ఆత్మవిశ్వాసానికి... దారి ఇది!
ఆత్మవిశ్వాసం తోడుంటే అపజయాన్ని ఎదుర్కొనే బలమైన ఆయుధం మన చేతిలో ఉన్నట్లే. అన్నీ ఉన్నా... ఆత్మవిశ్వాసం లేకపోతే విజయం సిద్ధించదు.
ఆత్మవిశ్వాసాన్ని మీలో ప్రోది చేసుకోవడానికి అవసరమైన కొన్ని విషయాలు...
ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండండి. మన ఆలోచన మీదే మన అడుగు ఆధారపడి ఉంటుంది. ప్రతి విషయాన్నీ ప్రతికూలంగా ఆలోచిస్తే, పడే అడుగు సరియైన మార్గంలో పడదు.
మీకు మీరుగా సొంత నియమాలు రూపొందించుకోండి. వాటిని పాటించండి. అంతే తప్ప, ఆ నియమాలను బ్రేక్ చేసే ప్రయత్నం చేయకండి. చదువుకు సంబంధించి ప్రణాళికలకు ప్రాధాన్యం ఇవ్వండి. కాలాన్ని వృథా చేయకండి.
ఉత్తేజపరిచే జీవితచరిత్రలను చదవండి. మిమ్మల్ని ఆకట్టుకున్న వాక్యాలను పేపర్‌పై పెద్ద అక్షరాలలో రాసి గోడకు అంటించండి. వాటిని చదివినప్పుడల్లా ఒక కొత్త శక్తి వస్తుంది.
ఎప్పుడూ నిరాశగా ఉండే వాళ్లతో, నిరాశగా మాట్లాడే వాళ్లతో కాకుండా చురుగ్గా ఉండేవాళ్లు, నాలుగు విషయాలు తెలిసినవాళ్లతో స్నేహం చేయండి.
గెలుపే అంతిమం కాదు... దాని తరువాత ఓటమి రావచ్చు. ఓటమే అంతిమం కాదు... దాని తరువాత గెలుపు కూడా వస్తుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఓటమికి భయపడాల్సిన అవసరం లేదు.
మీలో ఉన్న బలాలనూ, బలహీనతలనూ గుర్తించండి. బలాల్ని మరింత మెరుగుపరుచుకోండి. బలహీనతలను సరిదిద్దుకోండి.
ఔట్‌డోర్ గేమ్స్ ఆడండి. దీని ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యకరమైన ఆలోచనలు వస్తాయి.
మిమ్మల్ని మీరు విజయం దిశగా ప్రేరేపించుకోండి. ఉత్తేజాన్నీ, ప్రేరణనూ నింపే ఉపన్యాసాలను వినండి.