చీకటంటే మాకు భయం లేదు
ఎంపవర్‌మెంట్
ఉద్యోగం చేస్తున్న మహిళలందరి ఇళ్లు నగరం నడిబొడ్డునే ఉండవు. షాపింగ్‌మాల్స్‌లో పనిచేసే సేల్స్‌గాళ్స్ అయితే రాత్రి పది దాటే వరకు పని చేయక తప్పదు. అక్కడి నుంచి బయటపడి బస్టాపుకొచ్చేటప్పటికీ బస్సుల ఫ్రీక్వెన్సీ తగ్గిపోయి ఉంటుంది. రోడ్లు దాదాపుగా ఖాళీ. అది సంపన్నుల కారు దూసుకువెళ్లడానికి అనువైన వాతావరణమే. కానీ సామాన్యులకు మాత్రం... సాధారణ రవాణా సాధనాలు దొరకని గడ్డు సమయం. ఎదురు చూడగా చూడగా ఓ బస్సు వస్తుంది. ఉద్యోగినులు అందులో మద్యం తాగిన మగవాళ్లతో కలిసి ప్రయాణం చేయాలి. త
ర్వాత బస్సు మారాలి, తమ ఏరియా బస్సు వచ్చే వరకు మళ్లీ ఎదురుచూపు. అదీ వస్తుంది. కాలనీలోకి తీసుకెళ్లే బస్సులు అప్పటికే బంద్ అయిపోయుంటాయి. షేర్ ఆటో పట్టుకుని ఇంటికి దగ్గర పాయింట్‌లో దిగాలి. అక్కడి నుంచి నడక తప్పదు. ఒక సాధారణ మహిళ తన కాళ్ల మీద తాను నిలబడడానికి, ఆర్థిక స్వావలంబన సాధించడానికి, భర్త సంపాదనకు తోడుగా మరికొంత సంపాదించి పిల్లలను ఆరోగ్యంగా పెంచి, చక్కగా చదివించుకోవడానికి చేస్తున్న రోలర్‌కోస్టర్ రైడ్ ఇదంతా.
ఇలా ప్రతి నగరంలో కొన్ని వందల మంది యువతులు ఏడాదికి మూడువందల అరవై ఐదు రోజులూ చేస్తున్న పోరాటం. ఈ చక్రం ఎక్కడో గతి తప్పి ఏ అమ్మాయి మీదనో అఘాయిత్యం జరిగితే... పోలీసు పెద్దల నుంచి మంత్రులు, ఎంపీలు వంటి చట్టాల్ని రూపొందించే పెద్దలు కూడా ‘ఆ సమయంలో ఆడపిల్లకు రోడ్డు మీద ఏం పని’ అని అలవాటుగా నోరుజారుతుంటారు. అంతే తప్ప, ‘ఆ అమ్మాయి ఎక్కడ పని చేస్తోంది, అక్కడ ఎన్ని గంటలు పనిచేయించుకుంటున్నారు, లేబర్ చట్టాల ప్రకారం రాత్రి ఎనిమిది నుంచి ఉదయం ఆరు గంటల వరకు మహిళల చేత పని చేయించుకోకూడదనే నిబంధనలేవీ ఆ పెద్దలకు గుర్తుకు రావు, గుర్తు చేసుకోరు.
మహిళాసంఘాల వాళ్లు మనసు రగిలి పిడికిళ్లు బిగించినప్పుడు మాత్రం ‘నేనా ఉద్దేశంతో అనలేదు, నాకు నిజానికి మహిళలంటే చాలా గౌరవం’ అంటూ తప్పించుకుంటారు. ఈ కామెంట్‌ల మాట అటుంచితే, దేశవ్యాప్తంగా ఇప్పుడు మహిళలు రాత్రి పూట పనిచేయడానికి అవసరమైన వసతులను ఏర్పాటు చేసే విషయమై అన్ని రంగాలలోనూ సానుకూల ప్రతి స్పందన లభించడం సంతోషకరమైన సంగతి. కర్ణాటక ప్రభుత్వం అయితే ఆచరణలోకి దిగింది కూడా.
ఐటీ, ఐటీ అనుబంధ రంగాల్లో మహిళలు రాత్రి పూట పని చేయడానికి వెసులుబాటు ఇప్పటికే ఉన్నప్పటికీ అది కూడా ఆయా కంపెనీలు ప్రభుత్వాన్ని కోరడంతో ఇచ్చిన వెసులుబాటే తప్ప, మన ఆడపిల్లలు భద్రంగా ఉద్యోగం చేసుకోవాలనే సంక్షేమభావంతో వచ్చినది కాదు అనే అభిప్రాయం ఉంది. ఈ నేపథ్యంలో యాజమాన్యాలు పగటి పని వేళలకే పరిమితం కాలేని మాన్యుఫాక్చరింగ్, బయోటెక్నాలజీ, రీటైల్ రంగాల్లో కూడా స్త్రీలు విధులు నిర్వహించే వెసులుబాటు కల్పిస్తూ చట్టాలు తీసుకురావడానికి కర్నాటకలో ప్రయత్నాలు మొదలయ్యాయి.
లేబల్ డిపార్ట్‌మెంట్ ఇప్పటికే ‘షాప్స్ అండ్ కమర్షియల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ 1961, ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948’లలో సవరణలను ప్రతిపాదించింది. ప్రభుత్వం ఆ సవరణలను ఆమోదించాల్సి ఉంది. అదే జరిగితే చిన్నపెద్దా అన్నీ కలిపి దాదాపుగా నాలుగు లక్షల వ్యాపార సంస్థలున్న కర్ణాటకలో లక్షలాది మంది మహిళలకు ఉద్యోగవకాశాలు పెరుగుతాయి.
‘మహిళలకు అన్ని రంగాల్లో సమభాగస్వామ్యం’ సాధించే పోరాటంలో ఇదో మైలురాయి. మహిళా ఉద్యోగులకు భద్రత, రక్షణ, రవాణా సౌకర్యాలను కల్పించడం ఈ సవరణల్లో ప్రధానంగా ఉంటుంది. దాంతో మహిళలు నైట్‌షిఫ్టుల్లో పని చేసే వాతావరణం ఏర్పడుతుంది. ఇది స్వాగతించాల్సిన ప్రతిపాదన అంటూ బయోకాన్ స్థాపకురాలు కిరణ్‌మజుందార్ షా వ్యాఖ్యానించారు.