
ఫ్యాషన్
కృష్ణ అన్నది ఒక భావం ఒక స్ఫురణ ఒక ప్రకృతి స్పర్శ.. వాటి కోసం ఎదురు చూస్తూ తన్మయత్వం చెందే ప్రాణి రాధ. రాధా గోవిందం సీరీస్‌లో వచ్చిన లెహెంగా డిజైన్లు ఇవి తన్మయత్వాన్ని మీరూ ధరించండి.
ఆధునిక మళ అందమైన చీరను లేదా లెహెంగాను ధరించడమంటే సంప్రదాయానికి అద్దం పట్టడమే అని భావిస్తుంది. అందుకు తగ్నిట్టుగానే సంస్కృతినీ, సంప్రదాయాన్నీ కలుపుకుంటూ ఆధ్యాత్మికతకూ కొత్త సొబగులు దిద్దుకుంటుంది. ఆధునిక పోకడలు పోతూనే ధరించే దుస్తులకు అసలైన అందం తీసుకురావడానికి రాబోయే వసంతరుతువు స్వాగతం పలకడానికి సిద్ధం అవుతుంది.
ఈ లెహంగాలకు ప్యానెల్స్ హంగామా అవసరం లేదు. ఎంబ్రాయిడరీ జిలుగులు అక్కర్లేదు. రంగుల ఫ్యాబ్రిక్, కుచ్చులతో స్కర్ట్‌ని తీర్చిదిద్దితే చాలు. దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్‌లు, ప్లెయిన్ దుపట్టాలు, ప్యాచ్‌లుగా అల్లుకుపోయిన అంచులు గల ఈ దుస్తులను ధరించి ఏ వేడుకలకైనా అద్భుతం అనిపించేలా సిద్ధం కావచ్చు.
మన చేనేతలు
మగ్గం మీద నేసిన ఖాదీ, టస్సర్, మల్ మల్, పట్టు ఫ్యాబ్రిక్స్‌ను ఎంచుకోవచ్చు. ప్లెయిన్‌తోనే వండర్స్ సృష్టించవచ్చు. ఎంబ్రాయిడరీ జిలుగులు వీటికి అక్కర్లేదని ఇలాంటి డిజైన్స్ చూస్తే మీకూ ఇట్టే తెలిసిపోతుంది.
మెరుపుల హంగుల్లేని బుటీలు
ప్లెయిన్ ఫ్యాబ్రిక్ మీద సెల్ఫ్ డిజైన్లు, చిన్న చిన్న బుటీలు ఆకట్టుకుంటాయి. వాటికి కాంట్రాస్ట్ అంచులు అందాన్ని తీసుకువస్తాయి. అలంకరణ హంగామా ఎంత తక్కువగా ఉంటే ఈ దుస్తుల్లో అంతబాగా కనిపిస్తారు. ఆభరణాల హంగులు లేకుండా అలలుగా ఎగిసే కురులు ఈ డ్రెస్‌కి మరింత సొగసును తీసుకువస్తాయి.
ప్లెయిన్‌కి మల్టీకలర్స్ జత
ప్లెయిన్ క్లాత్ అది కాటన్ అయినా పట్టు అయినా స్కర్ట్ భాగానికి తీసుకోవాలి. ఫ్లెయిర్ విశాలంగా రావాలంటే మాత్రం ఆర్గంజా ఫ్యాబ్రిక్ నప్పుతుంది. దీనికి పూర్తి కాంట్రాస్ట్ బ్లౌజ్, ఒక ప్లెయిన్ మరో ఎంబ్రాయిడరీ చేసిన బార్డర్‌ని జత చేస్తే ఇలా చూడముచ్చటైన కళ ఉట్టిపడుతుంది. పండగకు కొత్త భాష్యం చెబుతుంది.
- నిర్వహణ ఎన్.ఆర్.