
గ్రీన్ టీ, రెడ్ వైన్‌లలో ఉండే ఒక ప్రత్యేకమైన రసాయన మూలకం శరీరంలో విషతుల్యమైన పదార్థాలు ఏర్పడకుండా అడ్డుకుంటాయని టెల్‌అవీవ్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు అంటున్నారు. పుట్టుకతోనే వచ్చే కొన్ని రకాల వ్యాధులను ఈ మూలకం ద్వారా అడ్డుకోవచ్చునని చెబుతున్నారు. జన్యులోపం ఫలితంగా కీలకమైన ఎంజైమ్ ఉత్పత్తి తగ్గిపోయి, జీవక్రియలకు సంబంధించిన కొన్ని సమస్యలు పుట్టుకతోనే వస్తూంటాయని... గ్రీన్ టీ, రెడ్ వైన్‌లలో ఉండే ఎపిగాల్లో కాటెచిన్ గాలేట్, టానిక్ ఆసిడ్‌లు ఈ సమస్యను అధిగమించేందుకు ఉపయోగపడతాయని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త ఎహుద్ గాజిట్ తెలిపారు.
ఈ రెండు రసాయనాలను డీఎన్‌ఏ వంటి వాటితో కలిపి చూసినప్పుడు రెండూ అమైలాయిడ్ వంటి విషాలు తయారుకాకుండా అడ్డుకున్నట్టు గాజిట్ చెప్పారు. కంప్యూటర్ సిములేషన్లను ఉపయోగించినప్పుడు కూడా ఇవే రకమైన ఫలితాలు కనిపించాయని తెలిపారు. వేర్వేరు వ్యాధుల్లో జీవక్రియలను ప్రభావితం చేసే రసాయనాల ప్రభావాన్ని అర్థం చేసుకునేందుకు తమ పరిశోధన సాయపడుతుందని, వైద్యంలో ఇది కొత్త అధ్యాయానికి దారితీస్తుందని గాజిట్ వివరించారు.