స్టార్ల ఇన్వెస్ట్‌మెంట్ ఎక్కడ? | Investment stars Where? | Sakshi
Sakshi News home page

స్టార్ల ఇన్వెస్ట్‌మెంట్ ఎక్కడ?

Published Fri, Apr 4 2014 10:43 PM | Last Updated on Wed, Apr 3 2019 7:03 PM

స్టార్ల ఇన్వెస్ట్‌మెంట్ ఎక్కడ? - Sakshi

స్టార్ల ఇన్వెస్ట్‌మెంట్ ఎక్కడ?

కోట్లు కోట్లు సంపాదిస్తున్నా కొందరు బాలీవుడ్ స్టార్లు ఆర్థిక అంశాల విషయంలో జాగ్రత్తగా ఉంటారు. డబ్బుని జల్సాల కోసం ఖర్చు చేసేయకుండా..అలాగని పూర్తిగా బ్యాంకుల్లోనే దాచేయకుండా .. మంచి రాబడులు ఇచ్చే సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తారు. అక్షయ్ కుమార్, హృతిక్ రోషన్, షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్ లాంటివారు ఈ కోవకి చెందినవారే. కొత్త కంపెనీలు, ప్రాజెక్టుల్లో ఇన్వెస్ట్ చేస్తుండటం వీరి హాబీ.

ఉదాహరణకు ముంబైలోని ఒక పెద్ద రియల్ ఎస్టేట్ సంస్థకి చెందిన చాలా మటుకు రెసిడెన్షియల్ ప్రాజెక్టుల్లో అక్షయ్ కుమార్ ఇన్వెస్ట్ చేస్తారు. కొత్త ప్రాజెక్టు మొద లవగానే 4-5 ఫ్లాట్స్‌ని ఆయన కొంటారట. నిర్మాణం పూర్తి కావొచ్చే దశలో వాటిని అమ్మేస్తారట. వీటిలో పెట్టుబడులు వ్యాపారపరమైనవే తప్ప.. సొంతానికంటూ ఆయన వీటిని అట్టే పెట్టుకోరు. ఇక, కొత్త కంపెనీల్లో పెట్టుబడుల విషయాల కొస్తే.. బేబీఓయ్‌డాట్‌కామ్ అనే ఈ-కామర్స్ సంస్థలో కరిష్మా కపూర్‌కి 26 శాతం వాటాలు ఉన్నాయి.

ప్రెగ్నెన్సీ, పిల్లలు, తల్లుల సంరక్షణ మొదలైన వాటి అంశాలకు సంబంధించిన ఉత్పత్తులను ఈ కంపెనీ అమ్ముతోంది. యాత్రాడాట్‌కామ్ అనే ట్రావెల్ పోర్టల్‌లో సల్మాన్ ఖాన్ ఇన్వెస్ట్ చేశారు. అదీ యాడ్ ఫర్ ఈక్విటీ తరహాలోనట. అంటే, సదరు సంస్థల ప్రకటనలు, ప్రమోషన్ కార్యకలాపాల్లో పాల్గొన్నందుకు గాను యాక్టర్లకు ఆయా సంస్థల్లో కొంత వాటా లభిస్తుంది. ఆ కంపెనీ ఎప్పుడైనా నిధుల సమీకరణ కోసం సెకండరీ మార్కెట్లో వాటాలు అమ్మిన పక్షంలో సదరు యాక్టర్ కూడా తన వాటాలను అమ్ముకోవచ్చు.
 
ఇక బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ పెట్టుబడుల విషయంలో అందరికన్నా ముందే ఉంటారు. రాబడి వచ్చే ఏ అవకాశాన్నీ వదులుకోరు. పిల్లల ఇన్‌డోర్ థీమ్ పార్క్స్ తయారు చేసే కిడ్జానియా సంస్థకు చెందిన ఫ్రాంచైజీ ఇమాజినేషన్ ఎడ్యుటెయిన్‌మెంట్‌లో ఆయన ఇన్వెస్ట్ చేశారు. షారుక్‌కే చెందిన రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థకు ముంబైలో ఆఫీసు ఉంది. దీని ఆవరణలోనే స్టార్‌బక్స్ స్టోర్ కూడా ఉంది.

స్టార్‌బక్స్‌కి అక్కడ చోటు ఇచ్చినందుకు గాను.. అక్కడ దానికి వచ్చే ఆదాయంలో కొంత భాగాన్ని షారుఖ్ కూడా అందుకుంటారట. క్రిష్ 3 స్టార్ హృతిక్ రోషన్ సైతం ఇన్వెస్ట్‌మెంట్ల విషయంలో ముందు వరుసలోనే ఉన్నారు. మిగతా వారితో పోలిస్తే హృతిక్ రోషన్ ఇప్పుడిప్పుడే ఎదిగే సంస్థల్లో ఇన్వెస్ట్ చేసేందుకు మక్కువ చూపుతారు. ఇప్పటికే ఒక ఆన్‌లైన్ రిటైలింగ్ కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన హృతిక్ ఈ మధ్యే.. స్పోర్ట్స్ స్టేడియాలు నిర్మించే సంస్థలో కూడా కొంత  పెట్టుబడి పెట్టారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement