
మా ఆయన బంగారం
ఒకరికొకరం...
అమీర్‌ఖాన్ భార్యను అయినందుకు నేను గర్విస్తున్నాను. అంతమాత్రాన నా సొంత అస్తిత్వాన్ని కోల్పోవాలను కోవడం లేదు. సృజనాత్మకమైన పనుల్లో అమీర్ నన్ను తరచుగా ప్రోత్సహిస్తుంటారు. విలువైన సలహాలు ఇస్తుంటారు. అదృష్టమేమిటంటే మా ఇద్దరి అభిరుచులు ఒకేలా ఉంటాయి. ఇద్దరు వ్యక్తులు బాగా కలిసిపోవడానికి ఇద్దరికీ ఇష్టమైన మాధ్యం ఏదైనా ఉండాలి. మా ఇద్దరి తొలి ప్రాధాన్యం ‘సినిమా’ కాబట్టి మేము బాగా కలిసిపోయాం.
రచన కావచ్చు, దర్శకత్వం కావచ్చు... ‘నేను ఫలానా పని చేయాలనుకుంటున్నాను’ అని అంటే ఆయన ఎంతో ప్రోత్సహిస్తారు. అండగా నిలబడతారు. అంతే తప్ప నిరాశ పరిచే మాటలేవీ మాట్లాడరు. ఆయన మాటలతో నాకు ఎక్కడ లేని ఉత్సాహం వస్తుంది. ‘‘ఒత్తిడితో పని చేయడం కంటే పని చేయకపోవడమే మంచిది’’ అంటారు ఆయన. నేను ఎప్పుడు ఒత్తిడికి గురైనా ఈ సలహాను ఒకటికి రెండుసార్లు గుర్తు తెచ్చుకుంటాను.
మేమిద్దరం భార్యాభర్తలం మాత్రమే కాదు... మంచి స్నేహితులం కూడా. ఒకరిని ఒకరు గౌరవించుకుంటాం. అన్నిట్లోకీ ఆయనలో నాకు బాగా నచ్చేది... హాయిగా నవ్విస్తారు. మనసును తేలికపరుస్తారు.
కిరణ్‌రావు, రచయిత్రి - నిర్మాత - దర్శకురాలు