లు ఉండేవారు. సొంత కారు ఉండేది కాదు కానీ ట్రావెల్స్‌ నుండి ఎప్పుడూ ఓ కారు అద్దెకు తీసుకునేవాళ్లం. మా లైఫ్‌సై్టల్‌ అలా ఉండాలనుకునేవాళ్లం కాబట్టి వాటిని ఫుల్‌ఫిల్‌ చేసుకోవటానికి ఇద్దరం బాగా కష్టపడేవాళ్లం. 
సీతాదేవి: అప్పుడు మేం బిజీగా ఉండేవాళ్లం. ఇంట్లో పెద్దవాళ్లు ఎవరూ లేకపోవటంతో మా పాప ఐశ్వర్యను హాస్టల్‌లో పెట్టాం. హాలిడేస్‌ అప్పుడు ‘ఇక్కడికి వెళ్దాం, అక్కడికి వెళ్దాం’ అని లిస్ట్‌ తెచ్చేది. కానీ, ఆయన షూటింగ్‌ క్యాన్సిల్‌ చేసుకుని హాలీడేకి రావడానికి కుదిరేది కాదు. నేను నా పని మానుకుని వెళ్లలేను. ఇలా ఎప్పుడూ బిజీగా ఉండేవాళ్లం. ఒకవేళ ఎక్కడికైనా వెళ్లినా తిరుపతి, షిరిడీ, శ్రీశైలం... అంతే కుదిరేది. అప్పుడు నేను మా పాపతో ‘నీకు పెళ్లయిన  తర్వాత 24 గంటలూ హాలిడేకి వెళ్లే ఫ్యామిలీ దొరుకుతుంది’ అనేదాన్ని. ఆ దేవుడి దయ వల్ల అలాంటి ఫ్యామిలీయే వచ్చింది. వాళ్లెప్పుడూ టూర్స్‌లోనే ఉంటారు (నవ్వుతూ).

►సీతగారు... మీ కెరీర్‌ గురించి చెబుతారా? సీరియల్‌ ప్రొడ్యూసర్‌ ఎలా అయ్యారు? 
సీతాదేవి: నా ఫ్రెండ్‌ని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుని దూరదర్శన్‌లో ‘మర్యాదరామన్న’ అనే సీరియల్‌ చేశాను. సాయికుమార్, బాబుమోహన్, గౌతంరాజు, సీవీయల్‌ నరసింహారావు, ‘తెలంగాణ’ శకుంతల, శిల్ప, సుమ... ఇలా మంచి పేరు తెచ్చుకున్న చాలామంది అప్పుడు ఆ సీరియల్‌లో నటించారు. ఆ సీరియల్‌ స్పెషాలిటీ ఏంటంటే కృష్ణగారు నటించిన ‘సింహాసనం’ సినిమా సెట్‌ని, కాçస్ట్యూమ్స్‌ని వాడుకున్నాం. అందుకే ఆ సీరియల్‌ చాలా రిచ్‌గా ఉంటుంది. అలా ఓ 20 ఏళ్లపాటు ఎన్నో సీరియల్స్‌ చేశాను. ఫుల్‌ బిజీగా ఉండేదాన్ని.

►తర్వాత ఎందుకు మానేశారు?
సీతాదేవి: ఓ డైలీ సీరియల్‌ చేస్తున్న సమయంలో హెల్త్‌ ప్రాబ్లమ్‌ వచ్చింది. కొంచెం జ్వరంతో మొదలై ఆ తర్వాత అది పెద్ద ప్రాబ్లమ్‌ అయింది. నాలుగైదు నెలల పాటు ఎంతోమంది డాక్టర్ల దగ్గరకు తిరిగాం. ఒక హాస్పిటల్‌ వాళ్లయితే సరిగ్గా నిర్ధారించకుండానే ఏదో ఆపరేషన్‌ కూడా చేశారు. కానీ సమస్య పరిష్కారం కాలేదు. ఏంటీ అని అడిగితే, ‘మీకు ప్రాబ్లమ్‌ ఏం లేదు, సైకలాజికల్‌ ప్రాబ్లమ్‌’ అనేవాళ్లు. కొందరేమో ఎవరో చేతబడి చేసుంటారని అన్నారు. దాదాపు 20 కిలోలు బరువు తగ్గాను. నాకు మెల్లకన్నులా వచ్చేసింది. చూపు కూడా మందగించింది. నడక, మింగడం కూడా కష్టమయ్యాయి.
చోటా: అప్పుడు ‘అంజి’ సినిమా విడుదలైంది. బాలకృష్ణగారి పెదపాప వచ్చి సినిమా బావుంది అంకుల్‌ అని చెబుతుంటే ఈమె దారిన ఈమె వెళ్లి కారులో కూర్చుంది. తర్వాత నేను కారెక్కగానే ముందెళ్లే కార్లన్నీ నాలుగు, నాలుగ్గా కనపడుతున్నాయి అంది. అప్పుడు నేను ఇదేదో సీరియస్‌ వ్యవహారమే అనుకున్నాను. 
సీతాదేవి: డాక్టర్లు ఇది న్యూరో ప్రాబ్లమ్‌ అని కనిపెట్టారు. ‘మల్టిపుల్‌ స్లె్కరోసిస్‌’ అన్నారు. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘గురు’ సినిమా చూస్తే మీకు తెలుస్తుంది. ఆ సినిమాలో మాధవన్‌ని మీ ఆవిడ (విద్యాబాలన్‌) ఎందుకు మంచంలో ఉంది అంటే మల్టిపుల్‌ స్లె్కరోసిస్‌ అని చెబుతాడు. ఆ సినిమా చూస్తూ మణిరత్నం ఎప్పుడూ ఎవరికీ తెలియని, నోరు తిరగని జబ్బులు పెడతారు అన్నా. ఆ జబ్బు నాకొచ్చింది. 
చోటా: ఆ టైమ్‌లో డాక్టర్లు ‘రోజుల మనిషే’ అన్నారు కానీ స్టెరాయిడ్స్‌ ఇచ్చిన రెండోరోజు నుంచే మార్పు కనబడింది. మొదట 20 కిలోలు తగ్గిన మనిషి ఆ స్టెరాయిడ్స్‌ వల్ల 25 కిలోలు పెరిగింది. అలా 3, 4 నెలల్లో 45 కిలోలు పెరిగారు.

►ఆ టైమ్‌లో చోటాగారు ఎలాంటి ట్రస్ట్‌ ఇచ్చారు?  
సీతాదేవి: నా లైఫ్‌లో నన్ను బాగా చూసుకున్న వ్యక్తులు ఇద్దరే ఇద్దరు. ఒకరు మా అమ్మ అయితే మరొకరు నా భర్త చోటా. అన్నీ బాగున్నప్పుడు మనతోపాటు ఎవరైనా ఉంటారు. మన కళ్లు మూతబడుతున్నట్లు, చుట్టూ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో ఉన్నప్పుడు మనల్ని ఎవరో ఒకరు చూసుకోవాలి. వాళ్లకు మెడిసిన్‌ అందిందా? లేదా? ఏమైనా తిన్నారా? లేదా ఇవన్నీ శ్రద్ధగా పట్టించుకుంటే అదే మంచి పార్ట్‌నర్‌షిప్‌. అలాంటి పార్ట్‌నర్‌షిప్‌నే ట్రస్ట్‌ అంటాను నేను. నా పార్ట్‌నర్‌ (భర్త) ఈజ్‌ బెస్ట్‌.

►మామూలు మనిషి అయ్యాక మళ్లీ సీరియల్స్‌ నిర్మాతగా కంటిన్యూ కాలేదా?
సీతాదేవి: ఆరోగ్య సమస్య వచ్చాక ఒక సంవత్సరం ఇంట్లోనే ఉన్నాను. మనం అనుకుంటాం గానీ ఏది జరగాలో ఆ దేవుడు అదే జరిగేలా చేస్తాడు. మనం అహంకారంతో ఏదేదో అనుకుంటాం. కానీ జీవితం వేరేలా డిసైడ్‌ చేస్తుంది. ‘నేనొక రోల్‌ మోడల్‌’ అని నాకు నేను అనుకుని బలవంతంగా చేద్దామనుకున్న పనులు కూడా చేయలేకపోయాను. ఎక్కువ వేడి తగలకూడదని, స్ట్రెయిన్‌ అవ్వకూడదని డాక్టర్లు చెప్పారు. షూటింగ్‌ అంటే లైట్స్‌.. ఆ వేడి ఎక్కువగా ఉంటుంది. దాంతో ఇక సీరియల్స్‌ జోలికి వెళ్లలేకపోయాను. అలాగని ఖాళీగా ఉండలేను. నాకు చీరలు, డ్రెస్‌ డిజైన్స్‌  విషయంలో క్రియేటివిటీ ఉంది. చీరలంటే కలక్షన్‌ కోసం ఊళ్లు తిరిగి, తేవాలి. ఈ ఊర్లు పట్టుకుని తిరగడం మనవల్ల కాని పని అని బ్యూటీ పార్లర్‌ అనుకున్నాను. అయితే ఎక్స్‌పీరియన్స్‌ ఏం లేదు కదా ఫ్రాంచైజీ తీసుకోండని కొందరు సలహా ఇచ్చారు. ఓన్‌గా చేయాలన్నది నా ఐడియా. అది కూడా గేటెడ్‌ కమ్యూనిటీస్‌లో నా పార్లర్‌ ఉండాలనుకున్నాను. గేటెడ్‌ కమ్యూనిటీ అనే కొత్త కాన్సెప్ట్‌తో హైదరాబాద్‌లో మొదలైన ఫస్ట్‌ బ్యూటీపార్లర్‌ మా ‘పింక్స్‌ అండ్‌ బ్లూస్‌’దే. 2005 డిసెంబరులో స్టార్ట్‌ చేశాను. సంవత్సరం పాటు మామూలుగా సాగింది. ఇప్పుడు సక్సెస్‌ఫుల్‌గా నడుస్తోంది. ఫ్రాంచైజీ తీసుకోవాల్సిన స్థాయి నుంచి ఇచ్చే స్థాయికి ఎదిగాను. ఇప్పుడు 50కి పైగా బ్రాంచెస్‌ ఉన్నాయి.

►కెరీర్‌ పరంగా ఒకర్నొకరు సలహాలు..?
చోటా: నాకెప్పుడూ చేతిలో నాలుగు సినిమాలు ఉండేవి. ఆ టైమ్‌లో రెమ్యునరేషన్‌ అంటే మూడు, నాలుగు లక్షలు ఇచ్చేవారు. నాలుగు సినిమాలకు అవకాశం వచ్చింది.. వీటిలో ఏది చేస్తే బాగుంటుంది? అని నేనే సీతని అడిగేవాణ్ణి.
సీతాదేవి: నేను డబ్బు గురించి ఆలోచించకుండా సలహా ఇచ్చేదాన్ని. అది ఖచ్చితంగా కరెక్ట్‌ అయ్యేది. అందుకే చోటా ఎప్పుడూ నా డెసిషన్‌ ఫైనల్‌ అంటారు. ఓ సినిమా వాళ్లు 5 లక్షలు ఇస్తారని తెలిసినా కూడా ‘మన పరిస్థితి బాగాలేని టైమ్‌లో వీళ్లు మనకు అండగా నిలిచారు. 2 లక్షలు ఇచ్చినవాళ్లకే మనం చేద్దాం’ అని చెప్పేదాన్ని. ఆ టైమ్‌లో నిజంగా డబ్బు అవసరం ఉన్నా కూడా నేను చెప్పిన సినిమానే చేసేవారు. కెరీర్‌వైజ్‌గా నేనెప్పుడూ తనని సపోర్ట్‌ చేయమని అడగను. కాకపోతే మెయిన్‌ సపోర్ట్‌ ఏంటంటే.. నేను చేసే పనుల్లో ఇంటర్‌ఫియర్‌ అయి ఇలా ఎందుకు చేస్తున్నావు? అలా ఎందుకు చేస్తున్నావు అని అడగకుండా ఉండటమే (నవ్వుతూ). 
చోటా: నేను నాన్‌స్టాప్‌ షూటింగ్స్‌లో ఉంటాను. లేట్‌గా వస్తాను. బర్త్‌ డేలు, పెళ్లి రోజులు, ఫంక్షన్స్‌ అలాంటి సెలబ్రేషన్స్‌ ఏవీ ఉండవు. షూటింగ్స్‌ లో బిజీగా ఉంటే ఇక అవేం ఉంటాయి.
సీతాదేవి: సినిమా అంటే తెలుసు కాబట్టి నేను పట్టించుకోను.

►మరి మీకు సెలబ్రేషన్‌ అంటే ఏంటి?
సీతాదేవి: లాంగ్‌ డ్రైవ్‌లకు వెళ్తుంటాం.. ఇప్పుడు కాదు కానీ పెళ్లైన కొన్నేళ్లు లాంగ్‌ డ్రైవ్‌లకి వెళ్లాం.
చోటా: ఇంట్లో మేం ఇద్దరమే ఉంటాం. మాతో పాటు తొమ్మిదిమంది పనివాళ్లు ఉంటారు. ఇంట్లో చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది.

►మీవారికి పొగరని ప్రచారంలో ఉంది నిజమేనా?
సీతాదేవి: (నవ్వుతూ) మొన్ననే మేం వైజాగ్‌లో ఒకాయన్ని కలవడానికి వెళ్లాం. చోటా అక్కడ ఎవర్నో తిట్టారు. నేను కలవడానికి వెళ్లిన మనిషి ఆ సీన్‌ చూశాడు. అతను ‘మేడమ్, చోటాగారిని తట్టుకోవటం ఎవరివల్లా కాదు. మీరే ఆయన బలం, బలహీనత’ అన్నాడు. నాకు నవ్వాగలేదు. 
చోటా: నాకు ఏదైనా ఇది కరెక్ట్‌ కాదు అనిపిస్తే ముఖానే మాట్లాడేస్తాను. అందరూ కడుపులో పెట్టుకుంటారు, నాకు అది రాదు.

►అలా మాట్లాడినప్పుడు మీ ఇద్దరి మధ్య గొడవలు వస్తుంటాయా?
చోటా: రాకపోవటం ఏముంది? ప్లేటులు పగులుతూనే ఉంటాయి (నవ్వుతూ). 
సీతాదేవి: మొదట్లో అయితే నేను వాదన పెట్టుకునేదాన్ని, ఇప్పుడు కామ్‌గా ఉంటాను.
చోటా: మాకు కోపం వస్తే మా ప్రాపర్టీ మీదే చూపించుకుంటాం తప్ప ఎవరికీ హాని చెయ్యం (నవ్వుతూ)

►ఇటీవల ఓ హీరోయిన్‌ని చోటాగారు స్టేజీ మీదే ముద్దు పెట్టుకున్నారు. అలాంటివి చూసినప్పుడు?
సీతాదేవి: మీరు నమ్ముతారో లేదో కానీ, ఆయన ఇంటర్వూలు, ఫంక్షన్‌లు నేను చూడను. మా కజిన్స్‌ అప్పుడప్పుడూ ఫోన్‌ చేసి, ‘చోటా ఇంటర్వూ్య వచ్చింది, నీ గురించి బాగా మాట్లాడారు’ అంటారు. ఓ అవునా అనుకుంటాను కానీ, నేను చూడను. నా ఎక్స్‌పీరియన్స్‌తో నేర్చుకుంది ఏంటంటే ఎవరూ ఎవరినీ మార్చలేరు. అయితే చోటా ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా దేవుడు నాకు సపోర్ట్‌ చేశాడేమో. 
చోటా: ప్రతిదానికీ దేవుణ్ణి నమ్ముతుంది. నమ్మనివాళ్లు కూడా తనని చూసి నమ్ముతారు. మా ఇంట్లో ఓ అమ్మవారి ఫోటో ఉంది. దానికో కథ ఉంది.

►ఏంటా కథ?
సీతాదేవి: నేను ‘మర్యాదరామన్న’ సీరియల్‌ షూటింగ్‌ చేస్తున్నప్పుడు మా ఆర్ట్‌ డైరెక్టర్‌ భాస్కర్‌రాజుగారు నల్లగా ఉన్న అమ్మవారి బొమ్మను గోల్డ్‌ పెయింటింగ్‌ చేసి చాలా రిచ్‌గా తయారు చేశాడు. ఆ బొమ్మను నాతోపాటు ఇంటికి తెచ్చుకున్నాను. దాదాపుగా 36 ఏళ్లనుండి ఆ అమ్మవారి విగ్రహం నాతోనే ఉంది. అమ్మవారు నవ్వుతూ, నాతో మాట్లాడుతుంది అనే ఫీలింగ్‌తో నేను పూజ చేసుకుంటాను. చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది.

►మీ కపుల్‌ పీస్‌ఫుల్‌గా కనిపిస్తున్నారు కాబట్టే ‘ఇద్దరూ ప్రశాంతంగా ఉన్నారు’ అనే పాయింట్‌తో ఇంటర్వూ్య మొదలుపెట్టాం..
ఇద్దరూ: ‘యస్‌.. వియ్‌ ఆర్‌ పీస్‌ఫుల్‌’. ఇంటర్వ్యూని కూడా ప్రశాంతంగా ముగించాం (నవ్వుతూ).

►మీ ఇద్దరికీ నచ్చే కామన్‌ విషయాలు?
చోటా:  క్లియోపాట్రా. అది మా కుక్కపిల్ల. అదికాక ఇద్దరికీ నచ్చేవి కార్లు, బట్టలు, పర్‌ఫ్యూమ్‌లు. ఇంకా చాలా ఉన్నాయి.

►ఏదైనా ప్రాబ్లమ్‌ వస్తే ఓపెన్‌గా షేర్‌ చేసుకుంటారా?
సీతాదేవి: ఏ ప్రాబ్లమ్‌ వచ్చినా నేను ఈయనతో చెప్పను, టెన్షన్‌ పడతారు. మా అమ్మ ఉన్నప్పుడు ఆవిడతో షేర్‌ చేసుకునేదాన్ని. ‘నీకు ఇదేమన్నా పెద్ద ప్రాబ్లమా? నథింగ్‌ టు వర్రీ, నువ్వు చేయగలవు’ అని ధైర్యం చెప్పేది. ఇప్పుడు అలాంటిదేదైనా ఉంటే మా అమ్మాయి ఐశ్వర్యతో చెబుతాను. షీ ఈజ్‌ డేరింగ్‌ అండ్‌ డ్యాషింగ్‌.
చోటా:  నా ప్రాబ్లమ్స్‌ అన్నింటినీ 100 పర్సెంట్‌ ఈవిడతోనే షేర్‌ చేసుకుంటాను.

►మీ రొటీన్‌ లైఫ్‌ ఎలా ఉంటుంది?
చోటా: ఈవిడ నాకంటే చాలా బిజీ. ఉదయం పది గంటలకల్లా ఆఫీస్‌కి వెళ్లిపోతుంది. ‘పింక్స్‌ అండ్‌ బ్లూస్‌’ మొత్తం 50 బ్రాంచీలను ఇక్కడినుంచే ఆపరేట్‌ చేస్తుంది. పొద్దున్నే నేను జిమ్‌ చేసుకుంటాను. ప్రతిరోజూ నన్ను కలవటానికి ఓ సినిమా బ్యాచ్‌ వస్తారు. జిమ్‌ తర్వాత వాళ్లతో స్పెండ్‌ చేస్తా. 365 రోజులు ఇలానే ఉంటుంది. ఏదైనా సినిమా బాగుంది కానీ ఫ్లాప్‌ అయ్యింది అనే టాక్‌ వస్తే, ఆ సినిమా ఎందుకు ఫ్లాపయ్యిందో చూస్తా. మణిరత్నం సినిమా అయితే హిట్, ఫ్లాప్‌ అని ఉండదు. తప్పనిసరిగా చూస్తాను. 
సీతాదేవి: మొదట్లో ప్రివ్యూ షోలు వేసేవాళ్లు, వాటికి ఇద్దరం కలిసి వెళ్లేవాళ్లం. ఇప్పుడు పెద్దగా చూడట్లేదు. నా ఆరోగ్యరీత్యా కంటిన్యూస్‌గా ఓ మూడుగంటల పాటు సినిమా చూడాలంటే చాలా స్ట్రెయిన్‌ అవుతాను. ఏదైనా సినిమా చూసినా కొంచెం కొంచెంగా చూస్తాను.  – డి.జి. భవాని

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement