జుట్టుకు గట్టి పోషణ
బ్యూటిప్స్
దుమ్ము, ధూళి పోషకాహార లోపాలు శరీర ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా వెంట్రుకల కుదుళ్లు బలహీనంగా మారి జుట్టు రాలడం, చండ్రు ఏర్పడటం, వెంట్రుకలు నిర్జీవంగా కనిపించడం వంటి సమస్యలు తలెత్తుతాయి. వీటికి పరిష్కారంగా..! తలలో చుండ్రు సమస్య ఉంటే విరుగుడుగా ఆలివ్ ఆయిల్ ప్యాక్ వేసుకోవాలి. ఇందుకు టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్, నాలుగైదు చుక్కల నిమ్మరసం, టీ స్పూన్ నూనె కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి, మృదువుగా మర్దనా చేయాలి. 20 నిమిషాల తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి. వారానికి 2-3 సార్లు ఈ విధంగా చేస్తూ ఉంటే చుండ్రు సమస్య తగ్గుతుంది.
వెంట్రుకలకు సరైన మాయిశ్చరైజర్ అందకపోతేనే పొడిబారడం, జీవం లేనట్టుగా ఉండటం, చిట్లడం వంటి సమస్యలు తలెత్తుతాయి. వేళ్లకు కొద్దిగా ఆలివ్ ఆయిల్‌ను అద్దుకుంటూ వెంట్రుకలకు నూనె పట్టించాలి. మరుసటి రోజు ఉదయం తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో 2 రోజులు చేస్తూ ఉంటే వెంట్రుకలు మృదుత్వాన్ని కోల్పోవు. చిట్లడం వంటి సమస్యలు తలెత్తవు.
వెంట్రుకలు రాలడం వంటి సమస్యలను నివారించడమే కాదు, వాటి పెరుగుదలకూ దోహదం చేస్తుంది ఆలివ్ ఆయిల్. వెంట్రుక కుదురు బలంగా అవాలంటే దానికి తగిన పోషకాలు అందాలి. ఈ సుగుణాలు ఆలివ్ ఆయిల్‌లో ఉండటం వల్ల వారానికి ఒక్కసారైనా ఆలివ్ ఆయిల్‌ను ఉపయోగించాలి. దీని వల్ల వెంట్రుకల పెరుగుదల బాగుంటుంది. రాలడం సమస్య దరిచేరదు.
ఆలివ్ ఆయిల్-కొబ్బరినూనె సమపాళ్లలో కలిపి వేడి చేయాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి, అరగంట తర్వాత తలస్నానం చేయాలి. ఈ జాగ్రత్త వల్ల వెంట్రుకల మృదుత్వం దెబ్బతినదు. రాలడం వంటి సమస్య ఉత్పన్నం కాదు. ఆలివ్ ఆయిల్‌ను పెట్టిన తర్వాత వేడి నీళ్లలో ముంచి, పిండిన టవల్‌ను (టర్కీటవల్) తలకు చుట్టాలి. దీని ద్వారా వెంట్రుక కుదుళ్లలో ఉన్న మురికి, మృతకణాలు తొలగిపోయి, రక్తప్రసరణ మెరుగై వెంట్రుకలు రాలడం అనే సమస్య దరిచేరదు.